అమ్మ.. నాన్న.. ఓ కుమార్తె..

– మిస్టరీగా ముగ్గురి మృతి

ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : జిల్లా కేంద్రం అయిన ఖమ్మం నగరంలో తండ్రి, పెద్ద కుమార్తె మృతి మిస్టరీ వీడకముందే తల్లి కూడా మరణించడంతో ముగ్గురి మరణం కేసు మరింత జఠిలంగా మారింది. తల్లి మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం అనంతరం ఆమె స్వస్థలానికి తరలించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం ఆనంతనగరం గ్రామానికి చెందిన కణతాల రాము(30) డిజిటల్ మీడియా విలేకరిగా పనిచేస్తున్నాడు. అతనికి సూర్యాపేట జిల్లాలోని కోదాడ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రమ్య(28)తో  ఆరేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వారికి కుమార్తెలు దివ్యశ్రీ(5), రితిక(3) ఉన్నారు. అందరు ఖమ్మం నగరంలోని బుర్హాన్ పురం 50వ డివిజన్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం వారు ఉంటున్న నివాసం నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవారి సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. రాము, పెద్ద కుమార్తె మరణించారు. భార్య అపస్మారక స్థితిలో ఉండగా మూడేళ్ళ చిన్నారి భయంతో వణికిపోతో ఓ పక్కన కూర్చొనుంది. వైద్య సేవల కోసం తల్లి, చిన్న కుమార్తెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాము ఎలా చనిపోయాడనే  దానిపై స్పష్టత లేదు. అతని మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవు. శరీరంలో కూడా ఎటువంటి పురుగు మందు తాగినట్లు కలిపించలేదు. శుక్రవారం రాత్రి భార్య, భర్తల  మధ్య ఘర్షణ జరిగిందని అదే రోజు రాము మరణించి ఉంటాడని అతని మృతదేహాన్నిబట్టి పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పొట్టలో నిల్వ ఉన్న ఆహారాన్ని పరీక్షకు పంపారు. తిన్న ఆహారంలో ఏమైనా విష ప్రయోగం జరిగిందా అన్న అనుమానంతో పరీక్షకు పంపినట్లు తెలుస్తోంది. 

 

పెద్ద కుమార్తె రక్తపు మడుగులో పడి ఉండగా ఆమెను హత్తుకుని రాము పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. చిన్న కుమార్తెకు కూడా రక్తపు గాయాలయ్యాయి. భార్య రమ్య సోమవారం రాత్రి చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందింది. అయితే కేసు కొలిక్కి వచ్చే సమయంలో ఆమె చనిపోవడం, చికిత్స పొందుతున్న సమయంలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఫోన్ కాల్స్, సీసీ కెమెరాలు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. తనను భర్త రాము నెట్టి వేయడంతో తాను స్పృహ తప్పి పడిపోయానని, మెల‌కువ వ‌చ్చే సరికి భర్త, పెద్ద కుమార్తె  చనిపోయి ఉన్నారని, అందుకే తాను ఎలుకల మందు తాగినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. కూతురు ఎలా చనిపోయిందని పోలీసులు ప్రశ్నించగా దానికి మౌనంగా ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి భర్త చనిపోగా శనివారం పెద్ద కుమార్తెను చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి మరణానికి భయపడి ఆమె ఆదివారం బయటకు వెళ్లి పురుగు మందు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. అంతేగాక ఆదివారం ఉదయం ఇంటి పక్కన ఉండే ఓ మహిళ రమ్యతో కొద్ది సేపు ముచ్చటించిoది. రాముకు  బాగా జ్వరం వచ్చిందని చెప్పడంతో ఇడ్లీలు కూడా ఓ ప్లేట్లో పెట్టి ఇచ్చినట్లు సదరు మహిళ పోలీసులకు తెలిపారు. జ్వరంతో ఉన్నామని పదేపదే తమని పిలవద్దని కూడా రమ్య చెప్పిందన్నారు. త్వరలోనే చిన్న కూతురుకు పుట్టు వెంట్రుకల ఫంక్షన్ చేస్తున్నామని శుక్రవారం రాత్రి ఇంటి యజమానికి రాము ఫోన్ చేసి సమాచారం అందించారు. ఓ చిన్న కుటుంబంలో ముగ్గురి మృతి మిస్టరీగా మారడం నగరంలో సంచలనమైంది. భర్త, పెద్ద కుమార్తె మరణంపై భార్యను అనుమానించిన పోలీసులు ఆమె మరణం తరువాత ఈ ఘాతుకంలో ఇతరుల ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *