చార్ధామ్ యాత్రీకులకు ఒక అడ్వైజరీ

“ఉత్తర, దక్షిణ భారత యాత్రలకు పోవడం కొత్త కాదు. శతాబ్దాల తరబడి జరుగుతున్నదే. అయితే ఆనాడు ఇప్పుడున్నట్టు ఆ యాత్రలకు ఉద్యమ స్వభావం లేదు. కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమె ఉండింది. నిజానికి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒకేసారి లక్షలాది మంది జనాన్నిఇముడ్చుకునే శక్తి గాని, విస్తృతి గాని లేదు. ఇరుకైన కొండ దారుల్లో లక్షలాది వాహనాలను అనుమతించడంలో ఔచిత్యం ఏమైనా ఉందా? అయితే అతి సాధారణంగా, నిజమైన ఆధ్యాత్మిక భావనతో సాగవలసిన చార్ధామ్ యాత్రను రాజకీయ ఉద్యమ రూపంలోకి దిగజార్చడం వలన దైవ విశ్వాసులు ఎదుర్కొంటున్న కడగండ్లకు అంతులేదు..”

భావోద్వేగంతో చేసిన దుస్సాహాస యాత్ర :

శ్రీధర్ రావు దేశ్పాండే

2026, మే 14 నుంచి 27 వరకు సాగిన నా చార్ధామ్ దుస్సాహాస యాత్ర ముగిసింది. జీవితకాలానికి గుర్తుండి పోయే చేదు అనుభవాలను, బోలెడంత అనారోగ్యాన్ని మూట గట్టుకొని ఇంటికి చేరుకున్నాను.. క్షేమంగా మాత్రం కాదు. చార్ధామ్ యాత్రకు పూర్వరంగంగా “హిమాలయాలు రమ్మంటూన్నాయి” అన్నశీర్షికతో ఒక వ్యాసాన్ని కూడా రాసుకున్నాను.  నా చిన్ననాటి మిత్రులు చాలా మంది చుప్ చాప్ చార్ధామ్ యాత్రకు డిసెంబర్ నెలలోనే పేర్లు రిజిస్టర్ చేయించుకున్నారు. నన్ను మాత్రం అడుగుత లేరు. ‘ఎందుకురా నన్ను వదిలేశారు’ అంటే.. ‘నువ్వు నాస్తికుడివి వస్తావో రావో అని అడగలేదురా’ అన్నారు. ‘మీ విశ్వాసాలతో నాకు ఏ లొల్లి లేదు. నేను ప్రకృతి ప్రేమికుడిగా వస్తాను. నన్ను కూడా లిస్ట్ లో చేర్చండిరా’ అని చెప్పాను. అట్లా నేను కూడా స్వచ్చ గంగా, యమునా నదీ లోయలను, హిమాలయ పర్వత శ్రేణుల పర్యావరణాన్ని, వాటి అందాలను పలవరించి, అనుభవించడానికి వారితో కలిసి ఈ చార్ధామ్ యాత్రకు ప్రకృతి ప్రేమికుడిగా సిద్ధం అయ్యాను. ఈ యాత్రలో నా బోథ్ చిన్ననాటి చెడ్డీ మిత్రులు అరవింద్, రమేశ్ బాబు, వెంకట రమణారెడ్డి, నాకు ఒక సంవత్సరం జూనియర్, మా హిందీ టీచర్ మధుకర్ రావు గారి సుపుత్రుడు రాజేందర్ లు నా బలం, బలగం. గంగాధర్ గౌడ్ ఇంతకూ ముందే యాత్ర చేసి ఉన్నాడు కాబట్టి వాడు రాలేదు. సబ్బని నర్సయ్య మూడేళ్ల క్రితం స్టంట్ వేసుకున్నందు వలన రావద్దని నిర్ణయించుకున్నాడు. వాడి నిర్ణయం సరైనదని యాత్రలో నా మరో మిత్రుడి అనుభవం రుజువు చేసింది. వాళ్ళందరూ జంటలుగా వచ్చారు, నేను ఒంటరిగానే వెళ్లాను.(నా లెక్కనే కామారెడ్డి నుంచి కొడిశాల మల్లేశం అనే షావుకారు కూడా ఒంటరిగా వస్తే ఆయనను నాతో జట్టుగా కలిపాడు టూర్ ఆపరేటర్. యాత్రలో ఇద్దరం ఒకరికి ఒకరం తోడుగా ఉన్నాము.)

