– ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను తిప్పికొట్టాలి
– షాంఘై సహకార రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్
న్యూదిల్లీ, ఏప్రిల్ 28: ఉగ్రవాదమే ప్రపంచానికి ప్రధాన ముప్పుగా పరిణమించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. తీవ్రవాదం, ఉగ్రవాదంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు అందుకు తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కిర్గిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి గురించి రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు. పవాల్గామ్ ఉగ్రదాడి ఘటన యావత్ మానవాళిని కుదిపేసిందని అన్నారు. ఆ దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా తప్పించుకోలేరని భారత్ నిరూపించిందని తెలిపారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా ప్రభుత్వ మద్దతుతో జరిగే సీమాంతర ఉగ్రదాడులను అస్సలు విస్మరించకూడదని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు. ఉగ్రవాదులకు సాయపడుతూ ఆశ్రయం కల్పించే వారిపై చర్యలు తీసుకోవడంలో ఎస్‌సీవో వెనకాడకూడదని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం గురించి కూడా ఆయన మాట్లాడారు. గత కొన్నేళ్లుగా జరిగిన వరుస ఘర్షణల్లో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లిందని చెప్పారు. ఉగ్రవాద బెదిరింపులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ క్రమంలో ఉద్రిక్తతల పరిష్కారానికి దౌత్య మార్గాలను అనుసరించాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




