‘సురవరం ప్రతాప రెడ్డి జయంత్యోత్సవం, పురస్కార ప్రదానోత్సవం’ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : సురవరం ప్రతాప రెడ్డి (Suravaram Pratapa Reddy) స్ఫూర్తితో తెలంగాణ భాష, యాసకు మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu)అన్నారు. బుధవారం శాంతా వసంతా ట్రస్ట్ సౌజన్యంతో సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన “సురవరం ప్రతాప రెడ్డి” 129వ జయంత్యోత్సవం, పురస్కార ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన కలంతో నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ వైతాళికుడిగా సురవరం ప్రతాప రెడ్డి చరిత్ర పుటల్లో నిలిచారని మంత్రి కొనియాడారు. మనకు కూడా భాష, యాస ఉందని చాటిచెప్పిన గొప్ప వైతాళికులన్నారు.
కేవలం సాహితీవేత్తగా మాత్రమే ఆయనను చూడటం సరికాదని, గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడన్నారు. అలాంటి మహనీయుడి గొప్పతనాన్ని భావి తరాలకు తెలిసేలా తెలుగు విశ్వ విద్యాలయానికి పెట్టామని వివరించారు. ఇది ఆయనకు మనం ఇచ్చే గొప్ప గౌరవమన్నారు. అనంతరం ఈ ఏడాదికి గానూ ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, ప్రముఖ రచయిత, పరిశోధకులు డాక్టర్ సంగి శెట్టి శ్రీనివాస్ కు సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి సాహితీ పురస్కారాలను అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఎల్లూరి శివా రెడ్డి, శాంతా వసంతా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కె.ఐ.వర ప్రసాద్ రెడ్డి, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ కార్యదర్శి సురవరం పుష్పలత, ట్రస్ట్ సభ్యులు సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి, సురవరం రఘువర్ధన్ రెడ్డి, సురవరం విజయభాస్కర్ రెడ్డి, సురవరం రంగా రెడ్డి, సురవరం అనిల్ కుమార్ రెడ్డి, సురవరం కపిల్ తదితరులు పాల్గొన్నారు.