హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 14 :అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ శాయంపేట ప్రాంతంలోని స్లమ్ ఏరియా సందర్శించి అక్కడ వలస నివాసులతో, గుడిసెవాసులతో వీధి బాలలతో మాట్లాడి ఆత్మీయ స్పర్శను అందించారు. డ్రాప్ అవుట్ పిల్లలు బడిలో చదువుకోవాలంటూ చదువు విలువ, జీవితం విలువ తల్లిదండ్రులకు తెలియచేయడమేకాక వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారికి బట్టలు, పిల్లలకు నోట్ బుక్స్, ఉచితంగా అందించారు. శరీరం, పరిసరాలు శుభ్రంగా ఉంచు కోవాలని ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి తల్లిదండ్రులకు, పిల్లలకు తెలియచేశారు, అనితా రెడ్డి మాట్లాడుతూ కూలి పనుల కోసం వలస వచ్చిన ఈ గుడిసెవాసులను చూస్తే చాలా బాధగా ఉందని, అపరిశుభ్రమైన వాతావరణంలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారని, వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళతానని ఆమె చెప్పారు. సమాజంలో మన తోటి వారి కనీస అవసరాలు తీర్చేందుకు అందరం మనకు తోచిన మేర సహాయ సహకారాలు అందించాలని, అదే మానవత్వం అదే దైవసేవ అని అన్నారు. తోటి వారి మంచి గురించి ఆలోచించడం మన బలహీనత అయితే ఈ ప్రపంచంలో మన అంత బలమైన వారు, మంచివారు వేరొకరు ఉండరని, మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలని, సహాయం చేయాలంటే మనం కోటీశ్వరులే అవ్వాల్సిన అవసరం లేదని, మానవత్వం, స్పందించే గుణం ఉంటే చాలని సూచించారు. అప్పుడే మనకు తోచిన మేర సహాయం ఏరూపంలో అయినా బయటకు వస్తుందని, ఒక్కోసారి చిన్న మాటే అవతలి వాళ్లకి సంజీవిని అవ్వొచ్చని, వారి అభివృద్ధికి బాటలు వేయవచ్చని అనితా రెడ్డి అన్నారు, విద్యతోనే అభివృద్ధి సాధ్యం అని అన్నారు. ఒకరి విద్యకు సహకరించడం అంటే ఓ కుటుంబాన్ని అభివృద్ధి పరచడమేనన్నారు. ప్రతి ఒక్కరూ పేద పిల్లలకు తోచిన మేర సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలకు తల్లిదండ్రులు చదువు విలువ, జీవితం విలువ తెలియచేయాలని, బడి వయస్సు పిల్లలు ప్రతి ఒక్కరూ చదువు కోవాలని డాక్టర్ అనితా రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి, రాఘవ, గుడిసెవాసులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




