“న్యాయశాఖకు చెందిన 65 మంది ఉద్యోగులు చేసిన నిరంతర పోరాటం యావత్ రాష్ట్ర ఉద్యోగ లోకానికి దిక్సూచిగా నిలిచింది. మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు సీబీఐ కోర్టుల్లో పనిచేస్తున్న వీరంతా 2004 సెప్టెంబర్ లోపు వెలువడిన నోటిఫికేషన్ ల ద్వారా ఎంపికైనప్పటికీ, పరిపాలనా పరమైన జాప్యం వల్ల సీపీఎస్ పరిధిలోకి నెట్టబడ్డారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సామ్‌కోషి, జస్టిస్ నందికొండ నర్సింగ్ రావులతో కూడిన ధర్మాసనం “ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఆలస్యం వల్ల ఉద్యోగుల హక్కులను కాలరాయడం రాజ్యాంగ విరుద్ధం” అని తేల్చి చెప్పింది.”
పాత పెన్షన్ చెల్లింపుకు హైకోర్టు ఆదేశం

సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్
…9440595494
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానంపై దశాబ్దాలుగా నెలకొన్న అనిశ్చితికి తెర దించుతూ రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు, కేవలం ఒక పరిపాలనా పరమైన ఆదేశం మాత్రమే కాదు, అది సామాజిక న్యాయ విజయం. 2004 సెప్టెంబర్ 1వ తేదీని ప్రాతిపదికగా తీసుకుని, ఆ తేదీకి ముందే నియామక ప్రక్రియ ప్రారంభమై, కేవలం సాంకేతిక కారణాలు మరియు ప్రభుత్వ యంత్రాంగం చేసిన జాప్యం వల్ల ఆలస్యంగా విధుల్లో చేరిన వేలాది మంది ఉద్యోగుల పాలిట ఈ తీర్పు ఒక సంజీవనిలా మారింది.
న్యాయస్థానం తన తీర్పు ద్వారా “లెజిటిమేట్ ఎక్స్‌పెక్టేషన్” (న్యాయ బద్ధమైన నిరీక్షణ) అనే మౌలిక న్యాయ సూత్రాన్ని పునరుద్ధరించడమే కాకుండా, వ్యవస్థాగత లోపాలకు సామాన్య ఉద్యోగులు బలి కాకూడదని అత్యంత స్పష్టంగా ప్రకటించింది. ఈ వివాదం మూలాలు 2004లో దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన పెన్షన్ సంస్కరణల్లో నిక్షిప్తమై ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్ ) స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన ‘కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్’ (సీపీఎస్ ) ఉద్యోగుల భవిష్యత్తును మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడేలా చేసింది. ఓపీఎస్ కింద ఉద్యోగికి తన చివరి వేతనంలో సగం మొత్తం పెన్షన్‌గా, కరువు భత్యంతో కలిపి లభించి, పదవీ విరమణానంతరం గౌరవ ప్రదమైన జీవనానికి హామీ లభించేది. కానీ సీపీఎస్‌లో అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగి వాటాలను స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టడం వల్ల తిరిగి వచ్చే పెన్షన్ మొత్తంపై ఎలాంటి భరోసా లేకుండా పోయింది. ఈ అనిశ్చితి ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది; ముఖ్యంగా 2004 సెప్టెంబర్ 1 కటాఫ్ తేదీ కంటే ముందే నోటిఫికేషన్లు వెలువడి, నియామక ఉత్తర్వులు ఆలస్యమైన అభ్యర్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ప్రస్తుత కేసులో న్యాయశాఖకు చెందిన 65 మంది ఉద్యోగులు చేసిన నిరంతర పోరాటం యావత్ రాష్ట్ర ఉద్యోగ లోకానికి దిక్సూచిగా నిలిచింది. మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు సీబీఐ కోర్టుల్లో పనిచేస్తున్న వీరంతా 2004 సెప్టెంబర్ లోపు వెలువడిన నోటిఫికేషన్ ల ద్వారా ఎంపికైనప్పటికీ, పరిపాలనా పరమైన జాప్యం వల్ల సీపీఎస్ పరిధిలోకి నెట్టబడ్డారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సామ్‌కోషి, జస్టిస్ నందికొండ నర్సింగ్ రావులతో కూడిన ధర్మాసనం “ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఆలస్యం వల్ల ఉద్యోగుల హక్కులను కాలరాయడం రాజ్యాంగ విరుద్ధం” అని తేల్చి చెప్పింది.
ఒక అభ్యర్థి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న సమయానికి అమల్లో ఉన్న సేవా నిబంధనలే అతనికి వర్తిస్తాయని, నిబంధనలు మార్చి వెనుకటి తేదీ నుండి అమలు చేయడం న్యాయసమ్మతం కాదని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు ప్రభావం కేవలం ఆ 65 మందికే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు, విద్యాశాఖ మరియు ఇతర ప్రభుత్వ విభాగాల్లోని సుమారు 13,000 మంది ఉద్యోగులకు ఊరట నివ్వనుంది. గణాంక పరంగా చూస్తే ఇది ప్రభుత్వంపై దీర్ఘకాలిక పెన్షన్ భారాన్ని పెంచవచ్చు కానీ, ఉద్యోగి తన జీవిత కాలమంతా సేవ చేసినందుకు ప్రతిఫలంగా వృద్ధాప్య భరోసా కల్పించడం సంక్షేమ రాజ్య ప్రాథమిక బాధ్యత అని సామాజిక వేత్తలు బలంగా వాదిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం సైతం 2023 మార్చిలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2003 డిసెంబర్ 22కు ముందు వెలువడిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైన ఉద్యోగులకు ఒకేసారి అవకాశం (వన్ టైం ఆప్షన్ ) ఇస్తూ పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు అనుమతించింది. భారత ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్ 57/04/2019 మరియు మెమో నంబర్ 57/05/2021లు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు తీర్పు కూడా కేంద్ర విధానాలకు అనుగుణంగా ఉండటం గమనార్హం. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే రాజకీయ నిర్ణయాల ద్వారా ఓపీఎస్‌ను పునరుద్ధరించగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ న్యాయ పోరాటం ఒక కీలక మలుపుగా మారింది. న్యాయస్థానం ఈ తీర్పు అమలుపై కఠిన వైఖరిని అవలంబిస్తూ, జూన్ 10వ తేదీలోగా అమలు చేయాలని, లేని పక్షంలో న్యాయశాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించడం అధికారుల అలసత్వానికి చరమగీతం పాడేలా ఉంది. ఆర్ధిక కోణంలో చూస్తే, సీపీఎస్ వల్ల ప్రభుత్వం తక్షణమే 10 శాతం వాటా చెల్లించాల్సి ఉంటుంది, కానీ ఓపీఎస్‌లో రిటైర్మెంట్ వరకు ప్రత్యక్ష భారం ఉండదు. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వపు హక్కును కాపాడిన ఈ తీర్పు, ప్రభుత్వ జాప్యం వల్ల ఉద్యోగుల మధ్య వివక్ష చూపకూడదని నిరూపించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మెమోలను సానుకూలంగా పరిగణించి, మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా 2003 డీఎస్సీ ద్వారా ఎంపికైన దాదాపు 9,000 మంది ఉపాధ్యాయులు దశాబ్ద కాలంగా సీపీఎస్ విష వలయంలో చిక్కుకుని సామాజిక భద్రతకు దూరమయ్యారు. ప్రభుత్వం తన మేనిఫెస్టో హామీలను నిలబెట్టుకుంటూ, హైకోర్టు తీర్పును గౌరవిస్తూ వీరిని తక్షణమే పాత పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలని ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తుతున్నాయి. ఈ తీర్పు ఉద్యోగులలో వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచడమే కాకుండా, పరిపాలనలో పారదర్శకత మరియు సమయపాలన ఆవశ్యకతను గుర్తు చేసింది. న్యాయస్థానం చూపిన చొరవ ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ ప్రాముఖ్యతను చాటిచెప్పింది. ప్రభుత్వం పంతాలకు పోకుండా, ఆర్థిక పరిమితులను సాకులుగా చూపకుండా, గడువులోగా ఈ తీర్పును అమలు చేసి వేలాది కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. అప్పుడే పరిపాలనలో మానవీయత, న్యాయబద్ధత ప్రతిబింబిస్తాయి. రాబోయే రోజుల్లో ఈ తీర్పు అన్ని శాఖల ఉద్యోగులకు వర్తింప జేయడం ద్వారా ప్రభుత్వం ఒక ఆదర్శవంతమైన మరియు చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం.





