– స్పష్టమైన ప్రతిపాదనతో రావాలని ఇరాన్‌కు సూచన
– ట్రూత్ సోషల్ మీడియాలో వెల్లడి
వాషింగ్టన్, ఏప్రిల్ 22: ఇరాన్, అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణను పొడిగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ నాయకత్వం ఒక సమగ్ర ప్రతిపాదనను సమర్పించే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య ఈ నెల 8న కాల్పుల విరమణ ఒప్పందం మరికొద్ది గంటల్లో ముగియనుందనగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, పాకిస్థాన్ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకే ముఖ్యంగా పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు సైనిక చర్యను వాయిదా వేసి దౌత్య చర్చలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు. సీజ్ ఫైర్ కొనసాగుతున్న సమయంలోనే ఇరాన్‌పై సముద్ర దిగ్భంధనాన్ని కొనసాగించాలని సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయి.. అలాంటి పరిస్థితుల్లో వారు ఏకీకృత ప్రతిపాదనతో రావడానికి సమయం అవసరం.. అందుకే ఈ దాడిని నిలిపివేసి సీజ్‌ఫైర్ పొడిగించామని తెలిపారు. కాగా, బ్లాకేడ్ కొనసాగించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఇరాన్ మండిపడింది. ఇది కాల్పుల విరమణకు వ్యతిరేకమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచీ విమర్శించారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడమంటే యుద్ధ చర్యే అని సమానమని అన్నారు. తమ ప్రయోజనాలను రక్షించుకోవడం ఇరాన్‌కు తెలుసని స్పష్టం చేశారు. ఇక పాక్‌లో జరగాల్సిన చర్చలకు హాజరుకాకూడదని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు టస్నీమ్ వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా అతిగా డిమాండ్లు చేస్తున్నదని, అవి ఒప్పందానికి అడ్డుగా మారుతున్నాయి కాబట్టి చర్చల్లో పాల్గొనడం వ్యర్థమని అభిప్రాయపడుతున్నట్లు పేర్కొంది. ఇదిలావుంటే ఇరాన్‌తో ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా ఒక హెచ్చరిక జారీ చేసింది. ఈ కాల్పుల విరమణ అనేది ‘పరిమిత కాలం’ కోసం కాదని, ఇరాన్ తన బాధ్యతలను నెరవేర్చడానికి ఒక నిర్దిష్ట సమయం మాత్రమే కేటాయించామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన యాక్సియోస్ పత్రికతో మాట్లాడుతూ ఇరాన్ నిబంధనలను పాటించకపోతే కాల్పుల విరమణను ఎప్పుడైనా రద్దు చేసే అవకాశం ఉందన్నారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరాన్‌కు ఒక అవకాశం ఇచ్చామని, దీన్ని ఆ దేశం బలహీనతగా భావించరాదని అన్నారు. అణ్వాయుధ కార్యక్రమాలు, ప్రాంతీయ ఉగ్రవాద సంస్థలకు మద్దతు లేదా ఇతర దౌత్యపరమైన అంశాలపై ఇరాన్ నుంచి ఆశించిన మార్పులు రాకపోతే తదుపరి చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





