ఎబోలా అరికట్టే చర్యలు బలోపేతం

– ఆఫ్రికా దేశాల నుంచి వొచ్చే వారిపై ఆంక్షలు
– వీసాలను తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా

వాషింగ్టన్, మే 19: ఎబోలా వ్యాప్తిని నివారించడానికి ముందుజాగ్రత్త చర్యలను బలోపేతం చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనిలో భాగంగా వ్యాధి వ్యాప్తి చెందిన ఆఫ్రికా ప్రాంతాల నుండి వొచ్చే విమాన ప్రయాణికులను పరీక్షించడంతో పాటు, వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డిఆర్‌సి) లో ప్రాణాంతకమైన ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఒ) అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో, యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ఈ నివారణ చర్యలను చేపట్టింది. విమానాశ్రయాలలో స్క్రీనింగ్‌తోపాటు గత 21 రోజులలోపు ఉగాండా, డిఆర్ సి, దక్షిణ సూడాన్‌లకు ప్రయాణించిన అమెరికా యేతర పాస్‌పోర్ట్ హోల్డర్లపై ప్రవేశ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉగాండాలోని కంపాలాలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం అన్ని వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రభావితమైన దరఖాస్తుదారులకు సమాచారం అందించింది. డి ఆర్ సి లో ఉన్న ఒక అమెరికన్ సిబ్బందికి ఎబోలా వైరస్ సోకినట్లు డబ్ల్యుహెచ్ ఒ ప్రతినిధి సతీష్ పిళ్ళై ధృవీకరించారు. ఆ  వ్యక్తికి పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో, చికిత్స నిమిత్తం జర్మనీకి తరలించేందుకు యత్నిస్తున్నామని అన్నారు. అలాగే అతనితో పరిచయం ఉన్న మరో ఆరుగురిని క్వారంటైన్‌కు తరలించినట్లు తెలిపారు.  ప్రస్తుతం ప్రజలకు తక్షణ ప్రమాదం తక్కువగానే ఉందని అంచనా వేస్తున్నామని, అయితే  మారుతున్న పరిస్థితులను నిరంతరం సక్షిస్తున్నట్లు సిడిసి  తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వ్యాధి వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ప్రస్తుతానికి ఇది ఆఫ్రికాకే పరిమితమైందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ ఎబోలా సంక్షోభంపై ట్రంప్ ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ ఒ) నుండి అధికారికంగా వైదొలగడం, గతంలో ఎబోలా నివారణలో కీలక పాత్ర పోషించిన ’యుఎస్ ఎఐడి’ నిధులలో కోత విధించడం ప్రస్తుత నియంత్రణ ప్రయత్నాలపై ప్రతికూల ప్రభావం చూపిందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం తీసుకుంటున్న ప్రయాణ నిషేధాలు కేవలం నాటకమేనని, ట్రంప్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా వెనుకబడి వ్యవహరిస్తోందని జార్జ్‌టౌన్ యూనివర్శిటీ నిపుణులు మాథ్యూ కావనాగ్ విమర్శించారు. గతంలో ప్రభుత్వ ఏజెన్సీల సమన్వయం వల్ల వ్యాధిని వేగంగా అరికట్టగలిగారని, కానీ ఇప్పుడు వందలాది కేసులు నమోదై, తీవ్రంగా వ్యాపించిన తర్వాతే చర్యలు చేపట్టడం అమెరికా వ్యూహాత్మక వైఫల్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాము స్థానిక ఆరోగ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, తక్షణ ప్రతిస్పందన చర్యల కోసం 13 మిలియన్ డాలర్ల సహాయాన్ని సకరించినట్లు సిడిసి ప్రకటించింది.

అప్రమత్తమైన భారత్ : ప్రజలకు అధికారుల హెచ్చరిక 

న్యూదిల్లీ, మే 19: ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా సహా పలు దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా ఇప్పటికే వందమంది మృతిచెందారు. 390 అనుమానిత కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాంగోలోని ఆరుగురు అమెరికన్లకు ఈ వ్యాధి సోకినట్లు పేర్కొన్నారు. వీరిని క్వారంటైన్ కోసం సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఎబోలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఎబోలా వ్యాప్తిని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) నిశితంగా గమనిస్తోందని, దేశంలోకి ఈ వ్యాధి ప్రవేశించకుండా నిఘా పెట్టిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఎబోలా వ్యాప్తి లేనప్పటికీ అంతర్జాతీయ ప్రయాణాలు, ప్రపంచ అనుసంధానం కారణంగా భారత్ అంటువ్యాధుల ముప్ప్పు పట్ల అప్రమత్తంగా ఉండాలని దిల్లీలోని ఎయిమ్స్ కమÖ్యనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ హెచ్చరించారు. ప్రస్తుతం దేశానికి ఎబోలా ముప్ప్పు తక్కువగానే ఉందని, ఈ వ్యాధి వ్యాప్తిపై ఆందోళన చెందాల్సి అవసరం లేదని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *