ఆట అక్కడే మోదలైంది”తెలంగాణీయం”!? 

“పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత “మోషా”ల తదుపరి కార్యక్షేత్రం తెలంగాణానే.అయితే అనుకోని విధంగా తెలంగాణా బీజేపీ లో కీలకపాత్ర మధ్య అనైక్యత,పదవుల చదరంగం తో పనికాదని గ్రహించిన కేంద్ర పెద్దలు తమదైన శైలిలో వికెట్లు కదిలించడం మొదలెట్టారు.ఈ దశలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరద్ వ్యవహారం బయట పడడం పోక్సో కేసు నమోదు వరకు వెళ్ళడం ఆ పార్టీకి అనూహ్యంగా ఎదురైనా పరిణామాలు.ఈ పోక్సో కేసు తెలంగాణా బిజెపి పార్టీని నైతికంగా కుంగదీసింది.కనుక అనూహ్యంగానే రాజకీయ పరిణామాలు ఒక సమస్య తీవ్రత తగ్గించడానికి మరో సమస్య అన్న విధంగా తెలంగాణా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూవచ్చాయి..” 

-ఎన్.తిర్మల్
(పొలిటికల్,ఎనలిస్టు, సామాజిక,కార్యకర్త, సీనియర్ జర్నలిస్టు)
సెల్:9441864514, ఇమెయిల్: thirmal.1960@gmail.com.

తెలంగాణా సమాజం ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త మోసాన్ని చవిచూడబోతుంది.రాజకీయాల్లో వ్యూహాలు,ప్రతివ్యూహాలు సహజం.చాలా మంది తెలంగాణా ఆవిర్భావం రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన నవనిర్మాణం అనే సభాపర్వంనే అందరూ చూస్తున్నారు.కానీ,ఆట అంతకు ముందే మొదలైంది.ఈ ఆటలో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేకాదు, బిజెపి, కాంగ్రెస్, బి ఆర్ ఎస్,తో సహా కొందరు తెలంగాణ వాదులుగా చెప్పుకునే వారి పాత్ర కూడా సుస్పష్టం.ఈ ఆటకు పాత్రధారి ,సూత్రధారి కేంద్ర పెద్దలే..!

     పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత “మోషా”లతదుపరి కార్యక్షేత్రం తెలంగాణానే.అయితే అనుకోని విధంగా తెలంగాణా బీజేపీ లో కీలకపాత్ర మధ్య అనైక్యత,పదవులు చదరంగంతో పనికాదని గ్రహించిన కేంద్ర పెద్దలు తమదైన శైలిలో వికెట్లు కదిలించడం మొదలెట్టారు.ఈ దశలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరద్ వ్యవహారం బయట పడడం పోక్సో కేసు నమోదు వరకు వెళ్ళడం ఆ పార్టీకి అనూహ్యంగా ఎదురైనా పరిణామాలు.ఈ పోక్సో కేసు తెలంగాణా బిజెపి పార్టీని నైతికంగా కుంగదీసింది.కనుక అనూహ్యంగానే రాజకీయ పరిణామాలు ఒక సమస్య తీవ్రత తగ్గించడానికి మరో సమస్య అన్న విధంగా తెలంగాణా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూవచ్చాయి.
    వాస్తవంగా బండీ భగీరద్ విషయంలో బీజేపీ ని కోలుకోకుండా దెబ్బతీసే అవకాశం అంది వచ్చినప్పటికీ ఒకరి భవిష్యత్తు సహకారం మరొకరు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్,  బిఆర్ఎస్  పార్టీలు తెలంగాణా లో”ఎక్కడిదొంగలు అక్కడే,గప్ చూఫ్ సాంబారు బుడ్డి”అన్న విధంగా మౌన రూపం దాల్చారు.ఇదే సందర్భంలో చాలా కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రం లో ప్రధాని మోదీ  అడుగు పెట్టడంతోపాటు తమదైన శైలిలో తమ పార్టీలో లోపించిన నాయకత్వం భర్తీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ ఆహ్వానం పలికారు.పలకటమే కాదు.ఏకంగా ఇప్పుడు ఉన్న స్థాయి కంటే ఉన్నతమైన స్థానంలో ఉంచుతామనే హామీని సైతం ఇచ్చారు.ప్రధాని మోదీ ఆంతర్యం ఏదైనా కావచ్చు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీకల్లోతు రాజకీయ అవిశ్వాస వలలో చిక్కుకుపోయారు.ఆ మాట బయటకు ఎలా అనిపించినా రేవంత్ మీద నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ లో,పదవులపై ఆశలు పెంచుకున్న బిజెపి పార్టీలో రాజకీయ సుడిగుండం సృష్టించిందని చెప్పవచ్చును.
     ఇదే సమయంలో తెలంగాణా విశ్లేషకుడు నాగేశ్వర్ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా విషయంలో చేసిన రాజకీయ విశ్లేషణలు పవన్ కళ్యాణ్ లోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం కలిగించింది.జగన్ విషయం లో కేంద్ర కీలక నేత అమిత్ షా ప్రత్యేక అభిమానం కలిగి ఉన్నారనడంలో అర్థం ఉంది.ఎందుకంటే మధ్యలో బంధుత్వం కలుపుకున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి దీర్ఘకాలిక నమ్మకం అయిన మిత్రులుగా భావించడం తప్పు కాదు.ఎందుకంటే బిజెపి దీర్ఘకాలిక ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ను నేరుగా ఎదిరించి వచ్చిన జగన్మోహన్ రెడ్డి శతృవు ,శత్రువు బలమైన మిత్రులుగా భావించడం సహజ రాజకీయ సూత్రమే! కనుక ఏ రకంగా చూసినా ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు నూటికి నూరు శాతం ఆమోదయోగ్యమే! అయితే, ఈ విషయం ఈ సమయం లో వివాదాలు ముదరడం కూడా ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణా రాజకీయ పరిణామాల్లో బిజెపి కి అవసరం కాబట్టే ఎన్ని పరిణామాలు జరిగినా బిజెపి తాజా రాజకీయ పరిణామాల్లో నోరు మెదపడం లేదు.మౌనం కూడా కొన్ని సమయాల్లో రాజకీయాల్లో కలిసి వచ్చే అవకాశంగా ఉంటుంది.
     ఇక తెలంగాణా ముఖ్యమంత్రి సైతం ఇటీవల ఎన్టీఆర్ విగ్రహం విషయంలో తెలంగాణా మనోభావాలకు విరుద్ధంగా తనదైన నిర్ణయంతో ,పాత అనుబంధాలు తో సరికొత్త వ్యూహం తో విగ్రహావిష్కరణ కార్యక్రమంకు హాజరు కావడం,అక్కడ ఆయన తప్పిదాన్ని దాచుకోవడం కోసం తెలంగాణా సాయుధ పోరాట విశిష్టత గురించి ఆ సభలో మాట్లాడడం చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎంతో కొంత గందరగోళం, అయోమయం కు గురయ్యారనిపిస్తూ ఉంది.పరిపక్వత లేని నిర్ణయాలతో తనకుతానే తగ్గించుకుంటున్నారనిపిస్తుంది.ఖచ్చితంగా ఎప్పుడో మర్చిపోయిన ఎన్టీఆర్ ను తిరిగి పునర్ ప్రతిష్ట చేయడం అనేది టీడీపీ, చంద్రబాబు నాయుడుకు పరోక్షంగా ఉపయోగపడే అంశమే! మరి వారిని వీరు,వీరిని వారు ఉపయోగించుకోవాలో ఎవరిని,ఎవరు ఉపయోగించుకున్నారోగానీ,ఆ చర్య పరోక్షంగా బీజేపీ రాజకీయ కూటమికి ఉపయోగపడేది అనడంలో సందేహం లేదు.
     పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడిన తెలంగాణా కాంగ్రెస్ నేతలు మంత్రి పొన్నంప్రభాకర్ ,ఎమ్మెల్సీలు  కోదండరాం, అద్దంకి దయాకర్ గానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యను రేఖామాత్రంగా తప్పుపట్టక పోవడంలో ఆంతర్యం మరేమీ లేదు రాజకీయ సర్దుబాటు తప్ప.ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పై చేసిన వ్యాఖ్యలు విషయంలో కేసు నమోదు చేయించి నాగేశ్వర్ అరెస్ట్ కు లోకేష్ ఆదేశించారనడం ద్వారా ఓ రకమైన సానుభూతి పవన్ కళ్యాణ్ దగ్గర పొందడం తో పాటు, ఒకరకంగా ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి పీఠం కు పోటీ లేకుండా చూసుకునే ఎత్తుగడ దానిలో దాగి లేదని చెప్పలేం..! ఇట్లాంటి ఎత్తుగడల్లో చంద్రబాబు నాయుడు దిట్ట! టిటిడిపి  అధ్యక్షుడు బక్కని నర్సింహులు మహానాడు వేదిక గా తెలంగాణా అనే పదం అనేది డిక్షనరీ లో లేదనడం ఒక సంకేతమే,ఇంకా పవన్ కళ్యాణ్ ను తెలంగాణా లో ప్రొజెక్టు చేయడం అనేది అటు టిడిపి పార్టీకి,ఇటు బిజెపి పార్టీకి అవసరం కూడా!
     2029 ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రెటీ బీజేపీ కూటమికి అవసరం.తెలంగాణాలోని సోషల్ మీడియా నాగేశ్వర్ విషయం లో పవన్ కళ్యాణ్ వైఖరిని గోకిన తర్వాత వదిలి పెడితే పులికి ఆహారం లా మారుతామని అర్థం చేసుకున్న సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ కోడి చెరువు  శిఖం భూమి కొనుగోలు వ్యవహారం రచ్చ కెక్కించారు.అనివార్యంగా తెలంగాణా వాదులు తో పవన్ కళ్యాణ్ మాటల యుద్ధం కు సిద్ధం కావాల్సిన అనివార్యతకు వచ్చారు.తెలంగాణా ఆవిర్భావ దినం ఒకవైపు జరుగుతుంటే మరోవైపు నవనిర్మాణ సభకు అంకురార్పణ చేశారు.తమదైన శైలిలో తెలంగాణా వాదులు పవన్ సభను అడ్డుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుండగానే, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయం లో తెలంగాణ వాదుల ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ విషయం కొచ్చే సరికి రూటు మార్చి దూకుడుగా ముందుకు వచ్చింది.క్యాబినెట్ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ నవనిర్మాణ సభకు అనుమతి ఇచ్చేది లేదని ప్రకటించగా,ఎమ్మెల్సీ  అద్దంకి దయాకర్ తన ఇంట్లో ప్రెస్ మీట్ కూడా అనుమతించం అనే వరకు వెళ్ళిపోయారు.ఎన్టీఆర్ విగ్రహం విషయం లో మాట్లాడని రేవంత్ మిత్ర బృందం లోని ప్రో.కోదండరాం కూడా తీవ్రంగానే స్పందించారు.ఎవరి రాజకీయ అబిప్రాయం వారు స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(ఏ) అనుమతిస్తున్నప్పటికీ,గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణా పై వ్యూహాత్మకంగా చేసిన రాజకీయ దాడిని తెలంగాణా వాదులు జీర్ణించుకోవడం లేదు.
      తమిళ నాడు విజయ్ సియం గా ఎన్నికైన తర్వాత పవన్ కళ్యాణ్ చెందిన అంతర్మధనం ఆయన దాచుకోలేదు.బహిరంగంగానే వ్యక్తం చేశారు.ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో ఈసారి గెలుస్తామనే నమ్మకం లేకపోవడం,ఒకవేళ గెలిచినా నారా లోకేష్ ను కాదని ముఖ్యమంత్రి పీఠం తనదాక రాకపోవచ్చుననే అనుమానం ఆయనలో అంతర్గతంగా ఉండే అవకాశం ఉంది.బిజెపి కూడా తన అవసరాల కోసం ఎవరినైనా ఎక్కడనుండైనా వాడుకునే వ్యూహం లో దిట్ట.కనుక పవన్ కళ్యాణ్ అనివార్యం గా తెలంగాణా రాజకీయలలో ప్రవేశించే వాతావరణం కల్పించలేదని చెప్పలేం.పవన్ కళ్యాణ్ తన ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇదే అర్థంలోకూడా ఆవేశంతో ఊగిపోయారు.తెలంగాణా వాదులు కంటే ఆయన కాంగ్రెస్ నాయకుల పై ఒంటి కాలిమీద లేచారు.మంత్రి పొన్నం ప్రభాకర్ పై తెలంగాణా మీ అయ్య జాగీరా?అనే వ్యాఖ్యలు చేస్తే,అద్దంకి దయాకర్ పొరుగు దేశం పాకిస్థాన్ ను సమర్థించి తమను ఎలా వ్యతిరేకిస్తాడనే చాలెంజ్ విసిరారు.ఎవరు ఏమనుకున్న తాను ఇక్కడే రాజకీయం చేస్తామని విస్పష్టంగా ప్రకటించారు.దమ్ముంటే తమ ఇంటి మీదకు రమ్మని ఛాలెంజ్ విసిరారు.
    ఇక తెలంగాణా లో ఒక వేళ పవన్ కళ్యాణ్ నూతన రాజకీయ నవనిర్మాణం, బిజెపి దర్శకత్వంలో, చంద్రబాబు నిర్మాణ పెట్టుబడులతో సరికొత్తగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది.కానీ తెలంగాణా లో ఆయన ప్రయాణం అంత సులభం కాదు.మూడు ఘర్షణలు,ఆరు నిరసనలుగా మళ్ళీ రణరంగం తలపించే అవకాశం కొట్టిపారేయలేం.రేవంత్ పై మోదీ  రాజకీయ బేరం, రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ,పవన్ కళ్యాణ్ నవ నిర్మాణం ఇవన్నీ యాదృచ్చిక సంఘటనలు కానేకావు.రేపటి బిజేపి తెలంగాణా రాజకీయ వ్యూహానికి సన్నద్దత రూపాలు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *