తిరుమల విధానాన్ని అనుసరించాలి

– భూముల కేటాయింపులకు ఒక విధానం రూపొందించాలి
– యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ రేట్ ప్రకారం భూమి కేటాయించాలని, వివిధ మఠాలకు భూముల కేటాయింపుపై ఒక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులకు సూచించారు. ఎంసీహెచఆర్‌డీ బోధి పెవిలియన్‌లో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. కుల సంఘాలకు స్థలం కేటాయింపుపై స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం తయారు చేయాలన్నారు. భూమి యాజమాన్యపు హక్కులు టెంపుల్ వద్దనే ఉండాలని, భూముల కేటాయింపుపై తిరుమల అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని, గుట్టపైన గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం కోసం ముందుకు వచ్చిన వాళ్ల జాబితా రూపొందించి విడతల వారీగా అనుమతులు ఇవ్వాలని సూచించారు. గెస్ట్‌హౌస్‌ల నిర్మాణంపైనా తిరుమల మోడల్‌ను అనుసరించాలన్నారు. భూ సేకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని, యాదగిరిగుట్ట ఆలయం నిర్మాణంపైన ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసి వారంలో నివేదిక ఇవ్వాలని, పబ్లిక్ ప్రైవేట్ విధానంలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని అథారిటీ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, శాసన సభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంవో సెక్రటరీ మానిక్ రాజ్, సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, యాదాద్రి జిల్లా ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

సీఎంను కలిసిన భారతి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ 

చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్‌కు సూచించారు. తెలంగాణలో మరింత పెద్ద సమగ్ర డేటా సెంటర్, ఏఐ మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. ఎంసీహెచఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సునీల్ భారతి మిట్టల్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యలో ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను మిట్టల్‌కు సీఎం వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేస్తున్నట్లు, నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని, పాలిటెక్నిక్ కళాశాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలన్నారు. భవిష్యత్ పెట్టుబడి అవకాశాలు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేయాలని సూచించారు. భారతి పౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని సునీల్ మిట్టల్ హామీ ఇచ్చారు. ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్టర్‌లా హైదరాబాద్‌ను చూస్తున్నామని, డేటా సెంటర్ల కెపాసిటీని మరింత పెంచేందుకు ముందుకొస్తామని తెలిపారు. ఫైబర్ కనెక్టివిటీ మరింత పెంచడంపై ఆసక్తి చూపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.

సీఎస్‌ఆర్ నిధులతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అభివృద్ధి పనులు 

సీఎస్‌ఆర్ నిధులతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంసీహెచఆర్‌డి బోధి పెవిలియన్‌లో మంగళవారం ప్రారంభించారు. బ్యాంకు అందజేసిన రెండు అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. అలాగే భూపాలపల్లిలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఎంఆరఐ మిషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. కాగా, స్వయం సహాయక మహిళా సంఘాలతో లాజిస్టిక్ పార్కులు, గోడౌన్‌లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నాం.. వీటి కోసం పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయాలి అని ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారులను సీఎం రేవంత్ కోరారు. మహిళా సంఘాల రుణ చెల్లింపులు చాలా బాగున్నాయని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *