– రెండున్నరేళ్లలోనే రూ.35వేల కోట్లు రైతులకు అందచేత
– రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాం
– బిఆర్‌ఎస్ పాలనలో క్రాప్ డ్యామేజ్‌కు కెసిఆర్ ఒక్క పైసా ఇవ్వలేదు
– ఖమ్మం పర్యటనలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క
ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 9: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతాంగానికి అవసరమైన సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందిస్తున్నామని పేర్కొన్నారు. గురువారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో డిప్యూటీ సీఎం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చింతకాని మండలం జగన్నాధపురం మత్కేపల్లి క్రాస్ రోడ్డులో రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులు అందరినీ ఆహ్వానించామని పేర్కొన్నారు. పదేళ్ల పాటు పాలించిన బీఆర్‌ఎస్ రైతు భరోసాకు రూ.75 వేల కోట్లు ఖర్చు చేసిందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు కేవలం రెండున్నరేళ్లలో రూ.35 వేల కోట్లను రైతులకు అందజేసిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హయాంలో క్రాప్ డ్యామేజ్‌కి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో రైతుల కోసం పని చేస్తోందని స్పష్టం చేశారు. రైతుభరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లో ఎనిమిది ఎకరాల చొప్పున పూర్తిస్థాయిలో అందరికీ రూ.8759 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. రైతు ఆశీర్వాద సభలో మరో రూ.1900 కోట్లు రైతు భరోసాకు తొమ్మిది ఎకరాల నుంచి యాభై ఎకరాల వరకూ విడుదల చేయనున్నామని తెలిపారు. అన్నదాతలు రైతు ఆశీర్వాద సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న మెగా రైతు మేళాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, జిల్లా కలెక్టర్ దివాకరతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సాంకేతికతపై అవగాహన కల్పించడమే ఈ మెగా రైతు మేళా ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.
మెగా రైతు మేళా ప్రాంగణంలోనే శుక్రవారం మధ్యాహ్నం రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ అభివృద్ధి చర్యలపై సీఎం రైతులను ఉద్దేశించి ప్రసంగణించనున్నారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జునసాగర్, ఎస్‌ఆర్‌ఎస్పీ, కడెం వంటి ప్రాజెక్టులు ఇప్పటికీ బలంగా ఉన్నాయని, బీఆర్‌ఎస్ నిర్మించిన ప్రాజెక్టుల పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాకు గత ప్రభుత్వాలు తగిన నీటి వనరులు అందించలేదని, ఆ విషయాన్ని చరిత్రతో సహా నిరూపిస్తామని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రజలను మాటలతో మోసం చేసే పార్టీ అని, 2023 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ నేతలు జిల్లాల పర్యటనలు చేస్తూ విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతోందని, రైతులు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. తక్కువ కాలంలో దిగుబడి వచ్చే పంటలు, ఆరుతడి పంటలు, పప్పుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలని కోరారు. నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టు, రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆ నీరు ఇవాళ లేదా రేపటిలోగా వైరా రిజర్వాయర్‌కు చేరుతుందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరడంతో రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు చేపట్టినట్లు తెలిపారు. ప్రకృతి, కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిస్థాయిలో లేకపోయినా రైతుల కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. కేంద్రం నుంచి అవసరమైన ఎరువులు సాధించామని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు టెక్నాలజీ వినియోగిస్తూ యాప్ ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే వర్షాల సమాచారాన్ని కూడా సాంకేతికత ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు అందిస్తున్నామని వెల్లడించారు. సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేయడం లేదని విమర్శించే వారికి లెక్కలతో సహా సమాధానం చెబుతామని అన్నారు. రైతు భరోసా పథకం కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని, రైతుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటోందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





