– చనిపోయారనుకున్న ఇద్దరు తనయుల రాక
– కన్నీటి నుంచి తేరుకున్న తల్లి ఆనంద భాష్పాలు
ఖాఠ్మండు,ఆగస్ట్ 29: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలకు 616 మంది మృతిచెందగా సుమారు 2,500 మంది గల్లంతయ్యారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఇదే సమయంలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులు చనిపోయారని భావించి గుండెలు పగిలేలా రోదించింది. రెండు రోజుల తర్వాత వారిద్దరూ ప్రాణాలతోనే ఉన్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. రాసువా జిల్లాకు చెందిన మట్టి మాయా తమాంగ్ (28) అనే మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడు జోయల్ ఘలే (8). బుధవారం ఉదయం వారిద్దరూ పాఠశాలకు వెళ్లగా.. కొద్దిసేపటికే భారీ శబ్దం వినిపించడంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన తమాంగ్‌కు భయానక దృశ్యం కనిపించింది. వరద నీరు, బురద, రాళ్లు భారీగా ప్రవహిస్తూ ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఇదే క్రమంలో పాఠశాల భవనాన్నీ వరద నీరు ధ్వంసం చేసింది. పిల్లలు వరదల్లో కొట్టుకుపోయి ఉంటారని భావించిన తమాంగ్.. వారిని వెతుక్కుంటూ పలు సహాయక శిబిరాలు తిరిగింది. అయినా వారి ఆచూకీ మాత్రం ఎక్కడా దొరకలేదు. దీంతో కుమారులిద్దరూ చనిపోయారని భావించి గుండెలు పగిలేలా రోదించింది. అయితే చిన్నారి జోయల్ ప్రాణాలతో బయటపడ్డాడు. వరద సమయంలో ఓ స్నేహితుడితో కలిసి పాఠశాల నుంచి అడవిలోకి పారిపోయాడు. వరద నీటి నుంచి తప్పించుకునేందుకు చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో అతని కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. చేతులు, ముఖానికీ గాయాలయ్యాయి. గురువారం నాడు బాలుడిని గుర్తించిన పోలీసులు.. నువాకోట్ జిల్లాలోని 15 పడకల చక్ర దేవ్ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖాఠ్మాండూ హాస్పిటల్‌కి తరలించారు. అయితే, ఓ జర్నలిస్టు సహాయంతో జోయల్ ఆచూకీని తమాంగ్ గుర్తించింది. వెంటనే హాస్పిటల్‌కి చేరుకుని కుమారుడిని కలుసుకుంది. జోయల్‌ను చూసే వరకూ అతను బతికే ఉన్నాడన్న విషయాన్ని తమాంగ్ నమ్మలేకపోయింది. ఒక్కసారిగా కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. అప్పటికే చిన్న కుమారుడు కూడా దొరకడంతో కథ సుఖాంతమైంది.8 ఏళ్ల బాలుడు చెట్టు ఎక్కి వరదల నుంచి తప్పించుకొని సురక్షితంగా బయటపడ్డాడు. ఎట్టకేలకు రెండు రోజుల తర్వాత తన తల్లిని తిరిగి కలుసుకోగలిగాడు. నేపాల్‌కు చెందిన జోయల్ ఘలే, అతడి సోదరుడు బుధవారం పాఠశాలకు వెళ్లారు. ధాడింగ్ జిల్లాల్లో వరదల ధాటికి పలు స్కూళ్లు కొట్టకుపోయాయి. స్థానికంగా ఉన్న ఓ చెట్టును పట్టుకొని జోయల్ ఘలే ప్రాణాలు కాపాడుకున్నాడు. ఒళ్లంతా గాయాలతో రోజంతా చెట్టుపైనే ఉండి సహాయం కోసం ఎదురు చూశాడు. అతడిని రక్షించిన సహాయక బృందాలు వైద్యం కోసం హాస్పిటల్‌లో చేర్చాయి. తన ఇద్దరు కుమారుల కోసం అనేక శిబిరాల్లో వెతికినా ఎక్కడా వారి ఆచూకీ దొరక్కపోవడంతో ఆశలు వదులు కున్నానని బాలుడి తల్లి మాయా తమాంగ్ పేర్కొన్నారు. తన కుమారుడు బతికే ఉన్నట్లు అధికారుల నుంచి సమాచారం అందడంతో నమ్మలేక పోయానన్నారు. అనంతరం మరో కుమారుడిని కూడా స్థానిక అధికారులు రక్షించినట్లు తమకు సమాచారం అందిందని సంతోషం వ్యక్తం చేశారు. తమ పిల్లలను కాపాడిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
నేపాల్ వరదల్లో మరో విషాదం
-ఆచూకీ లేని ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ
న్యూదిల్లీ, ఆగస్ట్ 29: నేపాల్ ఆకస్మిక వరదల్లో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ లక్ష్మీనాథ్ గోపిశెట్టి గల్లంతయ్యారు. ఆయన వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్‌కు వెళ్లినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయనతో సంబంధాలు తెగిపోయాయని, ఆచూకీ కోసం సంబంధిత అధికారులతో కలిసి గాలిస్తున్నామని తెలిపింది. గోపిశెట్టి కుటుంబ సభ్యులతో సంస్థ సంప్రదింపులు జరుపుతూ వారికి అవసరమైన సాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. కాగా, నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఈ నెల 26న సంభవించిన జల ప్రళయంలో పలు రహదారులు, వంతెనలు, భవనాలు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా నేపాల్‌లోని రసువా జిల్లా, చైనాలోని టిబెట్ ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. సహాయక చర్యలకు ప్రతికూల వాతావరణం, దెబ్బతిన్న రవాణా, సమాచార వ్యవస్థలు సవాలుగా మారాయి. ఈ విపత్తు కారణంగా వందలాది మంది భారతీయుల ఆచూకీ గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. సుమారు 320 మంది భారతీయులు ఇంకా అందుబాటులోకి రాలేదని వెల్లడించింది. అటు చైనాలో సుమారు 400 మంది భారతీయులు చిక్కుకున్నప్పటికీ సురక్షితంగా ఉన్నారంది. ఆయా కుటుంబ సభ్యులు వారితో కాంటాక్ట్‌లో ఉన్నారని తెలిపింది. చైనా వైపు చిక్కుకున్న వారిలో కొంతమంది ఇప్పటికే నేపాల్‌కు చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయులు కూడా సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నారు. నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుతుండగా, గల్లంతైన భారతీయుల ఆచూకీ కోసం భారత దౌత్య అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గోపిశెట్టి ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్‌కు నాయకత్వం వహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యూహరచన, సాంకేతికత, కార్యకలాపాలు, డిజిటల్ పరివర్తనలో సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇన్ఫోసిస్‌లో గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌గా, యాక్సెంచర్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
ప్రాణాలు కాపాడి అమరుడైన పోలీస్
నేపాల్-చైనా సరిహద్దులో బుధవారం సంభవించిన మెరుపు వరదలు విపత్తు నుంచి పలువురిని రక్షించిన ఓ పోలీసు చివరికి ఆ వరదల్లోనే కొట్టుకుపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. వరద బీభత్స సమయంలో టిబెట్‌లోని గీరాంగ్ పోర్టు వద్ద సహాయక చర్యల్లో చైనా బోర్డర్ పోలీసు హువాంగ్ పెంగ్ పాల్గొన్నాడు. అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు పలువురికి సహకరించాడు. ఆ తర్వాత అదే జలప్రళయంలో కొట్టుకుపోయాడు. గీరాంగ్ పోర్టు వద్ద వరద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వరదకు ముందు అక్కడి నుంచి తాము సురక్షితంగా బయటపడడానికి బోర్డర్ కాప్ సహాయం చేశారని.. తమను కాపాడి, ఆయన ప్రాణాలు వదిలారని పలువురు వ్యక్తులు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆయనను ఓ హీరోలా అభివర్ణించారు. వీడియో ఆధారంగా అతడిని గీరాంగ్ పోర్టులో విధులు నిర్వహిస్తున్న చైనా ఇమిగ్రేషన్ పోలీసు అధికారి హువాంగ్‌గా గుర్తించారు. వరద ప్రవాహం తనను సమీపించినప్పటికీ.. ఇతరుల ప్రాణాలు కాపాడడానికి ఆయన చివరి నిమిషం వరకు కృషి చేశారని చైనా స్థానిక పత్రికలు వెల్లడించాయి. ఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా ఇప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





