స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని, ఇది ఆ నేతకు దక్కిన గొప్ప గౌరవమని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శుక్రవారం జరిగిన రోశయ్య 92వ జయంత్యుత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ఈరోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా రోశయ్య గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసినట్లయిందన్నారు. బహుశా మన దేశంలో ఒక రాష్ట్ర ఆర్ధికమంత్రిగా అత్యధికంగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యదేనని, ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అప్పులు చేయకుండా ఉన్నంతలో బడ్జెట్‌ను సర్దుబాటు చేయడంలో ఆయనది అందెవేసిన చెయ్యి అని కొనియాడారు. వాగ్ధాటి, చతురతలో రోశయ్యతో ఇంకొకరిని పోల్చలేమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గవర్నర్‌గా నియామకమై బిజేపి ప్రభుత్వంలో కూడా కొనసాగిన అరుదైన వ్యక్తులలో రోశయ్య ఒకరని, రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ వ్యక్తిగతంగా అందరికీ ఆయన ఆజాత శత్రువు అని స్పీకర్ చెప్పారు. ఆయనది తెలంగాణ ప్రాంతం కాకపోయినా వారిని మనం గౌరవించడానికి కారణం మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం ప్రకారం వారి పెద్దరికానికి గౌరవం ఇవ్వడమేనని తెలిపారు. ఆయన శాసనసభలో మాట్లాడుతుంటే స్వపక్ష సభ్యులతోపాటు విపక్ష సభ్యులు కూడా ఏకాగ్రతతో వినేవారని, యువ, నూతన ప్రజాప్రతినిధులకు రోశయ్య ప్రసంగం ఒక పుస్తకం వంటిదని స్పీకర్ ప్రసాద్‌కుమార్ చెప్పారు. 2008 ఉప ఎన్నికలలో తాను మొదటిసారి శాసనసభ్యునిగా ఎన్నికై అసెంబ్లీకి వచ్చినప్పుడు సమావేశాలో రోశయ్య ప్రసంగాలను ప్రత్యేక్షంగా వినే భాగ్యం కలిగిందని, ఆయన ప్రసంగాలకు నేను అభిమానినని, ఆయన నుండి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పారు. నేటి యువ రాజకీయ నాయకులు రోశయ్యను ఆదర్శంగా తీసుకోవాలని స్పీకర్ సూచించారు. సభలో మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు, వైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సభా వేదికపై ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు సన్మానించారు.