రాష్ట్రంలో ‘పవర్ కట్‌ అనేదే లేదు

– 7 వేల మెగావాట్ల డిమాండ్‌ను తట్టుకున్నాం

– వర్షాకాలంలోనూ వేసవిని తలపించిన డిమాండ్
– 2 వేల మెగావాట్ల జల విద్యుత్ నిలిచినా నిరంతర సరఫరా
– పటిష్టవంతమైన విద్యుత్ వ్యవస్థతోనే సాధ్యమైంది
– ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి సమీక్ష

హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 22 : ఎల్ నినోతో వర్షాకాలంలోనూ వేసవిని తలపించిన విద్యుత్ డిమాండ్, పడిపోయిన జల విద్యుత్ ఉత్పత్తితో ఒకేసారి ఏడు వేల మెగావాట్ల అదనపు భారాన్ని మన విద్యుత్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా తట్టుకుందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హనుమకొండలోని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్) ప్రధాన కార్యాలయంలో విద్యుత్ రంగ ప్రగతిపై ఆయన బుధవారం సమీక్షించారు. సాధారణంగా వర్షాకాలంలో 11 వేల మెగావాట్లుగా ఉండే పీక్ డిమాండ్ అనూహ్యంగా 16,500 మెగావాట్లకు చేరడం, మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేక 2,000 మెగావాట్ల జల విద్యుత్ (హైడల్ పవర్) నిలిచిపోవడం డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపై తీవ్రమైన షాక్ లాంటి ఒత్తిడిని తెచ్చిందని భట్టి విక్రమార్క చెప్పారు. అయినప్పటికీ విద్యుత్ సిబ్బంది అహర్నిశలు శ్రమించి, ముందుచూపుతో పక్కా ప్రణాళికలను అమలు చేయడం వల్లే ఈ సంక్లిష్ట పరిస్థితులను దాటుకుని ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను అందించగలుగుతున్నామన్నారు. ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని కాళేశ్వరం, దేవాదుల, సీతారామ వంటి బృహత్తర ఎత్తిపోతల పథకాలతోపాటు వర్షాభావంతో రైతులు బోర్ వెల్స్ ఎక్కువగా వాడటం వల్ల పెరిగిన విద్యుత్ అవసరాలను ప్రభుత్వం విజయవంతంగా తీర్చగలిగిందన్నారు. రాష్ట్రంలో ‘పవర్ కట్‌’ అనేదే లేదని, వర్షాలు, ఈదురుగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల స్తంభాలు, లైన్లపై చెట్లు కూలినప్పుడు మాత్రమే తాత్కాలికంగా విద్యుత్ అంతరాయం కలుగుతుందని, దీనిని ప్రజలు పవర్ కట్‌గా భావించవద్దని స్పష్టం చేశారు. ‘ప్రజా బాట’, ‘పొలం బాట’ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా అధికారులు స్వయంగా ప్రజల వద్దకే వెళ్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారని అభినందించారు. గతంలో ఎక్కువ వడ్డీలతో తెచ్చిన పాత రుణాలను ‘రీస్ట్రక్చరింగ’ చేయడం ద్వారా సంస్థల రుణ భారం తగ్గించి, ఎన్‌పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌లను దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలుపుతామని  ధీమా వ్యక్తం చేశారు. వైద్యారోగ్య శాఖ 108 ఆంబులెన్స్ సేవల తరహాలోనే విద్యుత్ సేవా ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ట్రాన్స్‌ఫార్మర్లు, నిచ్చెనలు, వైర్లతోపాటు నిపుణులైన ఇంజనీర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా విద్యుత్ అంబులెన్స్ వాహనాలను రంగంలోకి దించామన్నారు. వినియోగదారులు ఉచిత టోల్ ఫ్రీ నంబర1912కు ఫోన్ చేయగానే కృత్రిమ మేధస్సు(ఏఐ) సాంకేతికత ద్వారా సమాచారాన్ని స్వీకరించి ఆటోమేటిగ్గా క్షణాల్లో సమాచారాన్ని ఆంబులెన్స్ సిబ్బందికి చేరవేస్తుందని, మెసేజ్ ఆధారంగా నిమిషాల వ్యవధిలోనే ఆంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను తక్షణమే పరిష్కరిస్తుందని వివరించారు. విద్యుత్ వ్యవస్థకు మూలస్తంభాలైన లైన్‌మెన్, ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని ఉద్ఘాటిస్తూ విధి నిర్వహణలో అనుకోకుండా ప్రమాదం జరిగి సిబ్బంది మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు రూ.1.20 కోట్ల బీమా సౌకర్యాన్ని కల్పించామని వివరించారు. అలాగే లైన్ క్లియరెన్స్ సమయంలో ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన సేఫ్టీ కిట్లు, యూనిఫారాలు అందించినట్లు తెలిపారు. మరోవైపు గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్న 53 లక్షల కుటుంబాల బిల్లుల మొత్తాన్ని ఆర్థిక శాఖ డిస్కంలకు చెల్లిస్తోందని తెలిపారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు ఏటా అయ్యే రూ.14,000 కోట్ల సబ్సిడీ నిధులను కూడా ఆర్థిక శాఖ నేరుగా డిస్కంలకు విడుదల చేస్తోందని వెల్లడించారు.

