వెగటుపుట్టే కాలువలో పసిబిడ్డ దాహార్తి
ఊపిరిని గాలిబుడగల్లో నింపాదిగా బిగబట్టి
ఆప్తుల అస్తిత్వాల పలకపై రాస్తుంది ఒక పాటను
ఉన్నఫలంగా లేని తత్వాలను మోస్తూ పోతూ
ఖాళీలో నీ చిత్రపటాన్ని గీస్తూ వెల్లకిలా పడుకుంది
కసిగా పళ్ళకింద నలిగే ఆహభావాలను
ప్రదర్శనకు తేకుండా గొంతునులిమే ప్రక్రియలో
ద్వారం వద్ద ఒక్కోక్కరిని మాత్రమే తనికీ చేస్తూ
ముఖకవలికలను స్కాన్ చేస్తూ ఒక
వికృతమైన అచ్చును తీసింది నాగరికత
అపశృతుల సమ్మేళనం బహిర్గతం అవుతూ
ఏ ఒక్కరికీ చెందని “ఉపయోగం” వెక్కిరిస్తూ
వెనుదిరిగే దారిలో అంగలారుస్తూ కుర్చుంది
ఓ ప్రియమైన నేస్తమా ఇదే చివరివరకూ…
హెచ్చరికలు లేని దేశ సరిహద్దుల్లో ఒక మూట
బట్ట పీలికలతో జెండాను ఎగరేద్దామన్న
కుతూహలం చావునోట్లో కళ్ళు పెట్టింది
ఇక సెలవు! ఐచ్ఛికమైన జీవితాలకు
ఒక బావి తవ్వి నీళ్ళు విడిచి ఆడుకోమంది
ప్రశాంతతను కోరుకో ముళ్ళకంపల కొసలపై
సూర్యుడు పడమటి పొరల్లో పగిలిపోతూ
గొంతుల్లో విసిరేస్తున్నాడు వెలుగుముక్కల్ని
ఆహ్వానించు అలగక బానిసవని ఒప్పుకోకు
నిజాయితిగా నిట్టూర్పునైనా విడువు
ఇక చాలు పాడింది దిగిరా పలుకు
నవ్వకు ఆ వెకిలి కనిపిస్తుంది ఇంకా
మొత్తం మొహంలో చెడు రక్తం ఇంకిపోయే
ప్రభాతంలో కలిసిపోయి లేత ఎరుపురంగు
ఆకాశమై మిగులు… వెలుతురును విరజిమ్ము!
– రఘు వగ్గు