-ఘోష్ కమిషన్ రిపోర్టు చెల్లదని తేల్చడంపై హర్షం
– చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డకు మరమ్మతులు చేయాలి
– కాళేశ్వరంను కాపాడండి.. సాగునీరు అందించండి
– రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం
– ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
– హైకోర్టు తీర్పు నేపథ్యంలో మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును, ఘోష్ కమిషన్ రిపోర్టును తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రాథమిక హక్కులు మరియు సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఇచ్చిన రిపోర్టు చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే ఎన్నికల ముందు, గడచిన రెండేళ్లుగా కాంగ్రెస్ రకరకాల లీకులు ఇస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ వచ్చింది. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మాని కుంగిన రెండు పిల్లర్లను వెంటనే మరమ్మతులు చేసి రైతాంగానికి సాగునీరు అందించాలి. ఇప్పటికే రెండున్నరేళ్లు వృథా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి. అందులో పదుల సంఖ్యలో ఉండే పిల్లర్లలో రెండు మాత్రమే కుంగితే, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని అబద్ధాన్ని పదేపదే చెబుతూ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి పాల్పడింది. ఈ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారం. హైదరాబాద్ తో సహా 70 శాతం తెలంగాణకు తాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అద్భుత ప్రాజెక్టు. రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రాజకీయాలు చేయకూడదు. నిజానికి ఒక 100, 200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ద్వారా మరో రెండు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. కానీ గత రెండున్నరేళ్లుగా ల్యాండ్ అక్విజిషన్ కు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మోటార్లు, రిజర్వాయర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, కేవలం కుట్రతోనే ఆపారు. ఎన్డీఎస్ఏ అనేది కేవలం ఇంజనీరింగ్ టెక్నికల్ రిపోర్ట్ మాత్రమే. దాంట్లో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఉండదు. మళ్లీ అవే చిల్లర రాజకీయాలు చేస్తే న్యాయస్థానాలు మరోసారి తగిన బుద్ధి చెబుతాయి. అసెంబ్లీ సాక్షిగా రెండున్నరేళ్లుగా ప్రభుత్వ వైఫల్యాలను, స్కాములను బయటపెడుతున్నాం. సమాధానం చెప్పుకోలేక మమ్మల్ని సస్పెండ్ చేయడమే కాకుండా, నేను అవినీతిని బయటపెట్టిన 48 గంటల్లోనే నా మీద రెండు ఎంక్వైరీలు వేశారు. తప్పులు సరిదిద్దుకోవడం మానేసి ప్రతిపక్షాలను వేధించడం, అక్రమ కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారు. మేము కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన ఉద్యమకారులం, రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా మా పోరాటం ఆగదు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వరి ధాన్యంలో 5 కిలోల తరుగు తీస్తున్నారు, మొక్కజొన్న, సెనగలు, పొద్దుతిరుగుడు కొనే దిక్కు లేదు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా పడలేదు. కరెంట్ లేక రైతులు రోడ్లెక్కినా ఏ ఒక్క మంత్రీ పట్టించుకోవడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు, యాజమాన్యాలు రోడ్డున పడ్డారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడింది. రేవంత్ రెడ్డి ముందు వీటి మీద దృష్టి పెట్టాలి. రాజకీయ కాలయాపన చేస్తే ప్రజాక్షేత్రంలో పీఠం కదిలిపోవడం ఖాయం. భయకంపితులై మాట్లాడుతున్న రేవంత్ మాటలే దీనికి నిదర్శనమన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలకు ఎలాంటి విలువ లేదు. ముందుగా గోదావరి బనకచర్ల లింక్ ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలి. ఆంధ్రాకు ప్యాకేజీలు, ప్రాజెక్టులు వస్తుంటే తెలంగాణకు ఏమొస్తుందో సంజయ్ సమాధానం చెప్పాలి అని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని హరీశ్ రావు ప్రకటించారు. మహాలక్ష్మి పథకం పెట్టి ఆర్టీసీకి ఇవ్వాల్సిన 3 వేల కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. నిధులు లేకపోవడంతో కార్మికులకు డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నారు. బడ్జెట్ లో చూపిస్తున్నా నిధులు విడుదల చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఏటా 1500 కోట్ల గ్రాంట్ ఇచ్చాం. తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