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు

సమీక్షకు తొలుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి నక్కలగుట్ట హనుమకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. వాజ్‌పేjáYT కాలనీలో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం, ఆర్ అండ్ బీ క్వార్టర్స్‌లో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం, విద్యుత్ నగర్‌లో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ వద్ద 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం, నూతన సర్కిల్ కార్యాలయ భవనం- హనుమకొండ, ఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం 5వ అంతస్తు ప్రారంభోత్సవాలు జరిపారు. డబుల్ బెడ్‌రూమ్ కాలనీ 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. సమావేశంలో పాల్గొన్న దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ కలెక్టర్ సత్య శారద. జీడబ్ల్యూఎంసీ¾ కమిషనర్ వెంకన్న పాల్గొన్నారు.
———————————————–
 ‘ఎల్ నినో’పై కేటీఆర్‌కు అవగాహన లేదు : భట్టి 

‘కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు’ అంటూ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికాలో చదువుకున్న, పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు ప్రపంచ వాతావరణ మార్పులు ‘ఎల్ నినో’ ప్రభావంపై కనీస అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం వల్లే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, నిపుణులు వివరిస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫసిఫిక్ మహాసముద్రానికి ముఖ్యమంత్రి వెళ్లి ఏమైనా విపత్తులు సృష్టిస్తే ఇక్కడ కరువు వచ్చిందా అని ప్రశ్నించారు. అంతటి జ్ఞానం లేకుండా కేటీఆర్ మాట్లాడటం చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం కానీ, దుర్మార్గమైన ఆలోచనలతో విషప్రచారం చేయవద్దు అని హితవు పలికారు. పదేళ్ల అధికార దుర్వినియోగంతో దోపిడీ చేసిన సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న పత్రికలు, ఛానళ్ల ద్వారా ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు బురదజల్లుతున్నారని, ఈ అబద్ధపు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని గొప్పలు చెప్పుకున్నారు..కేవలం 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మూడేళ్లకే ఎందుకు కుంగిపోయాయి అని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్ రావును  నిలదీశారు. కాళేశ్వరం కంటే ఎగువన గత కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 టీఎంసీల సామర్థ్యంతో నేటికీ నిటారుగా, సురక్షితంగా ఉండి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నదని తెలిపారు. అలాగే ఆరు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా గోదావరి ఉధృతికి చెక్కుచెదరకుండా నిలబడిందని గుర్తుచేశారు. అదే గోదావరి నది.. అదే ఇసుక పునాదిపై కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా సురక్షితంగా ఉండగా  బీఆర్‌ఎస్ కట్టిన కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ కేవలం మూడేళ్లలోనే ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు. సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *