చెన్నై, జూన్ 5: తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం సీఎం విజయ్ పై ఉన్న దృష్టి ఇప్పుడు అన్నామలై వైపు మళ్లింది. ఆయన ఇప్పటికే బీజేపీని వీడగా తన రాజకీయ భవిష్యత్తు గురించి తాజాగా మీడియాతో మాట్లాడారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. కొత్త రాజకీయ ఉద్యమం చేయబోతున్నట్లు అన్నామలై తెలిపారు. భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నానని, తన ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్దే తన ప్రథమ ప్రాధాన్యమన్నారు. మార్పు కోసమే బీజేపీలో చేరానన్నారు. రాజీనామా ఆమోదించిన బీజేపీ హైకమాండ్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. ‘తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని ఆశించా.. 18 నెలలుగా బీజేపీతో విభేదాలు ఉన్నాయి.. బీజేపీకి నేను భారంగా ఉండాలనుకోవడం లేదు.. అందుకే రాజీనామా చేశా.. 2025 డిసెంబర్ లోనే అధిష్ఠానానికి రాజీనామా గురించి చెప్పా.. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీలో ఉన్నా’ అని అన్నారు. ఈ సమయంలో తమిళనాడుకు కొత్త పార్టీ అవసరమా అని అడిగితే కచ్చితంగా అవసరమే అని అన్నామలై అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు రజనీకాంత్ ప్రస్తావన తెచ్చారు. తనతో చేతులు కలపమని గతంలో సూపర్ స్టార్ అడిగారన్నారు. 2024లో తాను బీజేపీలో చేరడానికి ఒకరోజు ముందు రజనీకాంత్ ఫోన్ చేశారు. ఆయన నేతృత్వం వహిస్తున్న రాజకీయ ఉద్యమంలోకి రావాలని ఆహ్వానించారు. కానీ, నేను అప్పటికే బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కు మాటిచ్చా. అందుకే రజనీ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించా. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం సంతోష్ ఇచ్చిన హామీనే. నా రాజకీయ ప్రవేశంపై ఉన్న ఊహాగానాలకు ముగింపు పలికేందుకు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాను’ అని అన్నామలై వివరించారు. ఇకపై స్వతంత్ర రాజకీయ మార్గంలో ముందుకువెళ్తానని, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త బాటలు వేసేందుకు పోరాడతానని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





