స్వయంకృతం ..!

“సంజయ్ కుమార్ వంటి ప్రత్యర్థులను పార్టీలోకి చేర్చుకుని పదవులు కట్టబెట్టడం, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారిని మౌనంగా ఉండమనడం జీవన్ రెడ్డి వంటి నేతలకు ఆగ్రహం కలిగించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీవన్ రెడ్డి నిష్క్రమణ అనేది ఒక “డొమినో ఎఫెక్ట్” (వరుస పతనం) లాంటిది. ఇది మౌనంగా ఉన్న ఇతర అసంతృప్త నేతలను కూడా బయటకు వెళ్లేలా ప్రేరేపించవచ్చు..”

ఏ రాజకీయ వ్యవస్థ స్థిరత్వమైనా దాని ‘అంతర్గత కోర్’ (ముఖ్య విధేయుల) విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ముఖ్య నేతలలో చీలిక మొదలవుతుందో, ఆ వ్యవస్థ కూలిపోవడం అనివార్యం.” ప్రముఖ సామాజిక మరియు రాజకీయ శాస్త్రవేత్త థెడా స్కోక్‌పోల్ చెప్పిన ఈ మాటలు, ఒక పార్టీ పతనం అనేది కేవలం ప్రత్యర్థుల దాడి వల్ల మాత్రమే జరగదనీ , నాయకత్వంలోని అంతర్గత వైఫల్యాల వల్ల కూడా జరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి.

రాజకీయాల్లో చరిత్ర తరచుగా పునరావృతమవుతుంది. కాంగ్రెస్ విషయంలో తెలంగాణలో ఇప్పుడు పాత జ్ఞాపకాలు మళ్ళీ కళ్ళముందు కదలాడుతున్నాయి. పదేళ్ల క్రితం, అస్సాంలో సీనియర్ వ్యూహకర్త హిమంత బిశ్వ శర్మను పార్టీ విస్మరించింది. ఆయన బీజేపీ లోకి వెళ్లడం కేవలం ఒక రాష్ట్రాన్ని కోల్పోవడమే కాకుండా, ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో కాంగ్రెస్ పతనానికి దారితీసింది. ఫలితంగా దేశవ్యాప్తంగా సుమారు 150 మంది అగ్రనేతలు పార్టీని వీడారు. నేడు, తెలంగాణలో అచ్చం అలాంటి సంక్షోభమే కనిపిస్తోంది. 40 ఏళ్ల పాటు పార్టీకి విధేయుడిగా ఉన్న టి. జీవన్ రెడ్డి, ప్రస్తుత నాయకత్వ ధోరణితో విసిగిపోయి బీఆర్ఎస్‌ వైపు వెళ్లడం పార్టీ పునాదుల్లో చీలికకు సంకేతం. హిమంత బిశ్వ శర్మలాగే, జీవన్ రెడ్డి కూడా అవమానానికి గురయ్యానని, తనను పక్కన పెట్టారని భావించినట్లు తెలుస్తోంది.

పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి, ఉనికి కోల్పోయే స్థితి నుండి పోరాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు పాత తరం నేతలను కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ పెద్ద రిస్క్ చేస్తోంది. సంజయ్ కుమార్ వంటి ప్రత్యర్థులను పార్టీలోకి చేర్చుకుని పదవులు కట్టబెట్టడం, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారిని మౌనంగా ఉండమనడం జీవన్ రెడ్డి వంటి నేతలకు ఆగ్రహం కలిగించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీవన్ రెడ్డి నిష్క్రమణ అనేది ఒక “డొమినో ఎఫెక్ట్” (వరుస పతనం) లాంటిది. ఇది మౌనంగా ఉన్న ఇతర అసంతృప్త నేతలను కూడా బయటకు వెళ్లేలా ప్రేరేపించవచ్చు.

జీవన్ రెడ్డి కేవలం కోపంతో ఉన్న నాయకుడు మాత్రమే కాదు, ఆయనొక వ్యూహకర్త. దశాబ్దాల కాలం కాంగ్రెస్ లో ఉన్న ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై చేసే విమర్శలు సాధారణ ప్రతిపక్షాల విమర్శల కంటే బలంగా ప్రజల్లోకి వెళ్తాయి. కేసీఆర్ తో ఆయన కలయిక “తెలంగాణ ఐక్యత” అనే కొత్త నినాదానికి ఊపిరి పోయవచ్చు.
విధేయులను “ద్రోహులు” అని ముద్ర వేయడం కంటే, పార్టీలోని లోపాలను సరిదిద్దుకోకపోతే కాంగ్రెస్ తన విజయకేతనాన్ని స్వల్పకాలికంగా మార్చుకునే ప్రమాదం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయింది: ఒక వర్గం దశాబ్దాల కాలం కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకున్న పాత తరం విధేయులుగా ..రెండో వర్గం టీడీపీ, బీఆర్ఎస్ నుండి వచ్చి ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వారు..!

కష్టకాలంలో కాంగ్రెస్ ఊపిరి పోసిన జీవన్ రెడ్డి వంటి వారిని పక్కన పెట్టడం, పార్టీ తన స్థిరత్వాన్ని తానే దెబ్బతీసుకోవడం వంటిది. ఇది రాజకీయంగా ఆత్మహత్యతో సమానం.
ఈ పరిస్థితిని ప్రముఖ ఉర్దూ కవితా పంక్తులు అద్భుతంగా వర్ణిస్తాయి:

“హమే తో అప్నో నే లూటా, గైరోం మే కహా దమ్ థా..
మేరీ కష్తీ వహా డూబీ, జహా పానీ కమ్ థా”
(నన్ను నా సొంత మనుషులే ముంచేశారు, బయటి వారికి అంత శక్తి లేదు.. నీళ్లు తక్కువగా ఉన్న చోటే నా పడవ మునిగిపోయింది.)
-శామ్ సుందర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *