హైదరాబాద్‌లో భారీ వర్షం

– పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం
– అధికారులను అప్రమత్తం చేసిన సిఎం రేవంత్‌
– అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వెళ్లాలని ఆదేశం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 13: ‌హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, అ‌మీర్‌పేట, యూసుఫ్‌గూడ, సనత్‌ ‌నగర్‌, ‌ఫిలింనగర్‌, ‌పంజాగుట్ట, ఎర్రగడ్డ, బోరబండ, మహేశ్వరం, తుక్కుగూడ, పహాడీషరీఫ్‌, ‌కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, హైదర్‌ ‌నగర్‌, ‌ప్రగతినగర్‌, ‌మూసాపేట్‌ ‌ప్రాంతాల్లో వర్షం పడుతోంది. శంషాబాద్‌లో భారీ వర్షానికి ప్రధాన రహదారి జలమయమై చెరువును తలపిస్తోంది. రోడ్డంతా నీటితో నిండిపోవడంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

హై అలర్ట్ ‌ప్రకటించాలి : ముఖ్యమంత్రి 

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌ ‌కోర్‌ అర్బన్‌ ‌రీజియన్‌ ఎకానమీ పరిధిలో ’హై అలర్ట్’ ‌ప్రకటించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. వర్షాల వల్ల నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన సత్వర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వాతావరణ శాఖ వర్ష సూచన వివరాల ఆధారంగా అధికారులు ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలని సూచించారు. నగరంలో సాధారణంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి,అక్కడ ముందస్తుగానే అత్యవసర బృందాలను మోహరించాలని ఆదేశించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని సీఎం రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. పోలీస్‌, ‌ట్రాఫిక్‌ ‌పోలీస్‌, ‌మున్సిపల్‌, ‌హైడ్రా, విద్యుత్‌ ‌శాఖ, వాటర్‌ ‌బోర్డ్ ‌సహా ఇతర అన్ని సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ఈ క్రమంలోనే చీఫ్‌ ‌సెక్రటరీ, డీజీపీ, స్పెషల్‌ ‌సీఎస్‌లతోపాటు నగరానికి చెందిన సీనియర్‌ అధికారులందరితో యుద్ధప్రాతిపదికన సమీక్షలు నిర్వహించి, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడటం, విద్యుత్‌ ‌సరఫరాలో అంతరాయాలు, ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

వ‌ర్ష‌ ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ పరిశీలన 
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో డీజీపీ సి.వి. ఆనంద్ వర్ష ప్రభావిత ప్రాంతాలను శ‌నివారం సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. టోలిచౌకి పరిసరాల్లోని మల్కంపేట చెరువు ప్రాంతంతోపాటు సమీప ప్రాంతాలను పరిశీలించి, నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాలు  ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతితో డీజీపీ సమావేశమై ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. రోడ్లపై నీరు నిల్వ కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ రద్దీని నివారించాలని, సాధారణ పరిస్థితులను త్వరగా పునరుద్ధరించేందుకు పౌర సంస్థలతో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, కీలక కూడళ్ల వద్ద తగిన సంఖ్యలో సిబ్బందిని మోహరించి ట్రాఫిక్ నియంత్రణతోపాటు ప్రయాణికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు. అదేవిధం గా హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వర్ష ప్రభావిత జిల్లాలన్నింటిలోని పోలీసు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల కారణంగా తలెత్తే ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని డీజీపీ ఆనంద్ ఆదేశించారు. జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ సంస్థలు, మున్సిపల్ అధికారులతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు సకాలంలో సహాయం అందించాలని ఫీల్డ్ అధికారులకు సూచించారు. ప్రజలు ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లరాద‌ని, పోలీసులు, ఇతర ప్రభుత్వ సంస్థలు జారీ చేసే అధికారిక సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నెలకొన్న వర్ష పరిస్థితులను తెలంగాణ పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజల భద్రత, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవల వేగవంతమైన స్పందన కోసం కట్టుబడి పనిచేస్తున్నారని పునరుద్ఘాటించారు.
———————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *