– కాళేశ్వరం వ్యవహారంలో ..
– జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక నిలిపివేత
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదికననుసరించి చర్యలు తీసుకునే విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ధర్మాసనం నిలిపివేసింది. ఘోష్ కమిషన్ చట్టబద్ధమేనని, అయితే దాని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిటిషనర్లు కేసీఆర్, హరీష్ రావులతోపాటు స్మిత సబర్వాల్, ఎస్కే జోషిలకు ఊరట లభించిన్లట్లయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చిలో జీవో నంబర్ 6ను జారీ చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. అయితే ఘోష్ కమిషన్ ఏర్పాటు, విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు, స్మిత సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానంలో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ పిటిషన్లపై ఈనెల 8న వాదనలు ముగియగా తీర్పును హైకోర్టు ఈరోజుకు(22వ తేదీకి) వాయిదా వేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 6ను సమర్థించిన హైకోర్టు.. దాని 6ను ఆధారంగా ఏర్పాటైన కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చ జరగకుండానే మీడియా ముందుకు తీసుకురావడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పునిచ్చింది. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుతో కేసీఆర్కు ఊరట లభించిందని మాజీ సీఎం అడ్వకేట్ గండ్రమోహన్ రావు తెలిపారు. సెక్షన్ 8 కింద విచారణ జరగలేదని, హైకోర్టు తీర్పుతో కమిషన్ రిపోర్టును చెత్తలో పడేయవచ్చని అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించినప్పటికీ దాని నివేదికను పరిగణనలోకి తీసుకుని సీబీఐ దర్యాప్తు చేయరాదని న్యాయస్థానం చెప్పిందని ఆయన తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





