గురుకుల దుస్థితికి గత పాలకులే కారణం..
పదేళ్లుగా డైట్, మెస్ బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం
భోజనం బాగాలేదనడానికి బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలి.
కొత్త మెనూ ప్రకారమే ఆహారం అందించాలి
నాణ్యత లోపిస్తే ఉపేక్షించం కఠిన చర్యలు
బోనకల్ గురుకులలో కామన్ డైట్ మెనూను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులతో ముచ్చటిస్తూ భోజనం చేసిన డిప్యూటీ సీఎం గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టల్స్ విద్యార్థుల వసతులు పట్టించుకోకుండా, డైట్ చార్జీలు పెంచకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే పరిస్థితి దిగజారిందని, గత బిఆర్ఎస్ పాలకుల కారణంగానే విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గత పదేళ్లుగా గురుకుల, హాస్టల్ విద్యార్థుల సంక్షేమం గురించి పట్టించుకోని గత బిఆర్ఎస్ పాలకులు ఇప్పుడు హాస్టల్స్ బాగాలేవని, భోజనం సరిగా లేదని మాట్లాడటానికి సిగ్గుండాలని విమర్శించారు.
శనివారం మధిర నియోజకవర్గం బోనకల్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న డైట్ మెనూను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత బిఆర్ఎస్ పాలకులు గురుకుల, హాస్టల్ విద్యార్థులకు మెస్ బిల్లులను చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా విద్యార్థులకు నాణ్యతగా ఆహారం అందలేదన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన కాంట్రాక్టర్లు ఆహార పదార్థాలను నాసిరకంగా సరఫరా చేయడం వల్ల వాటిని తిన్న విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని , ఆ విషయాలను మర్చిపోయి సోయి తప్పిన బిఆర్ఎస్ నాయకులు 40 శాతం డైట్ చార్జీలు పెంచిన ప్రజా ప్రభుత్వం పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బిఆర్ఎస్ నాయకుల మాదిరిగా డ్రామాలు చేయడం తమకు రాదని అన్నారు. , అంకితభావంతో చిత్తశుద్ధితో విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేయడమే తమకు తెలుసన్నారు.