చార్ధామ్ యాత్రకు పూర్వరంగంగా “హిమాలయాలు రమ్మంటున్నాయి” అన్నశీర్షికతో ఒక వ్యాసాన్ని కూడా రాసుకున్నాను. ఆ భావోద్వేగంలోనే ‘ఆజ్ అవుర్ కల్’ సినిమా కోసం సాహిర్ లూద్వియాన్వి రాసిన, రవి సంగీత దర్శకత్వంలో రఫీ పాడిన ఈ పాటను గుర్తు చేసుకున్నాను.

“యే వాదియా యే ఫజాయే బులా రహీ హై హమే

యే ఖామోషియోంకా సదాయే బులా రహీ హై హమే

మచల్ మచల్ కే యే హవాయే బులా రహీ హై హమే

ఝుకీ ఝుకీ ఘటాయే బులా రహీ హై హమే

నదీ కే మస్త అదాయే బులా రహీ హై హమే”

(సాహిర్ పాటలో రాసిన ‘తుమ్హే’ అనే పదాన్ని’హమే’ గా మార్చుకున్నాను)

ఈ లోయలు, నీలాకాశాలు నన్ను పిలుస్తున్నాయి.

ఈ నిశ్శబ్దపు సవ్వడులు నన్ను పిలుస్తున్నాయి.

ఈ మరులు గొలిపే అల్లరి గాలులు నన్ను పిలుస్తున్నాయి.

ఈ నేలకు వాలిపోతున్న మేఘాలు నన్ను పిలుస్తున్నాయి.

నది సుందరమైన మెలికలు తిరిగే కదలికలు నన్ను పిలుస్తున్నాయి.

కఠోరమైన వాతావరణ, నైసర్గిక పరిస్థితులు :

చార్దామ్ యాత్ర ద్వారా నేను ఆశించిన లక్ష్యాలు నేరేవేరినాయా? లేదా అన్న సంగతులు తర్వాత నా ట్రావెలాగ్ లో వివరంగా రాస్తాను. ఇప్పుడు చార్ధామ్ యాత్రకు వెళ్ళేవారికి ఒక అడ్వైజరీ ఇవ్వాలని మాత్రమే ఈ వ్యాసం. యాత్రకు పోయేముందు నాకు ఇటువంటి అడ్వైజరీ ఏదైనా దొరికి ఉంటే నేను ఈ దుస్సాహస యాత్రకు సిద్దపడేవాడిని కాదు. చార్ధాం యాత్రా అనుభవాలను ఎవరైనా తెలుగులో రికార్డు చేసి ఉంటారన్న ఆశతో ఇంటర్నెట్ లో వెతికాను. నవోదయ బుక్ హౌజ్ లో వెతికాను. పైడిమర్రి గిరిజ గారు రాసిన “గిరిగమనం” పుస్తకంలో ఒక వ్యాసం తప్ప మరేమీ దొరకలేదు. అందులో కూడా పోయాము, వచ్చాము అన్న రీతిలో కొంత సమాచారాన్ని, తన అనుభవాలను ఆమె రాసుకున్నారు. అక్కడ నెలకొని ఉన్న కఠోరమైన నైసర్గిక, వాతావరణ పరిస్థితులు, దుర్గమమైన యమునోత్రి, కేదార్నాథ్ ఘాట్ రోడ్లపై నడక, పాల్కీలు, డోలీలు, గుర్రాల మీద పర్వతాన్ని ఎక్కడంలో ఉండే కష్టాలు, దైవ దర్శనాలకు పాండాలకు ఇవ్వాల్సిన లంచాలు, పూజల పేరు మీద యాత్రీకుల నుంచి వారు దండుకునే వేల రూపాయలు, దైవ దర్శనానికి గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడడం, నేపాలీలైన డోలి వర్కర్ల శ్రమ దోపిడీ, ఇరుకు కొండ దారుల్లో వెలసిన అశుభ్రమైన గుడిసె హోటల్లలో దొరికే ఖరీదైన తిండి, నీరు (కప్పు ఛాయ 50, లీటర్ నీళ్ళు 100, ఒక ఆలూ పరోటా 100, పహాడీ మ్యాగ్గీ 100 రూపాయలు), అవి తినడం వల్ల మనకు తగులుకునే మోషన్స్, అమీబియాసిస్, సౌకర్యాల లేమి, సౌకర్యాలు కల్పించడంలో, కొండదారుల నిర్వహణలో ఉత్తరాఖండ్ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం, దేవస్థానాల అసమర్థ నిర్వాహణ వలన యాత్రీకుల కడగండ్లు, హెలికాప్టర్ సేవల్లో స్కాంలు ఆ వ్యాసంలో ఏమీ కనిపించలేదు. అందుకే చార్ధామ్ యాత్ర్రను పూర్తి చేసినవాడిగా చార్ధామ్ యాత్రకు పోవాలనుకుంటున్న దైవ విశ్వాసులకు ఒక అడ్వైజరీ జారీ చేయడం బాధ్యతగా భావించి  ఈ వ్యాసం రాసినాను.

చేదు అనుభవాలు – యాత్రీకులకు అడ్వైజరీ  :

సాగునీటి శాఖలో నా సీనియర్ మిత్రుడు, అతని సతీమణి ఇద్దరు సంవత్సరం కింద స్టంట్ లు వేసుకున్నారు. దిల్లీ నుంచి మా కంటే నాలుగు రోజుల ముందు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి చార్ధామ్ యాత్రకు బయలుదేరారు. వారి కార్డియాజిస్ట్ ‘ఏం కాదు పోండి’ అని చెప్పాడట. అతను అట్లా సలహా ఇవ్వడం సమంజసం కాదని నా మిత్రుడి అనుభవం రుజువు చేసింది. యాత్ర ముగించుకొని మే 27 న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి నేరుగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు నా మిత్రుడు. మూడు రోజులు ICU లో ఉంచారు. ఆ తర్వాత రూమ్ కు మార్చారు. మధ్యలో శ్వాస ఇబ్బంది రావడంతో మళ్ళీ ICU లోకి మార్చారు. రెండు రోజుల తర్వాత మళ్ళీ రూమ్ కి మార్చారు. ఇప్పటికీ అతను హాస్పిటల్ లో కోలుకుంటూ ఉన్నాడు. స్టంట్ వేసుకున్న నా చిన్ననాటి మిత్రుడు సబ్బని నర్సయ్య యాత్రకు వచ్చి ఉంటే వాడి పరిస్థితి కూడా ఇట్లాగే అయి ఉండేది. నా మిత్రుడి అనుభవం, నేను మూటగట్టుకొని వచ్చిన తీవ్రమైన దగ్గువర్షం (Acute Sinositis) నేపథ్యంలో ఇంటికి వచ్చాక మా చార్ధామ్ యాత్రా నిర్వాహకుడుకి 28.5.26 న వ్యక్తిగతంగా ఒక విన్నపం చేసాను.

“స్టంట్ వేసుకున్నవారు, హార్ట్ సర్జరీ చేసుకున్నవారు, ఆస్తమా, ఇతర శ్వాశకోశ వ్యాధులు ఉన్నవారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, మోకాలి చిప్ప ఆపరేషన్ చేయించు కున్నవారు, నాలాంటి ఊబకాయులు, వృద్దులు, చిన్నపిల్లలు చార్ధామ్ యాత్ర అసలు చేపట్టవద్దని ప్రభుత్వం తరపునే ప్రచారం జరగాలి. కనీసం టూర్ ఆపరేటర్ గా మీరైనా మీ కస్టమర్స్ కి తప్పనిసరిగా ఈ సూచన చేయాలి. ఈ సూచన చేయడం మీ బాధ్యత కూడా.  నా మిత్రుడి అదృష్టం బాగుండి వారు తిరిగి వచ్చారు. తిరిగి రానివారు ఎందరో!”.  నా సూచనకు ఆయన “యాత్రకు వచ్చే ముందు యాత్రికులు కూడా మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తే తగు సమాధానం ఇవ్వడానికి కుదురుతుంది. మాకు ఆస్తమా ఉంది, స్టంట్ పడింది, శ్వాసకోస ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మేము రావచ్చా, రావద్దా అని అడిగితే కదా సరైనే ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము సార్. అది కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి, యాత్రికులు చెప్పకపోతే ఏం చేస్తాము చెప్పండి.” అని బాధ్యతారహితంగా స్పందించాడు. దానికి మళ్ళీ నేను ‘మీరు మీ కరపత్రంలోనే ఎవరు యాత్రకు రాకూడదో ప్రత్యేక సూచనలు పెట్టండి. ఆ తర్వాత ఏదైనా యాత్రీకులదే బాధ్యత అవుతుంది మీది కాదు.” అని మెసేజ్ పెడితే ఆయన నుంచి ఏ స్పందనా లేదు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరపున గాని, దేశం నలు మూలల నుండి యాత్రీకులు చార్ధామ్ కు బయలుదేరుతున్నసందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తరపున, ముఖ్యంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరపున ఎటువంటి అడ్వైజరీలు జారీ కాకపోవడం శోచనీయం. జారీ కాకపోగా పోగా.. ఒకవైపు ప్రధానమంత్రి మోదీ  బొమ్మ, మరొకవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి బొమ్మలతో చార్ధామ్ యాత్రీకులకు స్వాగతం చేప్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో హోర్డింగ్లు మాత్రం ఏర్పాటు చేసింది. గోడల మీద పోస్టర్లు అతికించినది. యాత్రీకులను ఆహ్వానించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాత్రీకులకు మెరుగైన సేవలు అందించడంలో మాత్రం ఘోరంగా విఫలం అయినాయని ప్రత్యక్ష సాక్షిగా చెపుతున్నాను. హరిద్వార్, యమునోత్రి, ఉత్తరకాశి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేష్.. ఎక్కడకి పోయినా వేలాది వాహనాలను, లక్షలాది మంది జనాన్ని చూస్తే దేశమంతా చార్ధాం యాత్రా ఉద్యమంలో ఊగిపోతున్నదేమో అనిపించింది. దేశం నలు మూలల నుంచి జనం లక్షలాదిగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఇరుకైన రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ జాంలలో ఇరుక్కుపోయి కడగండ్ల పాలౌతున్నారు. అన్నికష్టాలను సహించి, గంటల తరబడి క్యూలో నిలబడి దేవుడి దర్శనాలకు ఉబలాటపడుతున్నారు. తొక్కిసలాటలో నలిగిపోతున్నారు. మా కళ్ళ ముందే ఊపిరి ఆడక కొట్టుకొని చనిపోయిన వాళ్ళు, అధిగ బరువున్న యాత్ర్రీకులను మోయలేక అలసిపోయి కొండ దారిలోనే తనువు చాలించిన గుర్రాలను చూశాము. గుర్రాల మీద నుంచి కింద పడిపోయి గాయాల పాలైన వారిని చూశాము. నా మిత్ర బృందంలోనే ఇద్దరు గుర్రాల మీద నుంచి జారిపడితే తలకు, మోకాళ్లకు గాయాలైనాయి.

భక్తి ముసుగులో వ్యాపారం :

కోట్లాది మంది హిందువుల భక్తి, విశ్వాసాలు పాండాలకు, ఆలయాల నిర్వాహకులకు, ఇతర అధికార యంత్రాంగానికి, టూర్ ఆపరేటర్లకు, హోటళ్ళ యజమానులకు ఆయాచితమైన, స్థిరమైన ఆదాయం తెచ్చి పెడుతున్నది. వీరు యాత్రీకుల నుంచి వసూలు చేసే కోట్లాది రూపాయల సొమ్ములో ప్రభుత్వానికి GST ద్వారా చేరుతున్నది ఎంతో ఆ దేవుళ్లకే ఎరుక. ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అతిపెద్ద వ్యాపార వనరు ఈ టెంపుల్ టూరిజమే. బిజెపి రాజాకీయాధికారం సుస్థిరం కావడానికి చార్ధామ్ యాత్రా ఉద్యమం ఒక తిరుగులేని పెట్టుబడి. కోట్లాది భారత ప్రజలను ఈ చార్ధామ్ యాత్రా మత్తులో ఊగిపోయేలా చేయడంలో మోదీ సఫలం అయినాడు. నా 14 రోజుల చార్ధామ్ యాత్రలో నా అనుభవంలోకి వచ్చిన సారాంశం ఇదే.

భగవంతుడు సర్వాంతర్యామి అని మనం నమ్ముతున్నప్పుడు ఇంత కఠోరమైన వాతావరణ (పగలు ప్రచండమైన ఎండ, రాత్రి జీరో డిగ్రీలకు పడిపోయే భయంకరమైన చలి), నైసర్గిక పరిస్థితులను దాటుకొని గర్భగుడిలో మూల విరాట్ సందర్శనం కోసం మాత్రమే బతుకునే పణంగా పెట్టి యాత్రలకు పోవడంలో తత్వం, పరమార్థం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. మా సహ యాత్రీకురాలు శ్రీమతి జ్యోతి గారు “శిఖర దర్శనం చింత నాశనం, ముఖ దర్శనం ముక్తిదాయకం, పాద దర్శనం పాప నాశనం” అని ప్రవచించినారు. కేదార్నాథ్, బద్రీనాథ్ లో మా వాళ్ళు పొద్దున్న మూడు గంటలకే లేచి చలిలో తానాలు చేసి దైవ దర్శనానికి వెళితే నేను ఎండ వచ్చినాకనే ‘శిఖర దర్శనం’ చేసుకొని, హిమాలయ పర్వతాల ఫోటోలు, పరిసరాల ఫోటోలు తీసుకొని సంతృప్తి చెందాను. అసలు ఈ దేవుళ్ళు (తిరుమల వేంకటేశ్వరుడు, బెజవాడ కనకదుర్గ, సింహాచలం, అన్నవరం, యాదగిరి గుట్ట నరసింహస్వామి, కొండగట్టు అంజన్న, కోటప్పకొండ, వైష్ణోదేవి, కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్.. ఇంకా మరెన్నో) దుర్గమమైన కొండల మీదనే ఎందుకు వెలుస్తారు?

చివరగా .. ఉత్తర, దక్షిణ భారత యాత్రలకు పోవడం కొత్త కాదు. శతాబ్దాల తరబడి జరుగుతున్నదే. అయితే ఆనాడు ఇప్పుడున్నట్టు ఆ యాత్రలకు ఉద్యమ స్వభావం లేదు. కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమె ఉండింది. నిజానికి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒకేసారి లక్షలాది మంది జనాన్నిఇముడ్చుకునే శక్తి గాని, విస్తృతి గాని లేదు. ఇరుకైన కొండ దారుల్లో లక్షలాది వాహనాలను అనుమతించడంలో ఔచిత్యం ఏమైనా ఉందా? అయితే అతి సాధారణంగా, నిజమైన ఆధ్యాత్మిక భావనతో సాగవలసిన చార్ధామ్ యాత్రను రాజకీయ  ఉద్యమ రూపంలోకి దిగజార్చడం వలన దైవ విశ్వాసులు ఎదుర్కొంటున్న కడగండ్లకు అంతులేదు. చార్ధామ్ యాత్ర ఎట్లా వ్యాపారీకరణ చెందిందో కండ్లకు కట్టినట్టు నా సహా యాత్రీకుడు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సంగనభట్ల రామకృష్ణయ్య గారు కేదార్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత “వ్యాపారీకరణ ముసుగులో చార్ధాం యాత్ర” శీర్షికతో ఒక వ్యాసాన్ని ప్రచురించారు. ఆ వ్యాసం లింక్ ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆసక్తి ఉన్నవాళ్లు ఆ లింక్ ను క్లిక్ చేసి చదువుకోవచ్చు.

ఈ ఉద్యమకాలంలో చార్ధాం యాత్రకు పోయే వాళ్ళను ఆపడం ఎవరి తరం కాదు. అయితే ఎవరు పోవాలి, ఎవరు పోకూడదు అన్న విచక్షణ దైవ విశ్వాసులైన యాత్రీకులకు ఉండవలసిన అవసరం ఉన్నది.. తమ కోసం, తమవారి కోసం.

చార్దాం యాత్రకు ఎవరు పోకూడదు ?

  • స్టంట్ వేసుకున్నవారు, హార్ట్ సర్జరీ చేసుకున్నవారు
  • అస్మా, టిబి ఇతర శ్వాశకోశ వ్యాధులు ఉన్నవారు,
  • సైనోసైటిస్ వ్యాధిగ్రస్తులు
  • మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, మోకాలి చిప్ప ఆపరేషన్ చేయించుకున్నవారు,
  • ఇన్సులిన్ ఇంజెక్షన్ మీద ఆధారపడే షుగర్ వ్యాధిగ్రస్తులు
  • ఊబకాయులు.. అంటే 70+ కిలోల బరువున్నవారు,
  • 65+ వయసున్నవారు, వృద్దులు, 15 కంటే తక్కువ వయసున్న చిన్నపిల్లలు
  • గర్భిణీ స్త్రీలు

(పైన పేర్కొన్న కేటగిరిలోకి వచ్చే వాళ్ళందరూ నాకు యాత్రలో అష్టకష్టాలు పడుతూ తారసపడినారు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *