“రాజకీయ నాయకుల సౌకర్యాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు, అది సామాన్యుడిపై పన్నుల రూపంలో పడే భారం కాదా? అనే ప్రశ్న తలెత్తడం సహజం. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం లేకపోయినా, ప్రజాప్రతినిధులకు మాత్రం ఒక్క రోజు పదవిలో ఉన్నా జీవితకాల పెన్షన్ లభిస్తుంది. సభ్యుల సంఖ్య పెరిగితే ఈ పెన్షన్ భారం రాబోయే 20 ఏళ్లలో ప్రభుత్వానికి పెను సవాలుగా మారుతుంది. సభ్యుల సంఖ్య పెరిగినంత మాత్రాన పార్లమెంటులో చర్చల నాణ్యత పెరుగుతుందా? అనేది సందేహమే.”
భారతదేశంలో రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్ ) ప్రక్రియ కేవలం భౌగోళిక మార్పు పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కాదు, అది దేశ ఖజానాపై పడే భారీ ఆర్థిక భారానికి సంబంధించిన అంశం కూడా. లోక్‌సభ సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుండి సుమారు 848కి పెరిగే అవకాశం ఉండటంతో, ప్రజాధనం వినియోగంపై చర్చ మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన: ప్రజాస్వామ్య విస్తరణా? లేక ఖజానాకు గుదిబండనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘ప్రాతినిధ్యం’ అనేది మూలస్తంభం. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాలన్నది రాజ్యాంగబద్ధమైన వాదన. అయితే, ఈ ప్రక్రియలో భాగంగా ఎంపీల సంఖ్య దాదాపు 300 పైగా పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం సామాన్య పౌరుడిని ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రస్తుత వ్యయం పై ఒక అంచనా ప్రకారం ఒక పార్లమెంటు సభ్యునిపై ప్రభుత్వం చేసే ఖర్చు కేవలం వారి జీతానికే పరిమితం కాదు. ప్రస్తుత గణాంకాల ప్రకారం నెలవారీ జీతం,నియోజకవర్గ అలవెన్స,కార్యాలయ ఖర్చులు,సిబ్బంది ఖర్చులు,దినసరి వ్యయం (పార్లమెంట్ సమావేశాల సమయంలో) ఇవి కాకుండా ఉచిత నివాసం, వైద్యం, ప్రయాణ సౌకర్యాలు (రైలు, విమానం), టెలిఫోన్ మరియు విద్యుత్ రాయితీలు అదనం. ..ఒక ఎంపీపై సంవత్సరానికి సగటున రూ.70 లక్షల నుంచి ఒక కోటి వరకు ప్రత్యక్ష ఖర్చు అవుతుంది. సభ్యుల సంఖ్య 543 నుండి 850కి పెరిగితే ఆర్థిక భారం ఏటా వెయ్యి కోట్లు పడనుంది. ఇవి కేవలం ప్రత్యక్ష నిర్వహణ ఖర్చులు మాత్రమే. ఎంపీ నిధులు మరియు భద్రతా వ్యయాలు కలిపితే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది.
కేవలం జీతాలే కాకుండా, కొత్తగా వొచ్చే 300 మంది సభ్యులకు దిల్లీలోని ఖరీదైన ప్రాంతాల్లో కొత్త క్వార్టర్ల నివాస గృహాలు నిర్మాణం. ప్రతి ఎంపీకి కనీసం ఇద్దరు గన్ మెన్లు, నియోజకవర్గంలో ప్రోటోకాల్ భద్రత. ప్రస్తుతం ప్రతి ఎంపీకి ఏడాదికి రూ .5 కోట్లు ఇస్తున్నారు. 850 మందికి ఇది ఏడాదికి రూ.4,250 కోట్లకు చేరుతుంది.
నియోజకవర్గాల పునర్విభజన అనేది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి అవసరమే కావొచ్చు, కానీ అది తక్కువ ఖర్చుతో ఉండాలి. ఎంపీల జీతభత్యాలపై హేతుబద్ధీకరణ, అనవసర అలవెన్సుల తగ్గింపు మరియు టెక్నాలజీ వినియోగం ద్వారా ఈ ఆర్థిక భారాన్ని తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ప్రజాస్వామ్యం వెలకట్టలేనిది కానీ అది ప్రజాధనాన్ని వృధా చేసేదిగా ఉండకూడదు.





