1958 లో వరంగల్ లో జన్మించిన రామారావు అదే వరంగల్ లోని అనంత లక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో బి ఎ ఎమ్ ఎస్ కోర్స్ చదివి డాక్టర్ రామారావయ్యాడు. మెడిసిన్ చదువులో గోల్డ్ మెడలిస్ట్! సంస్కృత భాషలో మంచి పట్టు సాధించాడు. తండ్రి పాములపర్తి సదాశివరావు నుండి పుణికి పుచ్చుకున్నాడేమో కర్ణాటక సంగీత పరిజ్ఞానం కొంత ఏర్పడింది. చదువుకున్నప్పుడే తమ కాకతీయ ప్రింటింగ్ ప్రెస్ పనులు (కంపోజింగ్, ట్రెడిల్ మెషిన్ ఆపరేషన్) నేర్చుకున్నాడు. కష్ట పడ్డాడు. చదువులో దిట్ట అనిపించుకున్నాడు.
పీ వీ గారిలో ఒక గుణముండేది. కష్టపడి చదువుకొని చదువులో మెరిట్ సాధించే వాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన మెరిట్ విద్యార్ఠి కదా? ఇకపోతే ఆయన అమితంగా ఇష్టపడే శాస్త్రీయ సంగీతంలో డాక్టర్ రామారావు కూడా ఓనమాలు దిద్దాడు కదా? ఇంకొకటి రామారావుకు తన తండ్రి లాగా నిక్కచ్చి గా నిజాయితితో మాట్లాడటం, డొంక తిరుగుడు వ్యవహారాలకు ఆమడ దూరంలో వుండటం అలవాటు. పీ వీ మెచ్చిన అన్ని గుణాలు కలిగి యున్న రామారావు ఆయనకు మానసికంగా దగ్గరయ్యాడంటే విచిత్రమేముంది? ఐతే ఈ విషయాలు ఆయనకు తెలియడం కూడా గమ్మత్తుగా జరిగింది. దాన్నే’’ విధి లిఖితం’’ అనవచ్చు.
1980 వ దశకం. బి ఎ ఎం ఎస్ కోర్స్ పూర్తై డాక్టర్ అయ్యాక రామారావు తాను ఇంటికి భారంగా వుండకుండా ఏమైనా సంపాదించాలను కున్నాడు. కాని అప్పుడే విద్యార్ఠి దశనుండి వచ్చాడు కాబట్టి వెంటనే వుద్యోగం కానీ, తాను ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కానీ లేదు. అదే టైం లో మహర్షి మహేష్ యోగి ఢిల్లీ లో యోగ ధ్యాన కేంద్రంలో ఒక కోర్సును స్టార్ట్ చేశారు. మన వాడికి కూడా కొంత ఆధ్యాత్మిక ఆలోచనా ధోరణి వుంది కావచ్చు. ఆ కోర్సులో జాయిన్ కావడానికి ఢిల్లీ చేరాడు, అప్పటి విదేశాంగ మంత్రి పీ వీ గారిని కలిశాడు. ఆయన ఇంట్లోనే మకాం ఏర్పరుచుకున్నాడు. దాదాపు మూడు నాలుగు నెలలు అక్కడే నివాసం. అసలే ఆయన మహా మేధావి పీ వీ గారాయె! ఒక్క రోజులోనే రామారావు గురించి మొత్తం గుణ గణాల స్కానింగ్ రిపోర్ట్ రికార్డ్ చేసింది ఆయన మెగా కంప్యూటర్ బ్రెయిన్. ఆయన అనురాగ వీక్షణల కనుకూల జాబితాలో రామారావు పేరు మొదటి పది స్థానాల లో ఒకటైంది.
ఆ చేతి వేళ్ల మహిమ- ఒక్క సిట్టింగ్‌తో నొప్పి మాయం
తర్వాత సాయంత్రం ఆయన ఫ్రీ గా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణా కార్యక్రమం లో రామారావు వైద్య విజ్ఞానం ఆయన గ్రహించ గలిగారు. అంతే కాక రామా రావు సూచించిన కొన్ని ఆయుర్వేద మందులను ఆయన వాడటమే కాకుండా రామారావుతో వాటి గురించి వివరణలను అడిగి తెలుసుకునే వారు. ఇంకా రామారావు ముఖస్తుతి అలవాటులేకుండా నిజాయితీతో నిక్కచ్చిగా మాట్లాడటం ఆయనకు బాగా నచ్చింది. మొత్తానికి ఆయన మనస్సుకు మరింత దగ్గరయ్యాడు మన వాడు. పదవ స్ఠానం నుండి పైకి ఎగబ్రాకాడు. మూడు, నాలుగు నెలల తర్వాత మహెష్ యోగి యోగ ధ్యాన ఆకర్షణల నుండి బయట పడ్డాడు మనవాడు. మళ్ళీ వరంగల్ చేరాడు. ఈ లోపల తిరువనంతపురం ఆయుర్వేద కాలేజీలో ఎమ్ డీ లో సీట్ వచ్చింది. కేరళకు వెళ్ళాడు. చదువులో మనవాడు మిన్న కదా? త్వరలోనే అక్కడి ప్రొఫెసర్ల మెప్పు పొందాడు.
అక్కడ జరిగింది ఒక విచిత్ర సంఘటన. ఒక రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక మిలిటరీ అధికారి కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గరకు వచ్చి ‘రామారావు ను తీసుకొని పోవడానికి వచ్చానని, అతన్ని పిలిపించమని’’ అడిగాడు. ఎందుకో చెప్పలేదు. ప్రిన్సిపాల్ కు, అక్కడె వున్న ఇతర ప్రొఫెసర్ల కు ఏదో సంశయం – సందేహం? ‘మన వాడేమన్నా వారితో తప్పుగా ప్రవర్తించాడా?’ అని. సరే, రామారావును పిలిపించారు. అతన్ని అడిగితే ‘తానేం తప్పుగా ప్రవర్తించలేదని చెప్పాడు. మొత్తానికి మన వాడు ఆ అధికారితో బయటకు వచ్చి ఇద్దరూ మిలిటరీ జీప్ ఎక్కారు. జీప్ కదిలాక ఆ అధికారి చెప్పాడు- ‘‘ డిఫెన్స్ మినిస్టర్ గారు తిరువనంతపురం వచ్చారు. మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు’’ అని. ఆ రక్షణ మంత్రి ఎవరో కాదు పీ వీ గారే! తర్వాత పీ వీ గారి కి కావలసిన ఆయుర్వేద మందులు మన వాడు రాసివ్వడం, ఆయనతో బాటు భోజనం కానిచ్చి మళ్ళీ మిలిటరీ జీపులో కాలేజీకి చేరడం, ఆదుర్దాగా వున్న ప్రిన్సిపాల్ కు, తన క్లాస్ మేట్స్ కు సుఖాంతమైన తన రాచ మర్యాదల పయనం గురించి చెప్పడం జరిగింది.
మోబైల్ ఫోన్ లు వచ్చాక పీ వీ గారితో నేరుగా మాట్లాడే సన్నిహితం వున్న వ్యక్తి రామారావు. ఐతే తండ్రి లాగానే పీ వీ గారికి అనవసర విషయాలు చెప్పేవాడు కాదు. ఇక రామారావు పై తండ్రి సదాశివ రావు గారి అనేక ఉదాత్తాశయాల ప్రభావం ఎంతైనా వుంది. ధన్వంతరి ఆశీస్సుల మ్యాజిక్ ఫింగర్స్- డాక్టర్ రామారావు వైద్య విధానం లో వారి చేతి వ్రేళ్ళతో సియాటికా, మెడ నొప్పి. మోకాళ్ళ నొప్పి మొదలగు వాటిని అతి సులువుగా త్వరితంగా నయం చేయడమన్నది పై ఇద్దరు పెద్దల ఆశీర్వాద బలమే! ఆ చేతి వ్రేళ్ళ కిటుకును ‘ పాములపర్తి టెక్నిక్’’ అనో, ‘‘డాక్టర్ రామూస్ టెక్నిక్’’ అని సంబోధిస్తే బాగుంటుందని భావిస్తున్నాము.
నొప్పితో చేయి పైకి లేపలేని పరిస్థితి నుండి ఈ డాక్టర్ దగ్గరికి వచ్చిన వ్యక్తి ఒకే సిట్టింగులో చేతిని పైకి లేపుకొని అమిత సంతోషంగా తిరిగిపోయిన సందర్భాలున్నాయి. అదే విధంగా మెడ పట్టీ అంటే మరిచిపోయేట్టుగా స్పాండిలైటిస్ లేకుండా చేయడం ఆ చేతి వేళ్ళ కిటుకు. డాక్టర్ గారి దగ్గర ట్రీట్ మెంట్ తీసుకొ న్న ఎందరో బాధాతప్తులు, బాధా విముక్తులవడమే కాకుండా డాక్టర్ గారి గురించి సన్నిహితులకు, చుట్టుపక్కల వారికి ఎంతో గొప్పగా చెప్పడం వల్ల దాదాపు 10 ఏండ్ల క్రితమే ఆయన పేరు రాష్ట్రంలోనే కాకుండా ప్రక్క రాష్ట్రాలైన తమిళ నాడు, కర్ణాటక, మహారాష్ట్ర. చత్తీస్ ఘడ్, ఒరిస్సా మొదలగు ప్రాంతాలకు గూడా విస్తరించి అక్కడినుండి గూడా చికిత్సకు వచ్చేవారు. రోజుకు దాదాపు నాలుగు వందల మంది దాకా చికిత్స పొందే వారు.ఈ మధ్య ఎంతో మందికి డాక్టర్ రామారావు వైద్య నైపుణ్యత, ఆచేతి వేళ్ళ టెక్నిక్, దీర్ఘ కాలంగా వున్న నొప్పుల సంపూర్ణ నివారణ అవగతమైంది. ఎంతో ఖర్చుతో కూడి ఒక్కొక్క సారి ఆపరేషన్ అవసరమయ్యే నొప్పి వ్యాధులకు ఏవిధమైన ఫీజ్ తీసుకోకుండా ఉచిత వైద్యాన్ని అందించి అతి త్వరలో నివారణ చేయడం వల్ల డాక్టర్ గారి దగ్గరకు వచ్చే జనాల రద్దీ ఎక్కువైంది. దీనివల్ల డాక్టర్ గారికి అత్యంత శ్రమ కలగడమే కాకుండా ఆయనకు తగినంత విశ్రాంతి దొరకడం లేదు.
ధన్వంతరీ ఆశీస్సులు పొందిన ఆయన మ్యాజిక్ ఫింగర్స్ మరెందరినో నొప్పి బాధల నుండి విముక్తి చేయాలని ఆశిస్తూ ‘‘భళి భళి భళి భళి రామా, బాగున్నదయా నీ సేవా…’’ అని మనస్ఫూర్తిగా అబినందిస్తూ ఆ క్లినిక్ మేనేజ్ మెంట్ వారు డాక్టర్ రామారావుకు అనవసరపు అధిక శ్రమ కలుగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
పాములపర్తి నిరంజన్ రావు