– తీర్పు ఎలా ఉంటుందో అన్న టెన్షన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ వాయిదా పడింది. అయితే విచారణ ప్రారంభమైన కాసేపటికే వాయిదా వేస్తూ ధర్మాసనం ప్రకటించింది. మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేసింది హైకోర్టు. తొలుత విచారణ ప్రారంభమవగానే.. రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని ప్రశ్నించింది హైకోర్టు. సుప్రీంకోర్టులో జరిగిన విచారణపైనా హైకోర్టు ధర్మాసనం ఆరా తీసింది. అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని పేర్కొన్న ధర్మాసనం.. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. కాగా, బీసీ రిజర్వేషన్లపై 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లను కలిపి మధ్యాహ్నం హైకోర్టు విచారించింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. కాగా, బీసీ రిజర్వేషన్లపై అంశంపై తెలంగాణ హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపనుంది. హైకోర్టు నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేలనుంది. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం.. రిజర్వేషన్లు 50 శాతం మించడానికి అవకాశం లేదు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం రిజర్వేషన్లు 67 శాతానికి పెరిగాయి. బీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించింది ప్రభుత్వం. హైకోర్టు ఒకవేళ ఈ జీఓను కొట్టివేస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశం ఉంది.
రిజర్వేషన్లపై వాదనలను గమనించిన మంత్రి సీతక్క
బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో జరుగుతున్న విచారణను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సచివాలయం నుంచి ఆన్‌లైన్‌లో పరిశీలించారు. ఈ కేసులో జరుగుతున్న వాదనలను ఆమె నిశితంగా గమనించారు. రిజర్వేషన్లకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు, ప్రభుత్వ సమాధానాలు, తదితర వివరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అక్కడున్న వారితో మాట్లాడుతూ బీసీ వర్గాలకు తగిన న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.





