గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం..
విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు ప్రణాళికలు
యువతను తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేస్తాం..
ఇకపై హాస్టళ్లను తనిఖీ చేస్తా.. తప్పు జరిగితే శిక్షలు తప్పవు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ
ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు కామన్ డైట్ ప్లాన్ ప్రారంభం
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు టాలెంట్ ఎక్కువని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తక్కువ అనే అపోహ బలంగా నాటుకుపోయిందని, అలాంటి అపోహలను తొలగించాలని ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరులోని టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో కామన్ డైట్ ప్లాన్ సీఎం రేవంత్ ప్రారంభించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కార్పొరేషన్ చైర్మన్లు , జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహారావు మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించారని, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుకున్న వారు ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఎంపికయ్యారని తెలిపారు. బుర్రా వెంకటేశం, మహేందర్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులేనని ఈసందర్భంగా తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకున్న వారు ఎంతో మంది గొప్పగా రాణించారన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో సంపూర్ణ విశ్వాసం కల్పించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వొచ్చిందన్నారు. విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేసి, విద్యా ప్రమాణాలు పెంచాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని వెల్లడించారు. డైట్, కాస్మోటిక్, మౌలిక వసతులకు గత ప్రభుత్వం సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. ఇది ప్రజా ప్రభుత్వమని నిరూపించేందుకు సింగిల్ స్ట్రోక్ లో డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పెరిగిన ధరలు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డైట్ చార్జీలు 40శాతం, కాస్మోటిక్ 200 శాతం పెంచామన్నారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇంత మొత్తం పెంచడం ఎక్కడా జరగలేదని తెలిపారు.





