– 3 ట్రిలియన్ల లక్ష్య సాధనకు విద్య, వైద్య రంగాలే కీలకం
-గత ఏడాది 16 నర్సింగ్ కళాశాలలు ప్రారంభం
– నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల్లో శిక్షణ
– మంత్రి దామోదర్ రాజనర్సింహ
తెలంగాణను ప్రపంచ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌లో భాగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంలో వైద్య, విద్యారంగాలే వెన్నముకగా నిలుస్తాయని ఆయన అన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ‘తెలంగాణ యాజ్ ఏ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్’ అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో మంత్రి ప్రసంగించారు. బాలికా విద్య ప్రాముఖ్యతపై మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నర్సింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులు ఎంతో దోహదపడ తాయి. వారి కలలను సాకారం చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం గతేడాది కొత్తగా 16 నర్సింగ్ కళాశాలలను ప్రారంభించింది. కేవలం డిగ్రీలు ఇవ్వడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో వారికి ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం. ఇందుకోసం నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, జపనీస్, ఇంగ్లిష్ భాషల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. తద్వారా మన ఆడబిడ్డలు విదేశాల్లోనూ రాణించేలా తీర్చిదిద్దుతున్నాం,” అని మంత్రి దామోదర రాజనర్సింహ వివరించారు. నైపుణ్యంతో కూడిన విద్యే అసలైన ఆస్తి అని, సామాన్యుడి ఆశయ సాధనకు విద్యే ప్రధాన ఆయుధమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచంలో కేవలం పుస్తక జ్ఞానం ఉంటే సరిపోదని, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్ షిప్ మిళితమైన విద్య అవసరమని తెలిపారు. అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. “రాష్ట్రంలో ప్రస్తుతం 47 విశ్వవిద్యాలయాలు, 1,951 ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక కళాశాల సాంద్రత కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియోలో తెలంగాణ దేశంలోని టాప్-5లో నిలిచింది.” అని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంస్కరణలను మంత్రి వివరిస్తూ.. సామాజిక అసమానతలను తొలగించి, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్స (వైఐఐఆర్ ఎస్) ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల కోసం ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని నెలకొల్పామన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆస్ట్రియాకు చెందిన ఆల్ఫా సంస్థతో కలిసి డ్యుయల్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి ప్రతి పౌరుడిని నైపుణ్యవంతుడిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తుం దని, ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు, విద్యావేత్తలకు మంత్రి పిలుపునిచ్చారు. తాను చదువుకుని రాజయకీయాల్లోకి వచ్చే సమయంలో కేశవరావు విద్యాశాఖ మంత్రిగా ఉండేవారని, ఇప్పుడు ఆయనతో కలిసి విద్యా రంగానికి సంబంధించిన చర్చలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న నిపుణులు ఇచ్చిన సూచనలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని మంత్రి తెలిపారు.





