“ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయి, ఆర్థిక మాంద్యంతో అట్టుడికి పోతున్న నేపథ్యంలో తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, రైతులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రతీ ఒక్కరూ బాధ్యతా యుతంగా, శక్తివంచన లేకుండా పనిచేయాలి. ప్రైవేటు రంగాలు ఎప్పుడూ లాభాల గురించే ఆలోచిస్తాయి . తప్ప, ప్రజల శ్రేయస్సును గురించి ఆలోచించవు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ప్రజల శ్రేయస్సును గుర్తించి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడంలో ప్రతీ ఒక్కరూ రాజకీయాలకతీతమైన ధోరణి అవలంభించాలి..”
(ప్రపంచ కార్మిక దినోత్సవం “మే డే” సందర్భంగా)

ప్రైవేటు ఉద్యోగాలు,కార్పోరేట్ కొలువులు మర మనుషులను తయారు చేసే కర్మాగారాలుగా మారి పోయాయి. వేళాపాళా లేని ఉద్యోగాల వలన, ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ఊడతాయో తెలియని ఉద్యోగ భద్రత లేని మానసిక వత్తిడి మధ్య అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం నేటి వ్యవస్థలో చోటు చేసుకుంటున్న విపరీత పరిణామం. ఎండలు మండుతున్నా,అనారోగ్య సమస్యలు పీడిస్తున్నా, ఎవరైనా ఆప్తులు చనిపోయినా శెలవులు దొరకడం దుర్లభం.ఏవో కొన్ని పండుగలకు మాత్రమే ఒక రోజు శెలవు ప్రకటిస్తున్నారు. విపరీతమైన శ్రమ దోపిడీ జరుగుతున్నది. ఇటీవల కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు వేలాది కొలువులకు ఎసరు పెట్టాయి. ప్రతీ ఏటా మనదేశంలో సుమారు కోటి మంది ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. ఏటా ఎంతో మంది పట్టభద్రుల ఉద్యోగాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాల కల్పన కష్టతరంగా మారింది. ఎక్కడా శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు.సంపదకు ప్రతిరూపాలు శ్రమజీవులు. శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబు ఈ ప్రపంచంలో కానరాడు.అందుకే శ్రమ శక్తి ప్రాధాన్యత గుర్తించాలి.శ్రమ జీవుల బ్రతుకు వెతల నేపథ్యాన్ని స్ఫృశించాలి.కష్ట జీవుల కష్టాలను ఆలకించాలి.
మహాకవి శ్రీశ్రీ జయంతికి ఒకరోజు తర్వాత వచ్చే కార్మిక దినోత్సవ నేపథ్యం శ్రీశ్రీ ఆలోచనలకు, ఆవేశానికి దర్పణం పట్టే విధంగా ఉంటుంది.మేడే శ్రమజీవుల కలల సౌధం సాకారమైన దినం…శ్రమకు విలువ పెరిగిన రోజు…కష్టాలకు విముక్తి కలిగిన రోజు. వ్యవసాయం,చేతివృత్తులు,ఇతర కుటీర పరిశ్రమలు పూర్వకాలంలో ఉపాధి అవకాశాలను కల్పించి,ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రధాన భూమిక వహించాయి.కార్మిక,కర్షక,శ్రామిక వర్గాల స్వేదమే సంపదగా మారి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి మార్గం వేసింది. శ్రమశక్తి దోపిడీ పై పలు ఉద్యమాలు జరిగాయి.కొన్ని ఉద్యమాలు శాంతియుతంగా జరిగితే,మరికొన్ని రక్తసిక్తమైన ఉద్యమాలుగా చరిత్రకెక్కాయి.గతంలో ప్రతీ వ్యవస్థ మానవ శక్తి మీద ఆధారపడి మనుగడ సాగించేది. కష్టపడి పని చేసే మనస్తత్వం వలన శ్రమైక జీవన సౌందర్యం లోని విశిష్ఠత ఇనుమడించేది. చేసే పనిలోనే దైవాన్ని గాంచే ప్రజల వలన పూర్వకాలంలో కూడా జనజీవితాలు నల్లేరుపై నడకలా సాగిపోయాయి.అయితే ఈ తత్వాన్ని అదునుగా తీసుకుని శ్రమదోపిడీకి పాల్పడే శక్తులు ఆవిర్భవించాయి.
అప్పట్లో ఉద్యోగావకాశాలు అతి తక్కువ. నిరక్షరాస్యత వలన, పేదరికం వలన చదువులు కొంతమందికే పరిమితం కావడం వలన సమాజంలోని కొద్దిమందికే ప్రభుత్వ ఉద్యోగాలు లభించేవి. మిగిలిన జనాభా వ్యవసాయ రంగం,ఇతర కులవృత్తుల మీద ఆధారపడి జీవించేది. పెట్టుబడి దారీ,భూస్వామ్య వ్యవస్థల వలన భూములపై కప్పం చెల్లించి జీవించే కర్షకుల జీవితాలు దుర్భరంగా ఉండేవి. పరిశ్రమల రాకతో పలువురికి జీవనోపాధి లభించింది. అయితే పగలు, రాత్రి అనే వ్యత్యాసం లేకుండా పని చేయించడం వలన శ్రమదోపిడీ పతాక స్థాయికి చేరింది. ధనికులు, భూస్వాముల వద్ద తీసుకున్న అప్పులు కుప్పల్లా పేరుకుపోవడం వలన, వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితుల్లో కట్టు బానిసత్వం,వెట్టి చాకిరీ ప్రబలిపోయి అనైతిక మైన పరిణామాలకు అంకురార్పణ జరిగింది. శ్రమజీవులపై జరిగే శారీరక,మానసిక, లైంగిక పరమైన హింసా కాండ పేద,మధ్య తరగతి బ్రతుకులను చిందర వందర చేసింది. కుటుంబాలను పోషించుకోవడం కోసం బాలబాలికలను పనిలో నియమించుకోవడం జరిగింది. ఆర్ధిక పరిస్థితులే బాల కార్మిక వ్యవస్థ అంకురించడానికి మూలం.
కాల క్రమంలో అనేక మార్పులు సంభవించాయి.యంత్ర పరికరాలు మానవ జీవన విధానాన్ని సమూలంగా మార్చేసాయి. నూతన ఆవిష్కరణల ఫలితంగా యూరప్ లో “పారిశ్రామిక విప్లవం” మొదలైనది. పారిశ్రామిక విప్లవానికి గ్రేట్ బ్రిటన్ బీజం వేసింది. అమెరికాలో కూడా పరిశ్రమలు వెల్లువెత్తాయి. పారిశ్రామిక విప్లవం పెను మార్పులకు దోహదం చేసింది. పరిశ్రమల మనుగడ మానవశక్తిపై ఆధారపడి ఉండడంతో కార్మికుల అవసరం ఏర్పడింది. విచక్షణా రహితమైన పని విధానం పై నిరసన జ్వాలలు వెల్లువెత్తిన నేపథ్యంలో, వెట్టి చాకిరీ కి వ్యతిరేకంగా ఐక్య పోరాటాల కోసం కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. ప్రతీ రంగంలోను యూనియన్లు పుట్టుకొచ్చాయి. శ్రమకు తగిన ఫలితం కోసం, పని గంటల కుదింపు కోసం ఉద్యమాలు జరిగాయి.
పెట్టుబడిదారీ విధానం పంజా విసిరిన నాటి కాలంలో విచ్చలవిడిగా శ్రమ దోపిడి జరిగింది.కట్టుబానిసల్లా, మనుషులను ఉపయోగించుకుని, వెట్టి చాకిరీ చేయించుకుని, శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా అమానుషత్వంగా వ్యవహరించిన నాటి వ్యవస్థలోని క్రూరత్వాన్ని ప్రశ్నించి, నాటి పాలకుల దుర్నీతిని వ్యతిరేకిస్తూ ప్రపంచంలో జరిగిన పోరాటాల చరిత్ర వర్ణనాతీతం.పని చేసే ప్రతీ చోట శ్రమకు తగిన ఫలితం ఉండకపోవడం, హింసించడం, రేయనక,పగలనకా విచక్షణ లేని పని విధానం వలన విసుగెత్తిన కార్మిక వర్గం గళమెత్తి గర్జించింది. 8 గంటల పని విధానం కోసం ఉద్యమాలు చేసింది. కార్మిక ఉద్యమాలు ఇతర రంగాల్లో పని చేసే శ్రామికులను కూడా ప్రభావితం చేసాయి.
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కార్మికులకు నిర్ణీతమైన పని గంటలు ఉండేవికావు.వారు రోజుకి 16 నుండి 18 గంటలు పనిచేయాల్సి వచ్చేది.వారికి లభించే జీతాలు అంతంత మాత్రంగానే ఉండేవి . దీనితో అమెరికాలోని చికాగో పట్టణంలో 1884 లో కార్మికులు రోజుకి 8 గంటల పని మాత్రమే ఉండాలని ఆందోళన ప్రారంభించారు. ఈ ఆందోళన 1886 నాటికి తారాస్థాయికి చేరింది. మే 1వ తేదీ1886వ సంవత్సరంలో వేలాది మంది కార్మికులు సమ్మె మొదలు పెడితే, మే 3 వ తేదీ నాటికి ఈ సంఖ్య లక్షలకు చేరుకుంది. సమ్మె ఉధృతమయింది. ఉద్యమాన్ని అణచివేయడానికి జరిగిన కాల్పుల్లో పలువురు కార్మికులు మరణించారు.కాల్పులకు,మరణాలకు కారణం కార్మికులే కారణమంటూ కొంతమంది కార్మికులను ఉరితీసారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. యూరప్ లో పుట్టిన ఉద్యమాల సెగ ప్రపంచంలోని పలు దేశాలకు పాకింది. శ్రామిక వర్గం కోరికలను గుర్తించి, 8 గంటల పనివిధానం అమలు లోకి వచ్చింది.చికాగో కాల్పుల్లో మరణించిన కార్మిక వీరుల త్యాగాల ఫలితానికి గుర్తింపు గా మే 1 వ తేదీన కార్మిక దినోత్సవం జరుగుతున్నది. దీనినే శ్రామిక దినోత్సవం లేదా “మే డే”గా కూడా పిలవడం జరుగుతున్నది.
ప్రస్తుత ప్రపంచంలో ఎన్నో కార్మిక చట్టాలు అమలులోకి వచ్చాయి. కార్మిక సంఘాలు వెలిశాయి. కార్మిక,కర్షక,శ్రామిక వర్గాల శ్రేయస్సుకోసం అనేక మైన సంక్షేమ పథకాలు అమలులోకి వచ్చాయి.సరళీకృత ఆర్ధిక విధానాల వలన మేలుతో పాటు కీడు కూడా జరుగుతున్నది. ప్రైవేటు రంగాలు లాభాలను ఆర్జిస్తుంటే, ప్రభుత్వ అధీనంలో నడిచే అనేక రంగాలు నష్టాలను చవిచూస్తున్నాయి.ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలు మూతబడ్డాయి. శ్రమజీవుల బ్రతుకులు రోడ్డున పడ్డాయి. పనుల కోసం నగరాలకు వలస బాట పట్టడం మొదలైనది.పల్లెలను విడిచి,నగరాలకు వలస పోయిన ప్రజల స్థితిగతులు తెలియవు. ఉద్యోగం పేరుతో నరకంలో పడుతున్న వారి సంగతి చెప్పనక్కరలేదు.గతంలో భుక్తికోసం,భూమికోసం ఎన్నో కార్మిక ఉద్యమాలు జరిగాయి.
మారుతున్న ప్రపంచ ఆర్ధిక సరళిని విశ్లేషిస్తే గతకాలం నాటి పరిస్థితులు పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో హక్కులకోసం,కనీస వేతనాల కోసం,పని గంటల కుదింపు కోసం సాగిన ఉద్యమాలు విజవంతమైనాయి.అయితే భవిష్యత్తులో ప్రజల ఉద్యమాలను పట్టించుకోకపోవచ్చు.గతంలో మానవ శక్తితో పలు రంగాలు పనిచేసాయి. అయితే నేటి ప్రపంచాన్ని యాంత్రిక శక్తి శాసిస్తున్నది. అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాల కోసం యాంత్రిక శక్తిని వినియోగిస్తున్నారు.యాంత్రిక శక్తి వినియోగం వలన మానవ శక్తి పై ఆధారపడే పరిస్థితులు క్రమంగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. కృత్రిమ మేథస్సు ఉద్యోగాలను కనీస స్థాయికి తగ్గించడానికి తోడ్పడుతున్నది. ఏఐ ఉద్యోగులపై వేలాడే కత్తిలా తయారైనది. భారతదేశం వంటి వ్యవసాయ ప్రధానమైన దేశాల్లో ఇప్పట్లో పూర్తి స్థాయిలో యాంత్రీకరణ సాధ్యపడే పరిస్థితులు లేవు. అయితే ప్రతీ రంగాన్ని శాసించాలనే కార్పోరేట్ శక్తులు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలవనడంలో సందేహం లేదు. ఇప్పటికే బహుళజాతి కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న సాప్ట్ వేర్ వ్యవస్థ లో కృత్రిమ మేథ( ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), రోబోటిక్స్ వంటి విధానాల వలన భవిష్యత్తులో చాలామంది ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కలదు. పూర్తిగా యాంత్రీకరణపై ఆధారపడే రోజులు రావచ్చు.జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది. పెరిగిన జనాభాకు తగ్గట్టుగా మెరుగైన ఉపాధి అవకాశాలు లభించడం లేదు. స్వల్ప వేతనాలకు బహుళ జాతి కంపెనీల్లో అనేక మంది విద్యాధికులు విసుగు,విరామం లేక పని చేస్తున్నారు. వారానికి రెండు రోజులు సెలవులున్నా,మిగతా ఐదు రోజులు వారు పడుతున్న శ్రమ వర్ణనాతీతం.
ప్రస్తుత సాఫ్ట్ వేర్ రంగాన్ని గమనిస్తే గత కాలం నాటి వెట్టిచాకిరీ వ్యవస్థ జ్ఞప్తికి రాక తప్పదు.నగరాల్లో ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, పెరిగిన అవసరాలు తలకు మించిన భారంగా మారి, నగరాల్లో పని చేసే ప్రైవేటు ఉద్యోగులు తీవ్రమైన మానసిక వత్తిడికి గురై నిత్య నరకాన్ని చవి చూస్తున్నారు. జీతాలు కూడా పెరిగే పరిస్థితులు లేవు. అవసరాలు పెరిగి పోతున్నాయి. ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో బాధ్యతా రాహిత్యం ప్రైవేటు రంగానికి వరం లా మారింది.ప్రతీ రంగం యాంత్రీకరణ వైపు పరుగులు తీస్తున్నది. పది మంది మనుషులు చేసే పని ఒకరితో సాధ్యమైతే మానవ శక్తిని ఉపయోగించి,నష్టాల బాట పట్టడం కంటే యాంత్రిక శక్తి ని ఉపయోగంలోకి తీసుకురావడం మంచిదన్న అభిప్రాయాలు ప్రబలడం సహజం. ఇలాంటి పరిస్థితులు తలెత్తితే భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయి. అధిక జనాభా గల పేద మరియు వర్ధమాన దేశాల్లో కార్మిక,కర్షక జీవుల బ్రతుకులు చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. మధ్య తరగతి బ్రతుకులు మరింత దుర్భరం కావచ్చు. ఇలాంటి పరిస్థితులను నిలువరించాలి. పనిలో బాధ్యతా రాహిత్యం విడనాడాలి.
1886 వ సంవత్సరం, మే 1 వ తేదీన అమెరికాలోని చికాగోలో హేమార్కెట్ స్క్వేర్ కాల్పుల్లో అమరులైన కార్మిక వీరుల స్మృత్యర్ధం జరుగుతున్న మేడే, శ్రమైక జీవన సౌందర్యంలో గల నిజమైన సంపదకు, కష్టించే తత్వానికి పునాది కావాలని ఆశిద్ధాం.చట్టబద్దమైన హక్కులతో కూడిన శ్రామిక ప్రపంచాన్ని నిర్మించాలి. ప్రజల ఆర్ధిక స్థితిగతుల మెరుగుదల కోసం బాధ్యతాయుతమైన శ్రమశక్తి అవసరం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయి, ఆర్థిక మాంద్యంతో అట్టుడికి పోతున్న నేపథ్యంలో తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, రైతులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రతీ ఒక్కరూ బాధ్యతా యుతంగా, శక్తివంచన లేకుండా పనిచేయాలి. ప్రైవేటు రంగాలు ఎప్పుడూ లాభాల గురించే ఆలోచిస్తాయి . తప్ప, ప్రజల శ్రేయస్సును గురించి ఆలోచించవు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ప్రజల శ్రేయస్సును గుర్తించి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడంలో ప్రతీ ఒక్కరూ రాజకీయాలకతీతమైన ధోరణి అవలంభించాలి.





