ప్రశ్నార్ధకంగా ఉద్యమకారుల భవిష్యత్తు 

  “ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనాలంటేనే భయపడే వాతావారణాన్ని ఏర్పారచాలన్నదే పాలకుల పన్నాగం. సాయుధ పోరాట స్ఫూర్తి, త్యాగాల ఘనత కలిగిన తెలంగాణ ప్రజలు ఒక్కటై కదిలారు. రాజకీయ పార్టీ లను,ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను, కార్మిక కర్షకులను ఆట పాట మాట లతో కదిలించిన కవులు కళాకారులు, బుద్ధి జీవులు, ఇలా నాలుకోట్ల ప్రజలు వివిధ రూపాలలో ఉద్యమాలు సాగించారు. విద్యార్థి లోకం ముందుండి నడిచింది. కేసులు, జైళ్లు, చిత్రహింసలు, నిర్బంధాలెన్నో అనుభవించారు. పార్లమెంట్ లో బిల్లుపెట్టేల ఒత్తిడి తెచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా కృషిచేసి (భౌగోళిక తెలంగాణా రాష్ట్రం) సాధించించుకున్నారు..”   
.. రమణాచారి

తెలంగాణ అనే పదం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసన సభలో ఉచ్చరించ కూడదని, వెనుకబడ్డ ప్రాంతం అనాలని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న అసెంబ్లీలో స్పీకర్ రూలింగ్ ఇచ్చిన కాలం అది. *ఆట-పాట -మాట బంద్* తో నిర్బంధం కొనసాగుతున్న రోజులవి. ఆత్మగౌరవం కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తిరిగి ఊపిరి లూదుతుతున్న సమయం అది. ప్రపంచ బ్యాంకు సి ఈ.ఓ .గా కీర్తించబడుతున్న చంద్రబాబు పాలనది. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభంగా భువనగిరిలో *దగా పడ్డ తెలంగాణ* సభలో అమ్మా తెలంగాణమా! ఆకలికేకల గానమా! అని గద్దర్ గానం చేశాడు. చంద్రబాబు ప్రభుత్వం కన్నెర్ర చేసింది. గద్దర్ పై కాల్పులు (ఏప్రిల్6, 1997) జరిపించింది. తెలంగాణ మహాసభ పేరుతో సూర్యాపేటలో సభ జరిగింది. దీనికి బాధ్యునిగా భావించిన మారోజు వీరన్న ను (16 మే 1999) బూటకపు ఎన్కౌంటర్ లో హతమార్చింది. *ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యం* గా ముందుకు కదిలిన బెల్లి లలితను, ప్రైవేట్ హంతక ముఠాతో అత్యంత కిరాతకంగా పదిహేడు ముక్కలుగా నరికి హత్య చేయించింది.

       ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనాలంటేనే భయపడే వాతావారణాన్ని ఏర్పారచాలన్నదే పాలకుల పన్నాగం. సాయుధ పోరాట స్ఫూర్తి, త్యాగాల ఘనత కలిగిన తెలంగాణ ప్రజలు ఒక్కటై కదిలారు. రాజకీయ పార్టీ లను,ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను, కార్మిక కర్షకులను ఆట పాట మాట లతో కదిలించిన కవులు కళాకారులు, బుద్ధి జీవులు, ఇలా నాలుకోట్ల ప్రజలు వివిధ రూపాలలో ఉద్యమాలు సాగించారు. విద్యార్థి లోకం ముందుండి నడిచింది. కేసులు, జైళ్లు, చిత్రహింసలు, నిర్బంధాలెన్నో అనుభవించారు. పార్లమెంట్ లో బిల్లుపెట్టేల ఒత్తిడి తెచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా కృషిచేసి (భౌగోళిక తెలంగాణా రాష్ట్రం) సాధించించుకున్నారు.
    సుమారు నాలుగు దశబ్దాల కాలం పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు కలలుగానే మిగిలాయి. రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాల ఆరునెలలు కావస్తున్న ప్రభుత్వాలు మారినా *ఉద్యమకారులకు గౌరవం* అన్న ఎన్నికల వాగ్దానం ఆచరణకు నోచుకోలేదు . పండితుణ్ణి పామరుణ్ణి పరవశింప చేసేది పాట. పాటకు కళాత్మక రూపం ఆట. తెలంగాణ ఉద్యమం లో ఆట- పాటల పాత్ర కీలకమైనది. ప్రజలను పరవశింప జేసి, ఊర్రూతలూగించి ఉద్యమానికి ఊపునిచ్చింది. ‘ఆట – పాట – మాట’ లతో ఉవ్వెత్తున సాగిన పోరాటం గల్లీ లో మొదలై దిల్లీ ని కదిలించింది. సాయుధ రైతాంగ పోరాటకాలంలో నాజర్ బుర్రకథ , విప్లవోద్యమంలో, ప్రజాస్వామిక తెలంగాణ పోరాటంలో గద్దర్ ఆట – పాట, లెక్కకు మించిన కళాకారుల ధూమ్-దాం  పల్లెలను పోరుబాట పట్టించింది.గ్రామాలను, పట్టణాలను సరిహద్దులు దాటించింది యావత్తు తెలంగాణ సమాజం ఒక్కటై నిలిచేలా. ఉర్రూతలూగించే ఉపన్యాసాలు, చారిత్రక ఘట్టలను వివరించే మాటలు కలబోసి రక్తి కట్టించే కళా రూపాలు తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకలు. రవి గాంచని చోటు కవి గాంచునన్నట్లు ప్రజల హృదయాంతరాళాలలోని స్పందనలకు అద్దం పట్టే ఎన్నో నవలలు, కథలు చదువరులు చేతికి వచ్చి ప్రజలతో కలిసి ఉద్యమ బాటలో ముందుకు సాగేలా పాదులు వేసాయి.
    కూలీ రేట్ల పెంపుదల కోసం మొదలైన ఉద్యమం తెలంగాణ నిరుపేద కూలి ప్రజలను పోరాటంలోకి కదిలించింది. భూమికోసం, భుక్తి కోసం జరిపిన న్యాయపోరాటం దొరల కంటిలో నలుసైన బందగి ని బలిగొన్నది. సంఘం పెట్టుకునే హక్కు, సభ జరుపుకునే హాక్కుల పోరాటం లో దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడు. దున్నే వానికే భూమి కోసం జరిగిన సాయుధ రైతంగ పోరాట కాలంలో నిజాం సైన్యం ఖాసీం రజ్వీ, భారత ప్రభుత్వం జరిపిన పోలీస్ చర్య ఫలితంగా వేలాది మంది అసువులు బాసారు. 1969 ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమంలో 369 మంది పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. మలిదశ ఉద్యమంలో నిరాశ చెందిన యువత కాసోజు శ్రీకాంతాచారి తో మొదలై దాదాపు 1200 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉద్యమకారులు, కవి గాయకులు ఎందరున్నా త్యాగాలతో గాయాలతో అలుపెరగని పోరాటం చేసిన / అసువులు బాసిన వారి చరిత్ర మరువలేనిది / మరువకూడనిది కూడా!
     ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు , మారోజు వీరన్న, తెలంగాణా కళా సమితి నేత తొర్రూరు ఐలన్నల బూటకవు ఎన్కౌంటర్ , వరంగల్ శ్రీకాంత్, తెలంగాణ కళా సమితి రాష్ట్ర కో – కన్వీనర్ బెల్లి లలిత దారుణ హత్య రాజ్య హింస పరాకాష్టతకు ప్రతీకలుగా నిలుస్తాయి. తెలంగాణ జనసభ నల్లగొండ జిల్లా కన్వీనర్, తెలంగాణ కళాసమితి రాష్ట్ర బాధ్యుడు రమణాచారి బూటకపు ఎన్కౌంటర్ ప్రకటన, రాజీనామా ఒత్తిడిని అధిగమిస్తూ, చిత్రహింసల కొలిమి నుండి బయటపడి ఆరు నెలల పాటు ఊరిని వదిలి పెట్టి హైదరాబాద్ లో తలదాచుకున్న తుర్కపల్లి జహంగీర్ ( 2 ఏప్రిల్ 2026) గుండెపోటుతో అసువులు బాసాడు , మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి దుర్మార్గంలో భాగంగా అతి పాశవిక హత్య గురైన అలుగుబెల్లి రవీందర్ రెడ్డి, తీవ్ర చిత్ర హింసల కొలిమిలో అల్లల్లాడి ప్రాణా లోదిలిన పొన్నాల చంద్రమౌళి,పోలీస్ చిత్రహింసలతో అనారోగ్యం పాలైన మేకల వీరన్న, బుడిగ బిక్షపతి, పంది పెంటయ్య, టి.ఎస్.ఎఫ్. కన్వీనర్ నాగరాజు, ఏబీవీపీ గుండాల దాడిలో బ్రతికి బట్టకట్టిన టి. ఎస్. ఎఫ్. నేత కాసిం, పోలీస్ చిత్ర హింసలకు గురైన వివిధ జిల్లాల కమిటీ బాధ్యులు…… ఇలా లెక్కకు మించిన ఎందరో బాధితులు.గజ్వేల్ జనసభ ఆఫీస్ పై దాడి చేసి జిల్లా కన్వీనర్ దారం మల్లారెడ్డి, కళాకారుడు సత్తయ్య తో సహా ఏడుగురిపై *రాజద్రోహం కేసు* బనాయించారు.
      జనసభ అనుబంధ సంఘాలన్నిటి పైన, పౌర హక్కుల సంఘం నేతల పైన, ఫెడరేషన్ ఉపాధ్యాయ సంఘం బాధ్యుల పైన, రైతు సంఘం నేతల పైన నిర్బంధం, తీవ్ర అణచివేత కొనసాగింది. తెలంగాణా ఉద్యమం లో బలిదానాలైన వారిని కొందరిని *తెలంగాణా తెచ్చాం* అనిచెప్పుకున్న నాటి టి.ఆర్.ఎస్. ప్రభుత్వం గుర్తించింది. *తెలంగాణా రాష్ట్రం ఇచ్చామని చెప్పే* అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమకు నచ్చిన ఒక ఏడుగురిని ఎంపిక చేసి ఉద్యమకారులను? గౌరవించామని  గొప్పలు చెప్పుకుంది. నిజానికి అసలు, సిసలైన ఉద్యమకారులకు ఒరిగింది / ఒనగూరింది శూన్యం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎండమావులుగా మారాయి. ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా,లిక్కర్ మాఫియా అంటూ మాఫియా రాజ్యం విస్తరించింది. నారాయణ- శ్రీ చైతన్య వంటి కార్పోరెట్ విద్యా సంస్థలు రాష్ట్ర అంతటా విచ్చలవిడిగా విస్తరిస్తూనే ఉన్నాయి. అభివృద్ధి అంతా రాష్ట్ర రాజధాని చుట్టూనే జరుగుతున్నది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రణాళిక లేదు. సింగరే ణిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కు అడ్డు అదుపు లేదు. ఫార్మ కంపెనీల విస్తరణ వాయు, జలకాలుష్యాన్ని పెంచుతున్నది.మెడికల్ మాఫియా రాజ్యం బహుముఖం అయ్యింది. కార్పొరేట్ హాస్పిటల్స్  విస్తరణ ఆపే నాధుడే కరువయ్యాడు. గుట్టలను గ్రానైట్ అనకొండలు మింగి వేస్తున్నాయి. అందరికీ ఉచిత విద్య – వైద్యం ఎప్పటికి పేదవానికి అందని ద్రాక్షే.
       ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పుష్కర కాలం గడుస్తున్నా తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక విధానం అమలుకు నోచుకోలేదు. తెలంగాణ సినీ పరిశ్రమ కుదేలయ్యింది. ఉద్యమకారుల గుర్తింపు, గౌరవ అంశం ఎక్కడవేసిన గొంగడి అన్న చందంగా మిగిలిపోయింది. పాలకులలో ఉద్యమ స్ఫూర్తి కొరవడడమే ఇందుకు కారణం. పత్రికా రంగం కూడా తెలంగాణాలో నిలదోక్కుకోలేక పోతున్నది. పత్రికలు / మీడియా ఆంధ్రపాలకుల తొత్తులుగా వెలుగొందుతున్నాయి.* భావితరాల కోసం ఎన్నో ఆశల్తో, ఆకాంక్షల్తో ఉద్యమాన్ని నడిపించిన ప్రజలకు,ఉద్యమకారులకు మిగిలింది పాలకుల శుష్క వాగ్దానాలు,శూన్య హస్తాలే. ప్రత్యేక రాష్ట్ర సాధనాలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికి వినమ్రంగా వందనాలు తెలుపుదాం.అమరుల కుటుంబాలను అండగా నిలబడి,ఆదుకుందాం! ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *