అత్యవసరమైతేనే బయటకు రండి

– 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
– ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
– రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం సూచించారు. రానున్న ఆరు రోజులపాటు పలు జిల్లాల్లో తీవ్ర వడగాలులు, 44 డిగ్రీల సెల్సియస్‌కుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఒకవైపు భగ్గుమంటున్న ఎండలు, మరోవైపు ఈదురు గాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన అకాల వర్షాలు సంభవించే పరిస్థితులు ఉన్నందున ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, తదుపరి రోజుల్లో జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కూడా ఎండల తీవ్రత పెరిగే అవకాశముందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్బిణుÛలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తగినంత నీరు, మజ్జిగ, ఓఆరఎస్ ద్రావణాలు తీసుకోవాలని, ఎండలో పనిచేసే వారు తలకు రక్షణ కల్పించే వస్త్రాలు ధరించాలని సూచించారు. వడదెబ్బ, ఎండ తీవ్రత కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సేవలు, అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వడదెబ్బ నివారణ చర్యలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. రైతులు, కూలీలు, నిర్మాణ కార్మికులు, రహదారులపై పనిచేసే కార్మికులు ఎండ తీవ్రత సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈదురు గాలులు, ఉరుములు-మెరుపులు సంభవించే ప్రాంతాల్లో ప్రజలు చెట్ల కింద నిలబడకుండా, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *