– గురుకుల విద్యార్థిని ప్రవళికను అభినందించిన మంత్రి అడ్లూరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: చైనాలోని ఓర్డోస్‌లో నిర్వహించిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4I400 మీటర్ల రిలే పోటీలో భారత జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం పట్ల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సచివాలయంలోని తన చాంబర్‌లో నారిమల్ల ప్రవళికను మంత్రి శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకుల క్రీడా అకాడమీ విద్యార్థిని నారిమల్ల ప్రవళిక సభ్యురాలిగా నిలిచి దేశ ప్రతిష్ఠను ప్రపంచ వేదికపై మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం అభినందనీయమని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా డిండి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక సాధారణ కుటుంబం నుంచి అంతర్జాతీయస్థాయి అథ్లెట్‌గా ఎదిగి దేశానికి స్వర్ణ పతకాన్ని అందించడమే కాక తెలంగాణ యువతలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. ఆమె విజయం గ్రామీణ ప్రాంతాల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందనడానికి నిదర్శనమని అన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో విద్యతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రపంచస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.గ్రామీణ ప్రాంతాల నుంచి ఒలింపిక్ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించే రాష్ట్ర క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 స్థాయి ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం యువ క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని మంత్రి తెలిపారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం రాష్ట్రంలో క్రీడా సంస్కృతికి మరింత బలాన్ని చేకూర్చి, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో యువతను ముందుకు నడిపిస్తుందని అన్నారు. ప్రవళికను ఈ స్థాయికి తీర్చిదిద్దడంలో విశేష కృషి చేసిన ఆమె కోచ్ పస్పుల పరశురాముడు, డిండి సాంఘిక సంక్షేమ గురుకుల క్రీడా అకాడమీ శిక్షక బృందం, తల్లిదండ్రులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రవళిక సాధించిన ఈ స్వర్ణ విజయం గురుకుల విద్యార్థులకు మాత్రమే కాక రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆసియా క్రీడలు, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్ వంటి అత్యున్నత వేదికలపై మరిన్ని పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి చిరస్థాయి కీర్తి తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు.
గురుకులాల్లో మరో ప్రభంజనం – ‘నీట్’లో మెరిసిన ‘సంక్షేమ’ విద్యార్థులు
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు మరోసారి జాతీయస్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నాయి. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్-2026)లో గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచగా, సుమారు 333మంది విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశాలున్నాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ‘నీట’ ఫలితాలు శుక్రవారం విడుదలైన సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ఈ ఘన విజయం రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న అత్యున్నత ప్రాధాన్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల విద్యార్థుల జీవితాలను మార్చగలిగే శక్తి విద్యకే ఉందనే దృఢ విశ్వాసంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. నాణ్యమైన విద్య, అత్యాధునిక మౌలిక వసతులు, సబ్జెక్ట్ నిపుణులతో ప్రత్యేక శిక్షణ, డిజిటల్ లెర్నింగ్, పోటీ పరీక్షలకు ప్రత్యేక అకాడమీలు, ఉచిత నివాసం, పోషకాహారం, నిరంతర అకడమిక్ పర్యవేక్షణ వంటి చర్యల ఫలితంగానే గురుకుల విద్యార్థులు జాతీయస్థాయిలో అద్భుత విజయాలు నమోదు చేస్తున్నారని మంత్రి వివరించారు. విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, సిబ్బంది సంక్షేమం, అవసరమైన సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం నిరంతరం సహకరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. వైద్య విద్యలో ప్రవేశం పొందáబోతున్న ప్రతీ విద్యార్థికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారు ఉత్తమ వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. గురుకుల విద్యార్థులు దేశవ్యాప్తంగా అత్యున్నత స్థానాల్లో నిలిచి రాష్ట్రానికి మరింత గౌరవాన్ని తీసుకురావాలన్నారు. ఈ అద్భుత ఫలితాల సాధనలో కీలక పాత్ర పోషించిన సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి విజయేంద్ర బోయి, టీజీఎస్‌డబ్ల్యూఆరఈఐఎస్ కార్యదర్శి కంభంపాటి శారద, జాయింట్ సెక్రటరీ(అకాడమిక్) సక్రు నాయక్, అదనపు కార్యదర్శులు, అకడమిక్ విభాగం అధికారులు, ప్రాంతీయ సమన్వయ అధికారులు, నాన్-కోఆర్డినేటింగ్ అధికారులు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, కోచింగ్ బృందాలు, బోధనేతర సిబ్బందిని మంత్రి అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





