– నామినేషన్ల ప్రక్రియకు పూర్తి సమయం కేటాయించండి
– ఇన్‌చార్జి మంత్రులకు సీఎం సూచన
– పీసీసీ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైందని, జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ముఖ్య నాయకులతో సమావేశమై రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇన్‌చార్జి మంత్రులకు, పీసీసీ అధ్యక్షుడికి సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నామన్నారు. నామినేషన్ల ప్రక్రియకు పూర్తిస్థాయి సమయం కేటాయించాలన్నారు. పీసీసీ లీగల్ టీమ్ నుంచి నామినేషన్ దరఖాస్తులకు సంబంధించి మోడల్ ఫార్మాట్ క్షేత్రస్థాయికి పంపించాలన్నారు. న్యాయపరమైన అంశాలను నివృత్తి చేసేందుకు గాంధీ భవన్‌లో కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలని, ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారు కమిటీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. అప్పటివరకు వాటిపై రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని పార్టీ నాయకులకు, మంత్రులకు సూచించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగే వాదనలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సమావేతశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





