చ‌రిత్ర పుట‌ల్లోకి పీపుల్స్‌ వార్ శ‌కం!!

“ప్ర‌స్తుత ప‌రిణామాన్ని గ‌మ‌నిస్తే పీపుల్స్ వార్ గ్రూప్ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చింద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. బెంగాల్ నుంచి జగిత్యాల వరకు, జగిత్యాల నుంచి జంగిల్ మహ‌ల్ వరకు సాగిన జైత్రయాత్ర విస్తరిస్తే, ఇప్పుడు తిరోగమంతో తెలంగాణలో ముగింపు పలుకుతున్న‌ది. దండకారణ్యం, రెడ్‌ కారిడార్‌ నుంచి పీపుల్స్ వార్ గ్రూప్ రిట్రీట్‌ అవుతోంది. మైదాన ప్రాంతం నుంచి దండకారణ్యం వెళ్లి ఆదివాసులను చైతన్యం చేయడంలో కీలకపాత్ర పోషించిన పీపుల్స్ వార్‌ గ్రూప్‌, ఇప్పుడు ఆదివాసుల చైత‌న్యం అవుతున్న కీలక సమయంలో లొంగుబాట్లతో వెనక్కి తగ్గడం, కేంద్రం ఆదివాసులపై సాగిస్తున్న నరమేధం చివరి దశలో వారికి అండగా ఉండాల్సిన సమయంలో నిరాయుధీకరణ చేయడం, మావోయిస్టు పార్టీకే కాదు, ఆదివాసి సమాజానికి ద్రోహం చేయడమే అవుతుంది.”

దేశంలో మావోయిస్టుల లొంగుబాటుల పరంపర కొనసాగుతోంది. కీలక నేతలు వనం విడిచి జనం బాట పడుతున్నారు. సిద్దాంతపరమైన విభేదాలతో సాయుధ పోరాట పంథాను విమర్శిస్తున్నవారు లొంగుబాటు పంథాను ఎంచుకుంటే. సాయుధ పోరాటామే మావోయిస్టు పార్టీ ఏకైక మార్గమని విశ్వసించే వారు కూడా వయసు మీద పడటం, అనారోగ్య సమస్యలతో పాటు దట్టమైన అడవిలో చురుగ్గా కదులుతూ భారత సైన్యంతో పోటీపడి యుద్దం చేసేందుకు శరీరం సహకరించలేక లొంగిపోతున్నారు. మరికొందరు అజ్ఞాన పోరాటాలకు కాలం చెందిందని మైదానంలో ప్రజలను చైన్యతం చేసే ఉద్దేశ్యంతో కీకారణ్యం నుంచి “జనారణ్యం”లోకి వస్తున్నారు. .భారత పాలకులు మొదలు పెట్టిన అంతిమ యుద్దం కగార్‌ తో మావోయిస్ట్‌ పార్టీ చెల్లచెదురైంది.

1990 తర్వాత కేంద్రం చెపట్టిన మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్ల ప‌రంప‌ర‌ కగార్‌తో తార‌ స్థాయికి చేరింది. దీంతో దండకారణ్యం రక్తమోడుతోంది.తుటాలు చిందించే రక్తంతో అడివి ఎరుపెక్కుతున్న‌ది. గోదావరి, ఇంద్రావతి నదుల్లో నీటితో పాటు విప్లవకారుల రక్తాన్ని పాలకులు పారిస్తున్నారు. మోదీ షాలు చెపుతున్నట్లు సాయుధ పోరాటాన్ని బలహీనపర‌చేందుకు కగార్‌ అంతిమ యుద్దం కావచ్చు, కానీ, మావోయిజం, కమ్యూనిజం సైద్దాంతింక చర్చ లేకుండా చేయడంలో కగార్‌ ఆరంభం మాత్రమే. కేంద్రం మాజీలతో చేస్తున్న వీడియోలతో బీజేపీ వ్యూహాలు మొదలు పెట్టడం ఇందులో భాగమే. మావోయిస్టుల లొంగుబాటులను గమనిస్తే రెండు ర‌కాలు కనిపిస్తాయి.

ఒకటి వయస్సు పెరగడం, ఆనారోగ్య సమస్యలతో లొంగుబాటు అయితే, ఇంకోటి విప్లవోద్య‌మానికి ద్రోహం చేస్తున్న లొంగుబాట్లు. సాయుధ పోరాటం కొనసాగాలి, ఆదివాసులను రక్షించడంతో పాటు దేశ సంపదను కాపాడేందుకు సాయుధ పోరాటమే అంతిమ పరిష్కారమని నమ్మేవారు ప్రజల ఆస్తులైన తుపాకులు పార్టీకి అప్పగించి జన జీవన స్రవంతిలో కలిస్తే, మరోవైపు సాయుధ పోరాటానికి, నమ్మిన సిద్దాంతానికి ద్రోహం చేస్తూ తుపాకులను పాలకుల కాళ్ల దగ్గర పెట్టి లొంగిపోవడం జ‌రుగుతోంది. ఇద్దరి ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఈ రెండు రకాల లొంగుబాట్లో ఒకదాంట్లో ద్రోహం కనిస్తే, మరోదాంట్లో ప్రజల సాయుధ పోరాట ఆకాంక్ష కనిపిస్తుంది.

లొంగిపోయిన వారు కూడా రెండు రకాల ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ప్రజల పక్షాన ఉంటూ , ప్రజా పోరాటాలు నిర్మించాలనే వారు సాయుధ పోరాటాన్ని సమర్ధిస్తూ, ప్రజలను చైత‌న్యం చేస్తామని చెబుతుంటే, విప్లవోద్యమానికి ద్రోహానికి పాల్పడుతున్న వారు రాజ్యం నీడలో ఉంటూ సాయుధ పోరాటం పనికిరాదనే ప్రచారం చేస్తున్నారు. ఈ భిన్న ప్రకటనలను ప్రజలు, కార్మిక వర్గాలు విద్యార్థులు, విప్లవ శిబిరాలు గమనించాలి. తుపాకులతో రాజ్యం ముందు మోకరిల్లిన మల్లొజుల వేణుగోపాల్‌ రావు, తక్కళ్లపల్లి వాసుదేవ రావుల లొంగిపోయిన విప్లవ ప్రతి ఘాతుకమని, దిగజారిపోయారని ప్రజలు అంటుంటే, బండి ప్రకాశ్‌, పుల్లూరి ప్రసాద్‌ రావు, చంద్రన్నల లొంగుబాటును అందుకు భిన్నంగా చూస్తున్నారు. ఆనారోగ్య కారణాలతో తుపాకులు విప్లవ, సాయుధ ప్రజలకిచ్చి లొంగిపోయామని, అయినా సాయుధ పోరాటాన్ని సమర్థిస్తున్నామని, ప్రజలను సాయుధ పోరాటం వైపు మళ్లించడమే తమ ఎజెండా అని ఏకంగా డీజీపీ ముందే చెప్పి తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించారు.

గత ఏడాదిగా మావోయిస్టు కీలక నేతల వరుస లొంగుబాట్ల‌కు సీనియర్ల ఆనారోగ్య సమస్యలు కొంత కారణమైనా, మావోయిస్టు పార్టీలో స్పష్టమైన విభజన, చీలిక అయితే స్ప‌ష్టంగా కనిపిస్తున్న‌ది. సైద్దాంతిక విభేదాలు, ఆధిపత్యం ధోరణి, పోరాట చైత‌న్యం తగ్గడం, దశాబ్దాలుగా ప్రాణాన్ని లెక్క చేయకుండా పోరాటం చేసి ఇప్పుడు ప్రాణంపై ఆశలు కలగడం కారణం ఏదైనా కావచ్చు. కానీ, ఉమ్మడి మావోయిస్టు పార్టీలో విభజన మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పీపుల్స్ వార్ గ్రూప్, ఎంసీపీ నాయకుల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. 2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్‌, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)గా ఏర్పడ్డాయి. పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉంటే, దండకారణ్యంలో ముఖ్యంగా బీహార్‌ జార్ఖండ్ సహా ఆదివాసులు ఉండే ప్రాంతాల్లో ఎంసిసిఐ బలంగా ఉండి.బహుజన సంస్థలలో క్రాంతికారి కిసాన్ కమిటీ (విప్లవ రైతుల కమిటీ), జన సురక్ష సంఘర్ష్ మంచ్ (పీపుల్స్ డిఫెన్స్ స్ట్రగుల్ బ్లాక్), క్రాంతికారై బుద్ధిజీవి సంఘ్, క్రాంతికారి ఛత్ర లీగ్ (రివల్యూషనరీ స్టూడెంట్స్ లీగ్) ఉన్నాయి. పార్టీ సాయుధ విభాగాన్ని లాల్ రస్ఖా దళ్ (రెడ్ డిఫెన్స్ ఫోర్స్) అని పిలిచేవారు. విప్లవ గ్రూప్‌ల ఏకీకరణ పేరుతో పీపుల్స్‌ వార్ గ్రూప్‌లో ఎంసీసీఐ విలీనమైన త‌ర్వాత‌ బలమైన విప్లవ శక్తిగా మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందాయి. మైదానప్రాంతం, ఉన్నత చదువులు చదువుకున్న వారు పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌లో ఉండటంతో మావోయిస్టు పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారు నాయకత్వం వహించారు.ఇప్పటికి వహిస్తున్నారు కూడా.

తెలుగురాష్ట్రాల్లో ప్రభుత్వాల అణిచివేతతో విప్లవోద్యమం దండకారణ్యానికి విస్తరించిందనడంలో కొంత వాస్తవం ఉన్నా, అంతకుముందే అక్కడ రకరకాల విప్లవ గ్రూప్‌లు పని చేస్తున్నాయి. తెలుగు వారు వెళ్లడంతో పోరాటం కాస్తా మరింత బలంగా ఎదిగింది. తాజా లొంగుబాట్ల‌తో రెండు దశాబ్దాల మావోయిస్ట్‌ పార్టీలో చీలికలు కనిస్తున్నాయి. 2004లో కలిసిన పీపుల్స్ వార్,ఎంసీసీఐ లు ప్రస్తుత లొంగుబాట్ల‌ తీరును ప‌రిశీలిస్తే ఇప్పుడు మళ్ళీ విడిపోయినట్టు అనిపిస్తుంది. అయితే లొంగుబాటు తీరు ఎలా ఉన్నా, లొంగిపోతున్న వారు ఒక వర్గానికో, ఒక విప్లవ పార్టీ గ్రూప్‌కో చెందిన వారు కావడం యాదృశ్చికం. మరీ ముఖ్యంగా జన జీవన స్రవంతిలో కలుస్తున్న మెజార్టీ నేతలు పాత పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌కు చెందిన వారే కావడం ఆలోచించాల్సిన విషయం. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు, పూర్వాశ్రమంలో మైదాన ప్రాంతంలో పని చేసిన వారు, అన్నింటికీమించి పీపుల్స్ వార్ గ్రూప్ నేతలే లొంగుబాటు బాట పట్టడం కనిపిస్తుంది.

ఇది విప్లవ శక్తులు, విప్లవ శిబిరాలు ఆలోచించాల్సిన అంశం. మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మరో ప్రధాన వైరుధ్యం కనిపిస్తుంది. పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ నుంచి నాయకులుగా ఎదిగినవారు, అందులోనూ జగిత్యాల పోరాటాలను నడిపిన వారు, ఆ పోరాటాలతో చైత‌న్య‌మైన‌ వారి నుంచే వరుస లొంగుబాట్లు కనిపిస్తున్నాయి. దేశంలో సాయుధ పోరాటం విఫలమైందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయుధ తిరుగుబాటు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అంటూ పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌లో ఎదిగిన కొందరు నాయకులు త‌మ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ప్ర‌చారం చేస్తున్నారు. అయితే మొదటి నుంచి సాయుధ పోరాటమే చివరి మార్గమని నమ్మిన ఎంసీపీఐ గ్రూప్‌ తన పోరాటాన్ని కొనసాగించేందుకే సిద్దమైంది. తెలంగాణకు చెందిన మావోయిస్ట్‌ నేతలు, అంతకుముందు పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌లో పని చేసిన కీలక నేతలు, సాయుధ పోరాటాన్ని నిలిపివేద్దామనే చర్చను కేంద్ర కమిటిలో పెట్టి ఏకపక్షంగా పార్టీకి ద్రోహం చేస్తూ లొంగిపోతున్నప్ప‌టికీ ఎంసీసీఐ గ్రూప్‌ మాత్రం సాయుధ పోరాటం కొనసాగించాల‌నే నిర్ణ‌యించుకుంది. చంద్రన్న వంటి పీపుల్స్ వార్ గ్రూప్ లో ఎదిగిన నేతలు కొందమంది సాయుధ పోరాటానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. లొంగుబాటు సందర్భంగా డీజీపీ సమక్షంలోనే ఈ సంగ‌తి స్పష్టం చేశారు.

ప్ర‌స్తుత ప‌రిణామాన్ని గ‌మ‌నిస్తే పీపుల్స్ వార్ గ్రూప్ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చింద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. బెంగాల్ నుంచి జగిత్యాల వరకు, జగిత్యాల నుంచి జంగిల్ మహ‌ల్ వరకు సాగిన జైత్రయాత్ర విస్తరిస్తే, ఇప్పుడు తిరోగమంతో తెలంగాణలో ముగింపు పలుకుతున్న‌ది.దండకారణ్యం, రెడ్‌ కారిడార్‌ నుంచి పీపుల్స్ వార్ గ్రూప్ రిట్రీట్‌ అవుతోంది. మైదాన ప్రాంతం నుంచి దండకారణ్యం వెళ్లి ఆదివాసులను చైతన్యం చేయడంలో కీలకపాత్ర పోషించిన పీపుల్స్ వార్‌ గ్రూప్‌, ఇప్పుడు ఆదివాసుల చైత‌న్యం అవుతున్న కీలక సమయంలో లొంగుబాట్లతో వెనక్కి తగ్గడం, కేంద్రం ఆదివాసులపై సాగిస్తున్న నరమేధం చివరి దశలో వారికి అండగా ఉండాల్సిన సమయంలో నిరాయుధీకరణ చేయడం, మావోయిస్టు పార్టీకే కాదు, ఆదివాసి సమాజానికి ద్రోహం చేయడమే అవుతుంది. మొదటి నుంచి ఆదివాసులు జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడుతున్నారు. మావోయిస్టు పార్టీ వారి పోరాటానికి మరింత ఊతం ఇచ్చింది. జాతి పోరాటాలను వర్గ పోరాటంగా మార్చే ప్రయత్నం మావోయిస్టు పార్టీ చేసింది. ఇప్పుడు కీలక సమయంలో ఆదివాసులను తెలంగాణ పీపుల్స్ వార్ గ్రూప్ నిండా ముంచిందన్న అభిప్రాయం అటు ఆదివాసులతో పాటు, విప్లవ శిబిరంలో, ఎంసీసిఐ గ్రూప్‌లో ఏర్పడింది.ఇందుకు అనారోగ్యం సమస్యలే కాదు, ఆధిపత్యం కూడా ఒక కారణం. పీపుల్స్ వార్ గ్రూప్ లేని మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఆదివాసులు పక్షాన నిలబడుతున్న‌ది. ఆదివాసుల జీవన్మరణ పోరాటంలో ఎంసీపీఐ గ్రూప్‌ మావోయిస్టు పార్టీని సాయుధ పోరాటంగా కొనసాగిస్తుంది.

పీపుల్స్ వార్ గ్రూప్ మావోయిస్ట్‌ పార్టీగా ఏర్పడి మైదాన ప్రాంతం నుంచి దండకారణ్యానికి వెళ్ళక ముందు నుంచే ఆదివాసులు రకరకాల పేర్లతో అస్థిత్వ, జాతీ పోరాటాలు చేశారు.మావోయిస్ట్ పార్టీ కేవలం సైద్దాంతిక పునాది మాత్రమే వేసింది. ఇప్పుడు మళ్ళీ అదే స్పూర్తితో ఆదివాసులు ముందుకు సాగుతున్నారు.సంక్షోభ కాలంలో పీపుల్స్ వార్ గ్రూప్ లో కొంత మంది ద్రోహం చేసి లొంగిపోతున్నారు. కీలక వ్యక్తులు ఇప్పుడు రాజ్యం నీడలో మాజీలు గా మారి ఆదివాసుల పోరాటాన్ని పాలకులతో కలిసి అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. . ఏది యేమైనా మావోయిస్ట్‌ పార్టీలో పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ శకం ముగిసిన అధ్యయమే. మైదానం నుంచి అరణ్యం వెళ్లిన వారు మళ్లీ సాయుధ పోరాటాన్ని వదిలేసి మైదానం బాట‌ప‌ట్టారు. అప్పుడు ఇప్పుడు కూడా ఆదివాసుల ప‌క్షాన‌ నిలబడుతున్నది మాత్రం ఎంసీసీఐ అనేది తాజా ఘటనలు చూస్తే అర్థం అవుతున్న‌ది. ఇక నుంచి మావోయిస్ట్‌ పార్టీ నుంచి పీపుల్స్ వార్‌ గ్రూప్‌ను వేరుచేసి చూడాలి. నాలుగున్నర దశాబ్దాల పీడ‌బ్ల్యుజి పోరాటం ఇక చరిత్ర పుటల్లోకి వెళ్లిన‌ట్టే!
-తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page