ప్రతి ప్రమాదమూ పథకం ఫలితమే!

“నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రవాణా రంగం మీద దాదాపు గుత్తాధిపత్యం నెరపుతున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లది మొదటి నుంచి చివరి దాకా మోసాలమయమైన వ్యాపారం. అటువంటి అక్రమ వ్యాపారంలో ప్రమాదం అనేది యాదృచ్ఛికం కాదు, అది ఒక పథక రచన ప్రకారం జరిగిన అనేక పరిణామాల పర్యవసానం. ఆ అక్రమ వ్యాపారాన్ని ప్రభుత్వ నియంత్రణా సంస్థలన్నీ సజావుగా సాగిపోనిస్తున్నాయి. ఆ నియంత్రణా సంస్థల విధాన నిర్ణయాలు చేసే రాజకీయ నాయకత్వంలో స్వయంగా ఆ ప్రైవేటు బస్సుల యజమానులే ఉన్నారు. లేదా ఆ యజమానుల సన్నిహిత మిత్రులు, లేదా ఆ యజమానుల ముడుపులు అందుకునే వారు ఉన్నారు.”

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ స్లీపర్ బస్సు గత శుక్రవారం తెల్లవారు జామున కర్నూలు జిల్లా చిన్న టేకూరు దగ్గర ప్రమాదానికి గురయి, ఇరవై మంది సజీవ దహనం అయ్యారు. శుక్ర, శని, ఆదివారాలు ప్రధాన స్రవంతి ఛానళ్లలో,  పత్రికలలో, సామాజిక మాధ్యమాలలో హృదయ విదారకమైన వార్తా కథనాలు, స్పందనలు వెలువడ్డాయి. చనిపోయినవారిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ చెరి ఆరుగురు, తమిళనాడు, కర్ణాటక, బీహార్, ఒడిశా వాసులు కూడా ఉండడంతో అనేక చోట్ల విషాదం వ్యాపించింది. ఛానళ్ల నిండా, పత్రికల నిండా చాలా కన్నీళ్లే ప్రవహించాయి. ఒకింత ఆగ్రహం కూడా కనిపించింది. ఈ మరణాలకు ఎవరు బాధ్యులు అనే ప్రశ్న కూడా తలెత్తింది. కాని మూడు రోజులు గడిచేసరికి మళ్లీ అంతా మామూలైపోయింది. ఒక ప్రమాదం జరగగానే ఒకటి రెండు రోజులు గగ్గోలు పెట్టడం, మూడో నాటికి మరిచిపోవడం, లేదా మరొక ప్రమాదమో, మరింత పెద్ద సమస్యో రాగానే, పాత సమస్య మరిచిపోయి కొత్త సమస్య మీద గగ్గోలు పెట్టడం… జనజీవితం ఇలా సమస్యల, ప్రమాదాల, మతిమరుపుల పరంపరగా నిరాటంకంగా సాగిపోతున్నది.

నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రవాణా రంగం మీద దాదాపు గుత్తాధిపత్యం నెరపుతున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లది మొదటి నుంచి చివరి దాకా మోసాలమయమైన వ్యాపారం. అటువంటి అక్రమ వ్యాపారంలో ప్రమాదం అనేది యాదృచ్ఛికం కాదు, అది ఒక పథక రచన ప్రకారం జరిగిన అనేక పరిణామాల పర్యవసానం. ఆ అక్రమ వ్యాపారాన్ని ప్రభుత్వ నియంత్రణా సంస్థలన్నీ సజావుగా సాగిపోనిస్తున్నాయి. ఆ నియంత్రణా సంస్థల విధాన నిర్ణయాలు చేసే రాజకీయ నాయకత్వంలో స్వయంగా ఆ ప్రైవేటు బస్సుల యజమానులే ఉన్నారు. లేదా ఆ యజమానుల సన్నిహిత మిత్రులు, లేదా ఆ యజమానుల ముడుపులు అందుకునే వారు ఉన్నారు.

కనుక చిన్న టేకూరు ప్రమాదం రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న బైక్ వల్ల జరిగిందా, ఆ బైకర్ తాగి రోడ్డు మీద పడిపోవడం వల్ల జరిగిందా, బస్సు డ్రైవర్ తగిన విద్యార్హత లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మితిమీరిన వేగంతో నడిపినందువల్ల జరిగిందా వంటి చర్చలు ఎన్ని చేసినా, సమస్య మూలాల్లోకి వెళ్లలేం. సమస్యను మూలాల నుంచి అర్థం చేసుకోకపోతే ఎప్పటికీ దానికి పరిష్కారం దొరకదు. మొట్టమొదట, దేశంలో రవాణా సేవలన్నిటినీ నిర్దేశించే మోటార్ వెహికిల్స్ ఆక్ట్, 1988 (2019 సవరణలతో సహా) ప్రకారం ఈ ప్రైవేటు బస్సులు రోడ్డు మీద తిరగడానికే వీలు లేదు.

“ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రోజుల నుంచీ, ప్రస్తుతం రెండు రాష్ట్రాలలోనూ రోజూ తిరిగే వందలాది ప్రైవేటు బస్సులకు స్టేజి క్యారేజీ పర్మిట్లు లేవు. కాంట్రాక్ట్ క్యారేజీ పర్మిట్ గాని, టూరిస్ట్ పర్మిట్ గాని తీసుకుని, స్టేజి క్యారేజీల లాగా నడుపుతున్నారు. అది ప్రాథమికమైన చట్టవ్యతిరేక చర్య. కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్ కింద వ్యక్తిగత టికెట్లు అమ్మడానికి వీలు లేదు. ప్రతిరోజూ ఒకే సమయంలో ఒక చోటి నుంచి మరొక చోటికి నడపడానికి వీలు లేదు. దారిలో ఎక్కడ పడితే అక్కడ ప్రయాణికులను దించడానికి, ఎక్కించుకోవడానికి వీలు లేదు. ఈ మూడు చట్టవ్యతిరేకమైన పనులూ ప్రైవేటు బస్సులు ప్రతి రోజూ విచ్చలవిడిగా చేస్తున్నాయి.”

ఆ చట్టం ప్రకారం మూడు ప్రధానమైన పర్మిట్లు మాత్రమే ఉంటాయి: ఒకటి, స్టేజి క్యారేజీ పర్మిట్ – ఒక నిర్దిష్టమైన మార్గంలో అనేక చోట్ల ప్రయాణికులను ఎక్కించుకునే, దించే అవకాశం ఇస్తుంది. దీని మీద గట్టి ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. రెండు రాష్ట్రాలలో ప్రభుత్వ ఆర్టీసీ సర్వీసులు ఈ పర్మిట్ కింద నడుస్తున్నాయి. ఈ పర్మిట్ సాధారణంగా ప్రభుత్వ రంగ సర్వీసులకు తప్ప మరొక రవాణా సంస్థకు ఇవ్వరు. రెండు, కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్ – ఒక నిర్దిష్ట బృందపు ప్రయాణీకులను ఒక నిర్దిష్టమైన చోటి నుంచి మరొక నిర్దిష్టమైన చోటికి తీసుకుపోయే, మధ్య దారిలో ఎవరినీ ఎక్కించుకోకుండా, దించకుండా ఉండే పర్మిట్. ఇది ఉద్యోగులను,  కార్మికులను, విద్యార్థులను తీసుకుపోయే బస్సులకు వర్తిస్తుంది. ఈ పర్మిట్ కింద నడిపేవాళ్లు ఆ వర్గాలకు చెందనివారికి, సామూహికంగా గాని, వ్యక్తిగతంగా టికెట్లు ఇవ్వగూడదు. మూడు, అఖిల భారత యాత్రా (టూరిస్ట్) పర్మిట్ – ఇది కేవలం యాత్రల కోసం, వేర్వేరు రాష్ట్రాలలో తిరిగే బస్సుల కోసం ఇచ్చేది. ఇది కేవలం పర్యాటక రంగ అవసరాల కోసం మాత్రమే నడవాలి. ఆ బస్సులలో పుష్ బ్యాక్ సీట్లు, ఏర్ కండిషనింగ్, టూరిస్ట్ లోగోలు వగైరా ఉండాలి.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రోజుల నుంచీ, ప్రస్తుతం రెండు రాష్ట్రాలలోనూ రోజూ తిరిగే వందలాది ప్రైవేటు బస్సులకు స్టేజి క్యారేజీ పర్మిట్లు లేవు. కాంట్రాక్ట్ క్యారేజీ పర్మిట్ గాని, టూరిస్ట్ పర్మిట్ గాని తీసుకుని, స్టేజి క్యారేజీల లాగా నడుపుతున్నారు. అది ప్రాథమికమైన చట్టవ్యతిరేక చర్య. కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్ కింద వ్యక్తిగత టికెట్లు అమ్మడానికి వీలు లేదు. ప్రతిరోజూ ఒకే సమయంలో ఒక చోటి నుంచి మరొక చోటికి నడపడానికి వీలు లేదు. దారిలో ఎక్కడ పడితే అక్కడ ప్రయాణికులను దించడానికి, ఎక్కించుకోవడానికి వీలు లేదు. ఈ మూడు చట్టవ్యతిరేకమైన పనులూ ప్రైవేటు బస్సులు ప్రతి రోజూ విచ్చలవిడిగా చేస్తున్నాయి.

ఇంత భారీ చట్ట వ్యతిరేకత కార్యకలాపాన్ని ప్రభుత్వం చూసీ చూడనట్టు పోతున్నది. ప్రభుత్వ రవాణా సంస్థలు ప్రజల అవసరాలను తీర్చడానికి సరిపోవడం లేదని, ఆ ఖాళీని ప్రైవేటు రవాణా సంస్థలు పూరిస్తున్నాయని, వాటి వల్ల ఇంధన పన్ను, సేవల పన్ను, బుకింగ్ కమిషన్లు, ఉద్యోగ కల్పన వంటి పరోక్ష లాభాలు కలుగుతున్నాయని, కనుక ఈ వ్యవస్థను కదల్చలేమని అధికారవర్గాలు సాకులు చెపుతుంటాయి. ఇవన్నీ కచ్చితంగా సాకులే. అధికారంలో ఉన్న ప్రభుత్వాలే ఉద్దేశపూర్వకంగా ఆర్టీసీని చంపేసి, బలహీన పరిచి, ఇప్పుడు దానికి సామర్థ్యం లేదు గనుక, ఆ ఖాళీని పూరించడానికి ప్రైవేటు ఆపరేటర్లు వస్తున్నారని అంటున్నారు. ఈ సాకుల కన్నా ముఖ్యంగా ఆలోచించవలసినది ప్రైవేటు బస్సు రవాణా సంస్థలు మాఫియాలా మారిపోయి, ప్రభుత్వ రవాణాకు సవాల్ గా మారిపోయి, కోట్లకు పడగెత్తి, ఆ యజమానులే స్వయంగా రాజకీయాల్లోకి వచ్చి, లేదా రాజకీయ నాయకులను ప్రభావితం చేసి, తమ మీద ఏ చర్యా జరగకుండా చూసుకుంటున్నారు.

ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాన్ని అడ్డుకోవలసిన, అడ్డుకునే అధికారం ఉన్న ప్రభుత్వ యంత్రాంగం – ఆర్ టి ఎ అధికారులు, పోలీసు అధికారులు, వగైరా, ప్రైవేటు బస్సు యాజమానుల దగ్గర లంచాలు తీసుకుని ఆ అక్రమాలను వదిలేస్తున్నారని చాలమందికి తెలుసు. అది ఆ అధికారుల తప్పు అనేది నిజమే గాని, మొత్తం తప్పును అధికారుల మీదికి నెట్టే అవకాశం కూడా లేదు. అధికారుల పాత్ర ఉన్నమాట నిజమే గాని, రాజకీయ నిర్ణయాధికారమే రవాణా మాఫియా అక్రమాలను కొనసాగనిస్తున్నదనేది అక్షర సత్యం.

“ఈ అక్రమాలను మించిన మరొక అక్రమం, ఒక రిజిస్ట్రేషన్ మీద రెండు మూడు బస్సులు నడపడం. ఒక మజిలీలో అటు నుంచి వచ్చే బస్సు, ఇటునుంచి పోయే బస్సు ఒకే నంబర్ తో ఉండడం చూసినవారు కొంతకాలం కింద దాన్ని వివాదం చేశారు గాని, ఏ చర్యలూ జరగలేదు. అటువంటి అక్రమాన్ని పట్టుకునే వ్యవస్థలూ లేవు. పట్టుకున్నా క్షణాల్లో విడిపించుకోవడం రవాణా మాఫియాకు చిటికెలో పని.”

అప్పుడప్పుడు అధికారులు మాటవరుసకు ప్రైవేటు బస్సుల మీద నిఘా పెడుతుంటారు, అడ్డుకుని చలాన్ చేస్తుంటారు. సాధారణంగా కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్ తీసుకుని స్టేజి క్యారేజీగా నడుపుతున్నారని, రూట్ పర్మిట్ లేకుండా ఆ రూట్ లో నడుపుతున్నారని, పన్నులు చెల్లించలేదని, రిజిస్ట్రేషన్ అక్రమం అని చలాన్ చేస్తారు. బస్సును జప్తు చేశారు అని కూడా వార్త వస్తుంది. కాని మర్నాటికల్లా పది నుంచి ఇరవై ఐదు వేల రూపాయల జరిమానాతో ఆ అక్రమం మాఫీ అయిపోతుంది. లేదా రాజకీయ నాయకుల జోక్యంతో మాఫీ అయిపోతుంది. ఈ మౌలికమైన అక్రమం, చట్టవ్యతిరేకతతో పాటు, ప్రైవేటు రవాణా మాఫియా పాల్పడుతున్న ఇతర అక్రమాలు ఎన్నో ఉన్నాయి.

మీరు ఈ ప్రైవేటు బస్సుల నంబర్ ప్లేట్లను ఎప్పుడైనా చూశారా? పది బస్సుల్లో కనీసం ఆరు బస్సులకు నంబర్ ప్లేట్ ఎఆర్ అనో, ఎన్ఎల్ అనో, ఎస్ కె అనో ఉంటుంది. అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం. తెలుగు రాష్ట్రాల్లో తిరిగే బస్సులు ఆ ఈశాన్య రాష్ట్రాల నంబర్ ప్లేట్లతో ఉండడమేమిటి? ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక వంటి సంపన్న రాష్ట్రాలన్నిట్లో ఇదే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో లగ్జరీ బస్సుల లైఫ్ టైమ్ రోడ్ టాక్స్ 12-18 శాతంగా ఉండగా, నాగాలాండ్, అరుణాచల ప్రదేశ్, సిక్కిం లలో 2-4 శాతం మాత్రమే ఉంది. అందువల్ల ఒక కోటి రూపాయలు ఖరీదు చేసే లగ్జరీ బస్సును ఇక్కడ రిజిస్టర్ చేయించే కన్నా ఈశాన్య రాష్ట్రాల్లో చేయిస్తే పది పదిహేను లక్షల రూపాయలు మిగులుతాయి. ఒక్కొక్క రవాణా ఆపరేటర్ కు డజన్ల కొద్దీ బస్సులున్నాయి గనుక వాళ్లు ఆదా చేసేది కోట్లల్లో ఉంటుంది. ఆ బస్సులను ఇక్కడే రిజిస్టర్ చేసి, ఇక్కడే లైఫ్ టాక్స్ కట్టి ఉంటే, ఈ రాష్ట్రాల ఖజానాలకు కోట్లాది రూపాయలు వచ్చి ఉండేది. అలా ఈ రాష్ట్ర ఖజానాకు రావలసిన కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతున్నదనేది మరొక కీలకాంశం.

రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఎప్పుడైనా వాహనాన్ని భౌతికంగా తీసుకుపోవలసి ఉంటుంది. కాని ఈశాన్య రాష్ట్రాల రోడ్డు రవాణా అధికారుల అవినీతి వల్ల, బస్సులు ఆ ఈశాన్య రాష్టాలకు వెళ్లకుండానే, కేవలం బ్రోకర్ల ద్వారా కాగితాలు పంపి, స్థానిక దొంగ అడ్రస్ లు పెట్టి రిజిస్టర్ చేయించడం జరుగుతున్నది. ఈ దొంగపనులన్నీ చేయడానికి పెద్ద ఎత్తున బ్రోకర్ వ్యవస్థ తయారై ఉంది. రోడ్డు రవాణా, పోలీసు, ఇన్సూరెన్స్ అధికారుల అవినీతి సహాయంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ బస్సులన్నీ కూడా స్థానిక పన్నులు ఎగ్గొట్టడానికి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వాహనాలుగా రిజిస్టర్ అవుతాయి. కాని వాటిలో ఏ ఒక్కటీ ఎన్నడూ టూరిస్ట్ అవసరాల కోసం తిరగవు.

ఇక్కడ ఇంకొక అక్రమం ఉంది. ఇలా ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన ఆల్ ఇండియా పర్మిట్ బస్సు మరొక రాష్ట్రంలో 12 నెలల కన్నా ఎక్కువ తిరగడానికి వీలు లేదు. కాని యజమానులు, ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు గనుక ఏడాది దాటాక కూడా ఆ బస్సులు అధికారుల అండతో, యజమానుల అధికార దర్పంతో ఇక్కడే తిరుగుతుంటాయి. ఈ అక్రమాలను మించిన మరొక అక్రమం, ఒక రిజిస్ట్రేషన్ మీద రెండు మూడు బస్సులు నడపడం. ఒక మజిలీలో అటు నుంచి వచ్చే బస్సు, ఇటునుంచి పోయే బస్సు ఒకే నంబర్ తో ఉండడం చూసినవారు కొంతకాలం కింద దాన్ని వివాదం చేశారు గాని, ఏ చర్యలూ జరగలేదు. అటువంటి అక్రమాన్ని పట్టుకునే వ్యవస్థలూ లేవు. పట్టుకున్నా క్షణాల్లో విడిపించుకోవడం రవాణా మాఫియాకు చిటికెలో పని.

ఇంత ప్రాథమికమైన, మౌలికమైన అక్రమాల మీద ఈ వ్యవస్థ నిర్మాణమై ఉన్నప్పుడు, వేగంగా నడుపుతున్నారనో, రోడ్డు మీద బైక్ పడి ఉండగా చూడలేదనో, డ్రైవర్ పదో తరగతి చదువుకోలేదనో చర్చ జరగడం తలకాయలు పోతుంటే చెవుల పోగుల కోసం ఏడ్చినట్టు ఉంటుంది. ఈ అక్రమాలకు తోడు, రోజూ చచ్చేవాడికి ఏడ్చేవారెవరు అనే తత్వం, ఎవరికైనా చావును భగవంతుడో, వారి కర్మో రాసి పెట్టి ఉంటుందని, కనుక చావుకు ఎవరినీ బాధ్యులను చేయనక్కరలేదని, బాధ్యులను శిక్షించనక్కరలేదని సిద్ధాంతపు మకిలి మన మనసుల్లో నిండి ఉన్నప్పుడు, ఆ మకిలిని తొలగించడానికి చిన్న టేకూరు హతుల వంటి ఎందరు హత్యలకు గురికావాలి?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page