-ఇరాన్‌ను వీడాలని భారత్ అడ్వైజరీ
న్యూదిల్లీ, జూన్ 8: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయి. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఇరాన్‌ను వీడాలని అక్కడి భారత పౌరులకు సూచించింది. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా ప్రస్తుతానికి భారత పౌరులు ఇరాన్‌కు ప్రయాణాలను మానుకోవాలని సూచిస్తున్నాం. ఇక, ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో వెంటనే ఆ దేశాన్ని వీడాలని హెచ్చరిస్తున్నాం అని ఎంబసీ తమ అడ్వైజరీలో వెల్లడించింది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో ఘర్షణలు మొదలైన నాటినుంచి భారత్ పలుమార్లు ఇలాంటి ప్రయాణ సూచనలు జారీ చేసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపు 1600 మందికి పైగా భారత పౌరులను ఇరాన్ నుంచి తరలించింది. ఇక, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల పశ్చిమాసియా దేశాల నుంచి దాదాపు 6 లక్షల మంది భారత పౌరులు స్వదేశానికి తిరిగొచ్చినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇదిలాఉండగా ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మళ్లీ తీవ్రస్థాయికి చేరుకున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. దీంతో ఇజ్రాయెల్ దీటుగా ప్రతిస్పందించింది. టెహ్రాన్‌కు చెందిన మషహర్ పెట్రోకెమికల్ ప్లాంట్‌పై దాడి చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఈ ఘటనలో ప్లాంట్ తీవ్రంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. నైరుతి ఇరాన్‌లో పెట్రో కెమికల్స్ ఎగుమతుల్లో మషహర్ కాంప్లెక్స్ అత్యంత కీలకమైనది.
హోర్ముజ్ జలసంధి మూసివేత
-దేశంలో 60 రోజులకు సరిపడ ఇంధన నిల్వలు: మంత్రి హర్దీప్
హోర్ముజ్ జలసంధి మూసి ఉంచినప్పటికీ దేశంలో ఇంధన నిల్వలకు ఢోకా లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. 30 నుంచి 60 రోజుల వరకూ సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. అయితే పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. సోమవారం నాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ… ’మరో 30 రోజులు హోర్ముజ్ జలసంధి మూతపడే ఉంటే ఏం జరుగుతుంది? దేశీయంగా మనకు తగినన్ని నిల్వలు ఉన్నాయి. 60-60-60 అని చెప్పగలను. అంటే 60 రోజులకు సరిపడా క్రూడాయిల్, నేచురల్ గ్యాస్, ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయి’ అని హర్దీప్ సింగ్ పురీ చెప్పారు. స్వల్పకాలిక అంతరాయాలను భాగస్వామ్య దేశాల సపోర్ట్‌తో అధిగమించేందుకు అవసరమైన వ్యూహాత్మక ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. పశ్చిమాసియాలో పరిస్థితి రెండు మూడు రకాలుగా ఉండొచ్చని, ఘర్షణలు విస్తరిస్తే అది అసాధారణ పరిస్థితి అవుతుందని, అది బాధాకరమని అన్నారు. ఒకవేళ హోర్ముజ్ జలసంధిని మూసి ఉంచిన పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించామని చెప్పారు. యూఏఈ వంటి మంచి మిత్రులు మనకున్నారని, ఎల్పీజీ కార్గోలను నేరుగా మనకు పంపగలమని యూఏఈ నుంచి ప్రతిపాదన ఉందని, పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి దేశీయంగా స్ట్రాటజిక్ పెట్రోలియం సహా 30 నుంచి 60 రోజులకు సరిపడా అన్నిరకాల నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఇవి 76 నుంచి 80 రోజులకు కూడా సరిపోవచ్చన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




రేవంత్ హిట్లర్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్