కోహెడ సమీకృత పండ్ల మార్కెట్‌కు రేపు శంకుస్థాపన

– దేశానికే ఆదర్శంగా ఏర్పాటు కానున్న మార్కెట్
– ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ రంగ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనున్న కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.3,367.35 కోట్ల వ్యయంతో 239 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ పండ్ల మార్కెట్ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్నదని తెలిపారు. రైతు సంక్షేమం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, ఆధునిక మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు పండించిన ప్రతి ఉత్పత్తికి మార్కెట్ హామీ కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడం, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. వ్యవసాయ మార్కెటింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే దూరదృష్టితో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మరో రెండు దశాబ్దాల వరకు మార్కెట్ అవసరాలను తీర్చగలిగేలా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ పండ్ల మార్కెట్ అభివృద్ధి ప్రయాణంలో జాంబాగ్, గడ్డిఅన్నారం, బాటసింగారం మార్కెట్లు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. అయితే పండ్ల వ్యాపారం, రవాణా, వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలోనే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోహెడలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని ద్వారా సుమారు 1.65 లక్షల మంది పండ్ల రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం 5.30 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న మార్కెట్ సామర్థ్యం 15.53 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగనుండగా, పండ్ల వ్యాపార పరిమాణం రూ.1,277 కోట్ల నుంచి రూ.7,765 కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. 341మంది వ్యాపారులు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా భవిష్యత్తులో ఆ సంఖ్య 967కు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ మార్కెట్ యార్డులో పండ్లతోపాటు పూలు, డ్రైఫ్రూట్స్, డెయిరీ ఉత్పత్తులు, ఫ్రోజన్ ఫుడ్స్, చేపలు, మాంస ఉత్పత్తుల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిల్వ, గ్రేడింగ్, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్, రవాణా, మార్కెటింగ్ సేవలు ఒకేచోట అందుబాటులోకి వ‌స్తాయ‌ని, ప్రత్యక్షంగా 14 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *