ముదురుతున్న రాష్ట్ర‌ రాజకీయాలు

  • కేంద్రంతో వియ్యం, రాష్ట్ర నాయకత్వంతో కయ్యంగా కాంగ్రెస్ తీరు
  • కిషన్‌రెడ్డి గండపెండేరం తొడుక్కునేనా ?

(మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి)
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతున్నది. విపక్ష పార్టీలైన బిఆర్‌ఎస్‌, బిజెపిలపై అధికార కాంగ్రెస్‌ ఏకధాటిగా విరుచుకుపడుతుండ‌గా, తామేమీ తీసిపోమన్నట్లు ఆ పార్టీలు కాంగ్రెస్‌ ఏడాది పాలనపై ధ్వ‌జమెత్తుతున్నాయి. కాంగ్రెస్‌కు అసలు పాలన చాతకావడంలేదంటూ ఆ పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఏ పని ఎలా చేయాలో తెలియని స్థితిలో ఇతర పార్టీలపై బురద చల్లి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నదంటూ బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఉండడం తెలంగాణ ప్రజల దురదృష్టంగా బిజెపి విమర్శిస్తోంది. ప్రాజెక్టుల రూపకల్పన చేసేప్పుడు ఎలాంటి ఆర్థిక ప్రణాళిక చేస్తారన్న కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

తెలంగాణ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక సహాయాన్ని అర్థించేందుకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. అయితే పెద్దన్నగా తన విజ్ఞాపనపై వెంటనే మోదీ స్పందిస్తాడనుకున్న రేవంత్‌రెడ్డికి అనుకోని పరిణామం ఎదురైంది. కేంద్రానికి సంబంధించి రాష్ట్రంలో పెండింగ్‌లోఉన్న ప్రాజెక్టుల జాబితాను ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేస్తూ వాటిపై దృష్టిపెట్టాలని సూచించారు. రాష్ట్రం రూపొందించిన ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం కోసం వెళితే, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయాలని మోదీ సూచించడం రేవంత్‌రెడ్దికి అసహనాన్ని కలిగించినట్లుంది. అనంతరం ఆయన దిల్లీలో మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌లపైన విరుచుకుపడ్డారు. దానికి బిజెపి వర్గాలు ఘాటుగానే స్పందించడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని టార్గెట్‌ చేశారు.

రేవంత్‌రెడ్డి. రాష్ట్రాభివృద్ధి కోసం తాను ప్రధాని మోదీకి అందించిన ఐదు అంశాలకు సంబంధించిన అనుమతులు, నిధులను కిషన్‌రెడ్డి తీసుకురాగలితే ఆయనకోసం బ్రహ్మాండమైన సభను ఏర్పాటుచేసి, గండపెండేరం తొడుగుతానంటూ రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేంద్ర మంత్రులుగా రాష్ట్రానికి నిధులు తీసుకురావడం వారి బాధ్యతగా ఆయన చెప్పుకొచ్చారు. ఆ మాటలతో ఎద్దేవా చేస్తున్నట్లా లేక కిషన్‌రెడ్డి సామర్ధ్యానికి పరీక్షా అన్న చర్చ జరుగుతోంది. ఒక పక్క గండపెండేరంతో సన్మానిస్తానంటూనే మరోపక్క రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నాడంటూ మరో సంచలనాత్మక ఆరోపణ చేశారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టును అడ్డుకున్నాడని, ఈ విషయంలో ఎన్ని విజ్ఞాపనలు చేసినా పట్టించుకోకపోవడాన్ని ఆయన ఎత్తిచూపుతూ, ఇదే కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు చెన్నై, బెంగుళూరు మెట్రో విస్తరణకు ఆమోదం లభించిన విషయాన్ని గుర్తుచేశారు. సబర్మతి, గంగ పునరుజ్జీవనంపై అనేకసార్లు ప్రకటనలు చేసిన కిషన్‌రెడ్డి సొంత రాష్ట్రంలోని మూసీ పునరుర్జీవాన్ని పట్టించుకోవడంలేదంటూ విమర్షనాస్త్రాలను సంధించారు. అంతేకాదు, కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి రాష్ట్రానికి సాధించిందేమిటో చెప్పాలంటూ నిలదీస్తున్నారు.

దీనిపై కిషన్‌రెడ్డి కూడా అంతే దీటుగా  ప్రతిస్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఉండడం తెలంగాణ ప్రజల దురదృష్టమని, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను కేంద్రంపై నెట్టివేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నాడంటూ ఎదురు దాడి చేశారు. ఏ ఒక్క ప్రాజెక్టు విషయంలోనైనా తాను అడ్డుపడినట్లు రుజువు చేయాలంటూ రేవంత్‌రెడ్డికి ఆయన సవాల్‌ విసిరారు. ఎన్నికలకు ముందు ఏవిధంగానైనా గెల‌వాలని అడ్డగోలు వాగ్దానాలు చేసి, వాటిని నిలబెట్టుకోలేక వేరొకరిపై బురదచల్లే యత్నాన్ని మానుకోవాలన్నారు కిషన్‌రెడ్డి. ఎన్నికల హామీలిచ్చేప్పుడు తామిచ్చే హామీలకు కేంద్రం నిధులు సమకూరుస్తుందని ప్రజలకేమైనా చెప్పారా? ఆ నిధులు వొస్తేనే అభివృద్ధి చేస్తామన్నారా? వాస్తవంగా ప్రాజెక్టుల రూపకల్పన చేసేప్పుడు కేంద్రం నుంచి ఏమైనా అనుమతి తీసుకున్నారా ? ఇవేవీ చేయకుండానే విజ్ఞాపన పత్రాలివ్వగానే నిధులు వాటంతటవే ఎలా సమకూరుతాయన్నది కిషన్‌రెడ్డి ప్రశ్న. కాంగ్రెస్‌ ప్రకటించిన ప్రాజెక్టులకు రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలంటారాయన.

మెట్రో విషయంలో తనపై రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణపై స్పందిస్తూ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి కూడా లేదంటూ, కనీసం కార్యాచరణ ప్రణాళిక కూడా లేదు. ఆ ప్రాజెక్టుకు సంబందించిన అంశాలను తాజాగా కేంద్రానికి పంపించిన విషయాన్ని గుర్తుచేస్తూ, అ ప్రతిపాద‌న అన్ని మంత్రిత్వశాఖలకు పంపాక, ప్రధాని కార్యాలయం సమీక్షిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానముంటుందన్న కనీస అవగాహన లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటూ ఆయన తప్పుబ‌ట్టారు. ఏదిఏమైన గతంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలాగానే నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వంకూడా కేంద్రంతో వియ్యం, ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో కయ్యానికి సిద్దపడ్డట్లు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి గండపెండేరం తొడుక్కుంటారో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page