నేను గాలిలో గాలిపటాన్ని
స్వేచ్ఛగా ఎగురుతున్నానని
లోకాన్ని భ్రమింపజేస్తుంటావు
అగుపించని దారం మాత్రం నీ చేతిలోనే ఉంటుంది
నీవు వేధికలెక్కి సగం సగం అంటుంటే
ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది
దోచుకున్నవాడే సాధికారతతో
సానుభూతిగా వాటాలేస్తున్నందుకు
అత్యంత అవమానకరమైంది ఏంటో తెలుసా…
నన్నో చోట నిలపెట్టి చుట్టూ దారులు మూసిన గోడలతో
పజిల్స్ కట్టి తాళాలు నీ వద్దే పెట్టుకుని
నాకే బయటకొచ్చే తెలివి లేదని ఎగతాళి చేస్తావు
నా జీవితం చుట్టూ నీకిష్టమైన కథలనల్లుతావు
ఈ కథలు నా అసలు జీవితానివి కాదన్ననాడు
నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ…
నన్నో దోషిగా చిత్రిస్తావు ఈ సమాజం ముందు
వింతేమిటో తెలుసా….
నిందితున్నె న్యాయం చేయమని కోరటం
కారకుడే న్యాయమూర్తిగా ఉండటం
హంతకులే సాక్షులుగా ఉండటం
స్త్రీని అల్పంగా చూసే
వైకల్యపు దృష్టిగల సమాజానికి
శస్త్రచికిత్సను చేసేకొత్త సాంకేతికతను
కాసింత కనుగొంటే బాగుండు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 08 సందర్భంగా…
– దిలీప్.వి
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
టి.పి.టి.ఎఫ్ ములుగు జిల్లా
సెల్:8464030808