18 నుంచి 23 వరకు పర్యాటక వారోత్సవాలు

– బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక బ్రోచర్‌ను పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావ్ణు సచివాలయంలోని తన చాంబర్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని 18న హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియంలో మంత్రి జూపల్లి ఈ పర్యాటక వారోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయన్నారు. రాష్ట్రంలోని చారిత్రక వారసత్వ సంపద, సంస్కృతి, ఎకో-టూరిజం ప్రదేశాలను ప్రమోట్ చేయడంతోపాటు, పర్యాటక రంగం ద్వారా లభించే ఉపాధి అవకాశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. భాషా సాంస్కృతిక శాఖ, పురావస్తు (హెరిటేజ్) శాఖ, నిథమ్ సంస్థల సమన్వయంతో పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా హెరిటేజ్ వాక్‌లు, పర్యాటక అవగాహన సదస్సులు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో సమావేశాలు, జిల్లాస్థాయిల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. పర్యాటక రంగానికి తిరుగులేని ఆదరణ ఉందన్న మంత్రి.. ప్రపంచ ప్రసిద్ధ రామప్ప దేవాలయం, నాగార్జునసాగర్, బుద్ధవనం, ఆలంపూర్ జోగులాంబ ఆలయం, లక్నవరం చెరువు, బొగత జలపాతం, పైగా సమాధులు, రేమండ్స్ టూంబ్స్, గన్‌ఫౌండ్రీ, ఖజానా బిల్డింగ్, పానగల్ మ్యూజియంతోపాటు వరంగల్‌లోని చారిత్రక కట్టడాలు స్వదేశీ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని చెప్పారు. మౌలిక వసతుల కల్పన, వారసత్వ సంపద పరిరక్షణ, సాంస్కృతిక పర్యాటక ప్రచారం, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని సమీకృతంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కార్యాచరణలో భాగంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా జానపద కళా ప్రదర్శనలు, పేరిణి, శాస్త్రీయ నృత్యాలు, సాహిత్య కార్యక్రమాలు, సంగీత కచేరీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 23న హైదరాబాద్‌లో ‘డెస్టినేషన్ తెలంగాణ: స్ట్రాటజీస్ ఫర్ ది నెక్ట్స్ ఫ్రాంటియర్ ఆఫ్ టూరిజం అనే ఇతివృత్తంతో పర్యాటక సదస్సు (టూరిజం కాన్‌క్లేవ్) – 2026’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సులో పర్యాటక రంగ భాగస్వాములు, హాస్పిటాలిటీ నిపుణులు, విధాన నిర్ణేతలు పాల్గొని తెలంగాణను దేశంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన భవిష్యత్తు వ్యూహాలపై చర్చించనున్నారని వివరించారు. కార్యక్రమంలో పర్యాటక, భాషా సాంస్కృతిక, పురావస్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *