కాకతీయ కలగూర గంప – 19
తెలంగాణ పాత ముచ్చట్లు
1971లో దేవానంద్ హీరో గా తీసిన ‘సిటడెల్ ‘
నవల ఆధారిత హిందీ సినిమా ‘‘తేరే మేరే సప్నే
వైద్య వృత్తి ఉదాత్తతను తెలిపే
అపురూప నవల ‘సిటడెల్ ‘(1037)
వైద్యుడిగా,రాజకీయ నాయకుడిగా నిజామాబాద్ ప్రజలకు
అత్యుత్తమ సేవలందించిన డాక్టర్ వి చక్రధర రావు
‘‘తన నియమిత ప్రదేశంలో ఉంటూనే, ప్రపంచమంతటా, విశ్వమయంగా సంచరిస్తూ తన ఉనికి అనే బిందువులోనే సర్వమునూ సమాహరించుకొనగలిగే వ్యక్తి పాములపర్తి సదాశివరావు’’ అని వివరిస్తారు ఒక సందర్భంలో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు. ఇంకా ‘‘ వరంగల్లు నగరం ఒక అర్థ శతాబ్దం కన్న కల పేరు పాములపర్తి సదాశివ రావు’’ అని పపేర్కొంటారు. ఈ రెండు వాక్యాలు ఆయన రాసిన ‘వరంగల్లు కన్న కల ‘ అన్న శీర్షికతో రాసిన వ్యాసం లోనివి. ఇక్కడ నియమిత ప్రదేశం అంటే వరంగల్లు – ఇంకా ఖచ్ఛితంగా చెప్పాలంటే ఆయన ఇంటిలోని బంగ్లా రూం లేదా మేడ గది. తన జీవితంలో ముప్పావు భాగం ఆ గదిని వీడని సదాశివ రావు గారికి విశ్వ వీక్షణం ఎలా కలిగిందన్నది ఆశ్చర్యార్థకమే! కంప్యూటర్లూ, ఇంటర్నెట్లూ, టీ వీ లూ, రేడియోలూ, కనీసం ల్యాండు ఫోన్ – ఇంతెందుకు తనకు 55 ఏండ్లు వచ్చే దాకా ఇంటికి విద్యుత్తు కనెక్షన్ కూడాలేని ఆ రోజుల్లో ప్రపంచపు మూలెక్కడో జరిగిన సాహిత్య, సారస్వత, రాజకీయ ముఖ్య విశేషం తెలియని వాతావరణంలో ఆయన ఆ విషయాల పూర్తి సమాచారాన్ని తెలుసుకొనడమే కాకుండా ఆ వివిధ విషయాలపై వివరణాత్మక విశ్లేషణలు ఎట్లా చేసారో అన్నది ఆయన మేధా సంపత్తికే వదిలేద్దాం.
ఈ సందర్భంగా నాకు తెలిసిన అటువంటి విషయం మీకు తెలుపుతాను.. నాకు బాగా జ్ఞాపకం .. 1970 లో అనుకుంతటా.. అప్పటి ‘‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ మెడికల్ డాక్టర్ల అసోసియేషన్’’ వారు ఒక ప్రత్యేక సంచికను తీసుకు రాదలచి దాని అధ్యక్షుడు డాక్టర్ వి చక్రధర్ రావు గారు పాములపర్తి సదాశివ రావు గారిని సంప్రదించడానికి వరంగల్ కు వచ్చారు. వారు నిజామాబాదు వాస్తవ్యులు. ఈ సంచికకు సంబంధించి వారు సేకరించిన వివిధ డాక్టర్లు రాసిన వ్యాసాలను (భాషా పరంగా) సరిదిద్దడానికి సదాశివరావుకు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో వీరిని కూడా ఒక సందేశాత్మక వ్యాసం రాయమని కోరడం జరిగింది. అప్పుడు వారి కోరిక మేరకు ఆయన రాసిన వ్యాసం ‘సిటడెల్ ’ అన్న నవల గురించి చక్కటి విశ్లేషణాత్మక అక్షర పరిచయ సందేశం. సందేశం అని ఎందుకు అంటున్నానంటే ఆ వ్యాసం అచ్చువేసింది వైద్య వృత్తికి చెందిన వారికి సంబంధించిన సంచికలో. ఈ నవల ఇతివృత్తం కూడా ‘‘త్యాగమూర్తి ఐన ఒక డాక్టరు గురించి మరియు మెడికల్ వృత్తిలో ఉండవలసిన మానవాత్మక విలువల ఎథిక్స్ గురించి’’. 1937 లో ఎ జె క్రోనిన్ రాసిన ‘సిటడెల్ ’ అనే నవల వైద్య వృత్తి కి సంబంధించిన ఇతివృత్తం కలిగి వుంటుంది. మానవత్వం మూర్తీభవించిన ఒక వైద్యుడి గురించి, అప్పటి వైద్య వృత్తిలోని ఉచితానుచిత పద్ధతుల గురించీ, వైద్యుడిగా ఆ కథానాయకుడి మనో సంఘర్షణ గురించీ తెలిపిన ఒక గొప్ప పుస్తకం.
ఆ నవలపై శ్రీ సదాశివరావు రాసిన వ్యాసం డాక్టర్ల సంబంధింత సంచికకు ఎంతో సందర్భోచితంగా ఉండటం గమనార్హం… ఆ టైంలో ఆయన ఆ పుస్తకం ఎట్లా సంబంధించి దాన్ని కూలంకషంగా చదివి ఆ రచనను విశ్లేషించాడో అది ఒక అద్భుతమే! ‘సిటడెల్’ పుస్తకానికి 1937 లో నేషనల్ బుక్ అవార్ద్ వచ్చింది. ఏ జే క్రోనిన్ (1897 -1981) ఒక గొప్ప ఆంగ్ల రచయిత. 1930 ప్రాంతాల్లో ఆయన ఒక పేరుగాంచిన రచయిత గా గుర్తిం పబడ్డారు. ఆయన 1937 లో రాసిన సిటడెల్ నవలలోని వైద్య వృత్తి కథనం ఎంత గొప్పదంటే, ఇంగ్లాండ్ లో 1945 లో జరిగిన ఎన్నికల్లో అది ప్రజల మీద తగినంత ప్రభావం చూపిందనీ, కాబట్టే ఆ ఎన్నికల్లో గెలిచిన లేబర్ పార్టీ 1948 లో నేషనల్ హెల్త్ సర్వీస్ నెలకొల్పిందనీ ఒక గట్టి నమ్మకం. ఇక సిటడెల్ కథ (60 ఏండ్ల పైబడ్డ) మనలో చాలా మందికి తెలుసు. ఎందుకంటే అది ప్రముఖ హిందీ నటుడు దేవానంద్ వైద్యుడిగా నటించిన ‘తేరే మేరే సప్నే ’’ అనే చలనచిత్రంగా 1971 లో వచ్చింది. ఆ చిత్ర కథానాయకుడితో మనం మూడు గంటలు గడిపాం. ఆతని భావో ద్వేగాలను పంచు కున్నాం. అతడి ప్రేమ వృత్తాంతం చూసాం. ఆ ప్రేయసీ ప్రియుల పాటలను విన్నాం.
అతన్ని విడిచి వచ్చే ప్పుడు భారమెక్కిన హృద యంతో సీరియస్ ముఖా లతో వీడ్కోలు పలికాం. ఆ చిత్రం కథ పూర్తిగా సిటడెల్ నవలకు కాపీ. అందులో కథానాయకుడే కాకుండా మరొక గొప్ప డాక్టర్ పాత్ర వుంటుంది. దాన్ని విజయానంద్ పోషించాడు. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న పాత్ర అది. ఇక ఈ వ్యాస నాయకుడు డాక్టర్ చక్రధరరావు గురించి… 1950 లో హోమియోపతీ డిగ్రీ పాసైన చక్రధరరావు నిజామాబాద్ లో ఒక హోమియో క్లినిక్ ను ప్రారంభించి పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తూ అనతి కాలంలోనే ప్రజారంజక వైద్యుడిగా పేరుగాంచారు. ఆయన సతీమణి కమలాదేవి గారు కూడా అనేక పేద కుటుంబాలకు ఆశ్రితులయ్యారు. నిజామాబాదు లో న్యాయ కళాశాలను ప్రారంభించడంలో వీరిదే ముఖ్యపాత్ర. ఆంధ్ర ప్రదేశ్ రాష్త్ర ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ల అసోషియేషన్ కు 1978 వరకు 20 సంవత్సరాలకు పైగా అధ్యక్షుడిగా ఉన్నారు. 1967 నుండి 1972 దాకా నిజామాబాద్ మునిసిపల్ చైర్మన్ గా, 1972 నుండి 1978 దాకా నిజామాబాద్ ఎమ్మెల్యే గా ప్రజా సేవలందించారు. డాక్టర్ గా, రాజకీయ నాయకుడిగా నిజామాబాదు ప్రజల మన్నన పొందిన చక్రధర రావు గారు ధన్య జీవి.
` శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి,
` పాములపర్తి నిరంజన్ రావు
` శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి,
` పాములపర్తి నిరంజన్ రావు