వ్య‌వ‌సాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యం

– ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’లో మంత్రి తుమ్మల

రఘునాథపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఆధునిక వ్యవసాయంతో రైతులకు అధిక ఆదాయం సాధ్యమ‌వుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రైతు వేదికలో సోమవారం  నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల ప్రయోజనం అందించేందుకు శాస్త్రవేత్తలు గ్రామ స్థాయికి వెళ్లేలా ఈ కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు ఏ పంటలు సాగు చేయాలి, ఎంత ఎరువు వాడాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలనే అంశాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని  సూచించారు. వొచ్చే నెలలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం కానుందని, గోద్రేజ్ సంస్థ ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ నర్సరీ స్థాపించేందుకు ఆసక్తి చూపుతోందన్నారు. గత పదేళ్ల‌లో యాంత్రీకరణకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, తమ ప్ర‌భుత్వం యాంత్రీకరణకు నిధులు కేటాయిస్తోంద‌ని, ఆ నిధులను ఎలా వినియోగించుకోవాలో రైతులే సూచనలివ్వాలని కోరారు. రఘునాథపాలెం మండలం తెలంగాణకు ఆదర్శంగా నిలవాలని, రైతులు ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలను సాగు చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై నాలుగేళ్ల పాటు రూ.51 వేల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని, ఈ పంట 40 ఏళ్ల‌పాటు ఆదాయం ఇస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ మధ్యలో పత్తి, మిర్చి, పప్పుధాన్యాలు, మొక్కజొన్న వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేయవచ్చన్నారు. ఈ పంటకు మార్కెట్ సమస్యలు, కోతుల సమస్యలు ఉండవని తెలిపారు. రైతులు వక్క, జాజి, కోకో వంటి పంటలపై కూడా దృష్టి పెట్టాలని, మంచి ఆదాయం వచ్చే పంటలను ఎంచుకోవాలని సూచించారు. రైతుల సందేహాలకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు సమాధానాలు ఇస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ రాబోయే రోజులలో ఆహార భద్రత చాలా కీలక అంశంగా మారనుందని, పెరుగుతున్న జనాభా, భూసారం తగ్గడం వంటి సమస్యలు కీలకం కానున్నాయని అన్నారు. వ్యవసాయం సరైన పరిజ్ఞానంతో చేయగలిగితే ఎకరానికి రెండు నుంచి మూడు లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుందన్నారు. రైతులు యూరియా వాడకం వీలైనంత వరకు తగ్గించాలన్నారు. మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా స్వయంగా రైతేనని, ఆయన పంట పొలాలలో యూరియా వినియోగించడం జరగదని, ఆర్గానిక్ ఫార్మింగ్‌తో మంచి లాభాలు ఉంటాయని అన్నారు. రసాయనాలతో పండించిన పంటలు తినడం వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు. మనం తినే ఆహారం కలుషితం కావద్దని, నేడు రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం నుండి వచ్చిన మేధావులు వచ్చారని, రైతులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం అందించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *