అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అందిబుచ్చుకుని ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి,అధికారం చేపట్టిన కేజ్రీవాల్ అవినీతి బురదలో కూరుకు పోవడాన్ని దిల్లీ ప్రజలు జీర్ణించుకోలేక ఆప్ ను తిరస్కరించారా? కేంద్రంతో చీటికీ మాటికి గొడవలు పెట్టుకుంటూ దిల్లీలో పరిపాలన సరిగా చేయలేక పోతున్నారన్న కినుకతో ఆప్ ను ప్రజలు దూరం పెట్టారా? నేషనల్ క్యాపిటల్ టెరిటరీ లో ఏర్పడే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా లేకపోవడం మంచిది కాదనే అభిప్రాయంతో డబుల్ ఇంజన్ సర్కార్ కు పట్టం కట్టారా? అనే మీమాంస రాజకీయ విశ్లేషకుల్లో ఏర్పడింది.
“ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే…” అనే నాటి సినారె గీతంలో తొణికిస లాడిన ఆనందం దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత భాజపా అగ్రనేతల్లో ఉప్పొంగిన ఉద్వేగభరితమైన ఆనందాశ్రువులకు అద్దం పడుతున్నది.27 సంవత్సరాల భాజపా సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. 2015 లో 3 సీట్లు,2020 లో 8 సీట్లు సాధించి, కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమైన భాజపా నేడు అప్రతిహతమైన విజయంతో దిల్లీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నది. దిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించబోతున్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 6.6 శాతం వోట్లతో కనీసం ఖాతా కూడా తెరవకుండా, ఘోర వైఫల్యం చెందడం, ఇండియా కూటమి అనైక్యతకు పరాకాష్ఠ. ఆమ్ ఆద్మీ పార్టీ వలన పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ దెబ్బతిన్న మాట సత్యదూరం కాదు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ వోట్లు చీల్చడంలో ఆప్ ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు ఆప్ స్వీయ తప్పిదాలతో కాంగ్రెస్ ను, ఇండియా కూటమిని కాదనుకుని, దిల్లీ పీఠాన్ని భాజపాకు ధారాదత్తం చేసింది. కేజ్రీవాల్ ఏకపక్ష ధోరణి ప్రతిపక్షాల ఐక్యతా రాగంలో అపశృతులను పలికించింది.
రాజకీయమనే పరమపద సోపాన పటంలో విజేతలెవరో, పరాజితులెవరో తేల్చేది వోటర్లే అయినా రాజకీయ వ్యూహాలు, అవకాశవాదం, తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరితనం, ప్రజలను తికమక పెట్టే ప్రచారం, సాంఘిక మాధ్యమాల ప్రభావం వర్తమాన రాజకీయాలను శాసిస్తున్నది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇందుకు విరుద్ధంగా లేవన్న నిజం గ్రహించాలి. మెజారిటీ సర్వేలు భాజపాకు అనుకూలంగానే ఫలితాలొస్తాయని ప్రకటించాయి. పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా ఈ పర్యాయం దిల్లీ పీఠం భాజపాకే దక్కుతుందని స్పష్టం చేయడం జరిగింది. ఊహించిన విధంగానే సుదీర్ఘ విరామం తర్వాత దిల్లీలో భాజపా విజయకేతనం ఎగరేసింది. దిల్లీ రాజకీయ ముఖచిత్రంలో కాషాయ వర్ణం దేదీప్యమానంగా వెలుగొందింది.పోస్టల్ బ్యాలెట్ లో కూడా బి.జె.పి ఆధిక్యత ప్రదర్శించడం ఉద్యోగస్తుల్లో ఆప్ పట్ల పెరిగిన వ్యతిరేకతకు నిదర్శనం.70 స్థానాలు గల దిల్లీ శాసనసభలో 2015 లో 67 సీట్లతో, 2020 లో 62 సీట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి,అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ,ప్రత్యక్షంగా మోదీ తో తలపడుతూ, రాజకీయ యుద్ధంలో పోరాడారు. లిక్కర్ కుంభకోణంలో అరెస్టయి,తీహార్ జైలు కెళ్ళిన కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన సాగించి చరిత్ర సృష్టించారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన అతిషి కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించారు.ఎన్నికల్లో విజయం సాధించి,తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలన్న కేజ్రీవాల్ ఆశలు అడియాసలైనాయి. మోదీ ,కేజ్రీవాల్ మధ్య జరిగిన ఎన్నికల యుద్ధంలో కేజ్రీవాల్ ను ఓడి గెలిచిన రాజకీయ యోధుడిగానే పరిగణించాలి. అయినా ఈ వైఫల్యంలో కేజ్రీవాల్ కు సింహభాగముందనే చెప్పాలి.కేవలం 100 కోట్ల అవినీతి పెద్ద విషయం కాదని ప్రజలు అనుకోలేదు. పూర్వాశ్రమంలో కేజ్రీవాల్ గురువు అన్నాహజారే దిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, కేజ్రీవాల్ అవినీతే ఆప్ పరాజయానికి కారణమని వ్యాఖ్యానించడం విశేషం. 2013 వ సంవత్సరంలో కేవలం 28 సీట్లు గెలుపొంది, కాంగ్రెస్ మద్దతుతో దిల్లీ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ తో విబేధించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 2015, 2020 సంవత్సరాల్లో ఆప్ ఘనవిజయంతో దిల్లీ ముఖ్య మంత్రిగా మరలా బాధ్యతలు చేపట్టి, దేశం లోని పలు రాష్ట్రాల్లో ఆప్ ను విస్తరించడానికి కృషిచేసారు. ప్రధాని మోదీ తో రాజకీయంగా తలపడి ప్రస్తుత ఎన్నికల్లో ఆప్ ను అపజయ తీరానికి చేర్చారు.
ఏ ఎండకాగొడుగు, బలవంతుడి అడుగులకు మడుగులు వర్తమాన రాజకీయాల్లో రాణించగలరు. కేవలం పోరాటాల వలనే అధికారం చేపట్టలేరు. రాజకీయ మనుగడ సాగించాలంటే బలమైన శతృవుతో విబేధించడం మంచిది కాదన్న సత్యాన్ని ప్రస్తుత దిల్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కేజ్రీవాల్ రాజకీయ జీవితంలో ఉత్థాన పతనాలు భాజపాయేతర శతృపక్షాలకు ఒక గుణపాఠం. శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాల్లో తీవ్రమైన మేథోమధనం జరగాలి. ఈ ఎన్నికల్లో సానుభూతితో గెలిచి,నాలుగో సారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ఆప్ ఆశలు ఫలించలేదు. భాజపా 48 శాతం వోట్లతో, ఆప్ 43 శాతం వోట్లతో హోరాహోరీగా తలపడ్డాయి. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అందిబుచ్చుకుని ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి,అధికారం చేపట్టిన కేజ్రీవాల్ అవినీతి బురదలో కూరుకు పోవడాన్ని దిల్లీ ప్రజలు జీర్ణించుకోలేక ఆప్ ను తిరస్కరించారా? కేంద్రంతో చీటికీ మాటికి గొడవలు పెట్టుకుంటూ దిల్లీలో పరిపాలన సరిగా చేయలేక పోతున్నారన్న కినుకతో ఆప్ ను ప్రజలు దూరం పెట్టారా? నేషనల్ క్యాపిటల్ టెరిటరీ లో ఏర్పడే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా లేకపోవడం మంచిది కాదనే అభిప్రాయంతో డబుల్ ఇంజన్ సర్కార్ కు పట్టం కట్టారా? అనే మీమాంస రాజకీయ విశ్లేషకుల్లో ఏర్పడింది.
ఆప్ అమలు చేసిన ఉచిత పథకాలకు ధీటుగా బీజేపీ కూడా ఎడాపెడా దిల్లీ ప్రజలకు వాగ్దానాలు చేసింది. కాషాయ పార్టీ కలల సాకారం లో ఫ్రీ బీస్ కూడా ప్రధాన పాత్ర వహించి ఉండవొచ్చు. శాంతి భద్రతలు దిల్లీ ప్రభుత్వం చేతుల్లో లేకపోవడం,లెఫ్ట్ నెంట్ గవర్నర్ దిల్లీ ముఖ్యమంత్రి కి పోటీగా సమాంతర ప్రభుత్వం నిర్వహించే విధంగా పరిస్థితులు ఏర్పడడం, కేంద్రం జోక్యం పెరగడం వలన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు వోటేసినా కేంద్రం, లెఫ్ట్ నెంట్ గవర్నర్ లే అధికారం చెలాయిస్తారనే భావన ప్రజల్లో పెరిగి ఉండవొచ్చు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారం లో ఉన్న పార్టీకే వోటేయడం వలన రాజకీయ ఉద్రిక్తతలు లేకుండా పరిపాలన సాగుతుందనే అభిప్రాయం ప్రజల్లో ప్రబలి, భాజపా కు పట్టం కట్టారని కొంతమంది భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్,మనీష్ సిసోడియాలు తాము పోటీ చేసిన స్థానాల్లో ఓటమి చెందడం ఆప్ పట్ల దిల్లీ ప్రజలకున్న ఆగ్రహాన్ని సూచిస్తున్నది.ఏది ఏమైనప్పటికీ ఎవరు గెలిచినా,దిల్లీని ప్రశాంతంగా, రాజకీయ గందరగోళం లేకుండా పాలించాలి. సుపరిపాలనతో దిల్లీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలి. కాలుష్యంతో కకావికలమౌతున్న హస్తిన ప్రజలను కాపాడాలి. హర్యానా,పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రైతులతో చర్చించి దిల్లీ కాలుష్యానికి కారణ భూతమవుతున్న వ్యవసాయ వ్యర్థాల విషయంలో తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, దిల్లీని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలి.ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలి.
– సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్)
తూ .గో.జిల్లా,ఆంధ్రప్రదేశ్. మొ:9704903463.