వేసవి ఎండల్లా మండుతున్న రాష్ట్ర రాజకీయాలు

“అందులో భాగం అన్నట్లుగా నాలుగు ఏళ్ళ క్రితం కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వరంగల్‌లో కాంగ్రెస్‌పార్టీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిందో అదే వరంగల్‌లో  ఆ డిక్లరేషన్‌ ‌హామీని యధావిదిగా అమలుచేయాలన్న డిమాండ్‌తో మే 6వ తేదీన  రైతులతో సభ నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ ‌నిర్ణయించింది. అలాగే వివిధ జిల్లాల్లో  ప్రకటించిన డిక్లరేషన్‌ ‌హామీలపైన కూడా ఆయా జిల్లాల్లో ఇలాంటి సభలను ఏర్పాటు చేయడంద్వారా కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు సిద్దమవుతున్న  బిఆర్‌ఎస్‌, ‌రానున్న ఎన్నికలకు ముందస్తుగా రంగాన్ని సిద్దంచేస్తున్నట్లు కనిపిస్తున్నది.”

నువ్వు ఒకటంటే.. నేను రెండంటానంటున్న మాటల యుద్ధం
manduva ravindhraతెలంగాణ రాజకీయాలు ప్రస్తుత వేసవి ఎండల్లా రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌నాయకులు ఒకరికి ఒకరు తీసిపోని విధంగా మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నర ఏళ్ళ కాలవ్యవధి ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీలు ఇప్పటినుండే రంగం సిద్దం చేసుకున్నట్లు కనిపిస్తున్నది. నువ్వు వెధవవంటే నువ్వు వెధవ వంటూ ఘాటుగా విమర్శించుకుంటున్నారు. గత పదేళ్ళలో పందికొక్కుల్లా దోచుకున్నారని ఒకరంటే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ ధనార్జనకు తెగబడ్డారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.  ఈ ఆరోపణలు శృతిమించడానికి జగిత్యాల బిఆర్‌ఎస్‌ ‌సభ, అదే సమయంలో  జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో (కాళేశ్వరం) జరిగిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలు మరింత ఆజ్యంపోశాయి.

     కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏండ్లుగా ముఖ్యంగా సిఎం రేవంత్‌రెడ్డి ప్రతీ సభ, సమావేశాల్లో బిఆర్‌ఎస్‌ను, దాని అధినేత కెసిఆర్‌ను తూలనాడకుండా ఉండ లేకపోతున్నారు. ప్రతీ సమావేశంలో ఆయనను  రెచ్చగొడుతున్న విషయం బహిరంగ రహస్యమే.  ఒక్కోసారి ఆయన విమర్శలు గతంలో ఏ అధికార పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీపైన చేయనంతగా ఘాటుగా ఉంటున్నాయి. బిఆర్‌ఎస్‌ ‌పార్టీని చనిపోయిన శవంతో పోల్చడం, శవానికి ఎంత అలంకారం చేసినా ఏమి లాభమని దెప్పిపొడవటం అందరినీ విస్మయ పరుస్తున్నది. బిఆర్‌ఎస్‌ అన్నది రాష్ట్ర సాధనకోసమే పుట్టిన పార్టీ అని (ఇంకా నయం దానినైనా సిఎం అంగీకరించారంటున్నారు విశ్లేషకులు) లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నతర్వాత దానికిప్పుడు ప్రాధాన్యత లేదంటారు సిఎం రేవంత్‌రెడ్డి. అంటే ఆ పార్టీకి గతం ఉందేగాని, భవిష్యత్‌లేదంటారాయన. ఆ పార్టీకి ఇప్పుడు ప్రజలతో సంబంధాలులేవు. అధికారంలో ఉన్న పదేళ్ళ కాలంలో ఆ పార్టీ అహంకారంగా వ్యవహరించడంవల్లే ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించారని చెబుతున్న రేవంత్‌రెడ్డి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ను ఇప్పుడు రెస్ట్‌లో ఉన్న ప్రజాప్రతినిధిగా పేర్కొంటున్నారు.
    గతంలో కెసిఆర్‌ అస్వస్థతకు గురైనప్పుడు కూడా సిఎం రేవంత్‌రెడ్డి విచిత్రమైన కామెంట్‌ ‌చేశారు. బిఆర్‌ఎస్‌కు స్ట్రేచర్‌ ఉం‌దనుకుంటున్నారు. ఇప్పటికే స్ట్రెచర్‌ ఎక్కిందని, తర్వాత మార్చూరికే అంటూ సెన్సేషనల్‌ ‌కామెంట్‌ ‌చేయడం తెలిసిందే. కృష్ణాజలాల ప్రస్తావన వచ్చినప్పుడు కెసిఆర్‌తోపాటు హరీష్‌రావును ఉరితీసినా పాపంలేదంటూ, అదే మిడిలీస్ట్ ‌దేశాల్లోనైతే రాళ్ళతో కొట్టి చంపేవారని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు జీవన్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరే సందర్భంగా ‘కాంగ్రెస్‌ ‌పోవాలె.. బిఆర్‌ఎస్‌ ‌రావాలె ’అని జీవన్‌రెడ్డి చేసిన నినాదం పైన కూడా ఆయన తీవ్రంగా విరుచుపడ్డారు. మరో సందర్భంలో ‘రేవంత్‌రెడ్డి పోవాలె.. కెసిఆర్‌ ‌రావాలె’ అన్న జీవన్‌రెడ్డి పార్టీ మారడంపట్ల తీవ్రంగా స్పందిస్తూ, నాలుగున్నర దశాబ్దాలుగా పలు పదవులు అనుభవించి, ఫాం హౌజ్‌లో కూర్చున్న పాపాల బైరవుడు అధికారంలోకి రావాలంటావా అంటూ ఆయన పై విరుచుకుపడ్డారు.
    ఇదిలాఉంటే  రెండున్నర ఏండ్లుగా తనపై కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న విమర్శలన్నిటికీ మౌనమే సమాధానమన్నట్లుగా ఇంతకాలం వ్యవహరిస్తూ వచ్చిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌జగిత్యాలసభ, పార్టీ ఆవిర్భావ కార్యక్రమాల్లో ఎవరి పేరెత్తకుండా పరోక్ష విమర్శల ద్వారా వాటిని తిప్పికొట్టారు. తనపై చేస్తున్న విమర్శలను ‘చిల్లర మాటలు’గా  ఆయన ఆభివర్ణించారు. ఆ మాటలేంటి, ఆ కూతలేంటి, రాష్ట్రంలో ఏం జరుగుతున్నదంటూ ఆయన తనదైన శైలిలో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. రెండున్నర ఏండ్లుగా  కెసిఆర్‌ ‌తనపైన, బిఆర్‌ఎస్‌ ‌పార్టీపైన వస్తున్న విమర్శలకు సూటిగా సమాధానాలు చెబుతారనుకున్న వారికి మాత్రం కొంత నిరాశ ఏర్పడింది. సిఎం రేవంత్‌రెడ్డి దూకుడుకు కళ్ళేం వేస్తారని బిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలకు కొంత నిరాశ ఎదురైనప్పటికీ, కెసిఆర్‌ ‌మళ్ళీ ప్రజలమధ్యకు రావడంపట్ల వారు సంతోషాన్ని వ్యక్తంచేశారు.
    అవునన్నా కాదన్నా రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో బిఆర్‌ఎస్‌ ‌క్యాడర్‌ ఇం‌కా ఆక్టివ్‌గానే ఉంది. ఇంకా ఆ పార్టీ లేవదని, దాని ఉనికే ఉండదని కాంగ్రెస్‌తోపాటు బిజెపి అంటున్నా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కెసిఆర్‌ ‌రెండున్నర ఏండ్ల తర్వాత, రెండున్నర ఏండ్ల ముందు ప్రజల్లోకి వస్తున్నారన్నది స్పష్టమవుతున్నది. బిఆర్‌ఎస్‌పార్టీ 26వ ఆవిర్భావవేడుకల సందర్భంగా ఆయన నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చిన పిలుపును బట్టి పార్టీ పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. పార్టీ రాష్ట్ర కమిటీ మినహా గ్రామస్థాయి నుంచి అన్ని కమిటీలను రద్దు చేసి, నూతన కమిటీలను వేయాలనడం, వారికి శిక్షణ ఇవ్వాలనడం ద్వారా క్యాడర్‌లో నూతనోత్సాహం కలిపించాలన్న  ఉద్దేశ్యం కనిపిస్తున్నది.అలాగే కాంగ్రెస్‌పై పోరాటానికి సిద్దం కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ప్రధానంగా ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు పర్చాలన్న ఒత్తిడిని తీసుకురావాలని వారికి సూచించారు.
     అందులో భాగం అన్నట్లుగా నాలుగు ఏళ్ళ క్రితం కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వరంగల్‌లో కాంగ్రెస్‌పార్టీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిందో అదే వరంగల్‌లో  ఆ డిక్లరేషన్‌ ‌హామీని యధావిదిగా అమలుచేయాలన్న డిమాండ్‌తో మే 6వ తేదీన  రైతులతో సభ నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ ‌నిర్ణయించింది. అలాగే వివిధ జిల్లాల్లో  ప్రకటించిన డిక్లరేషన్‌ ‌హామీలపైన కూడా ఆయా జిల్లాల్లో ఇలాంటి సభలను ఏర్పాటు చేయడంద్వారా కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు సిద్దమవుతున్న  బిఆర్‌ఎస్‌, ‌రానున్న ఎన్నికలకు ముందస్తుగా రంగాన్ని సిద్దంచేస్తున్నట్లు కనిపిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *