నాణ్యమైన విద్యా బోధన జర్మనీ రాజకీయ సంకల్పం

ఫిబ్రవరి నెలలో నా జర్మనీ ప్రయాణంలో జర్మనీ విద్యా విధానం గురించి  భారత సంతతికి చెందిన పదో తరగతి విద్యార్థి చి.అఖురాత్‌  తో నా సంభాషణ. అక్కడి విద్యా విధానం పాఠశాల బోధన  పద్దతి మొదలగు ఆసక్తికర అంశాలు :

వెంకట రెడ్డి :. హాయ్‌ అఖురాత్‌. నీవు నీ  బాల్య  దశ నుంచి జర్మనీలో చదువుకున్నావు కదా. ఇప్పుడు పదో తరగతిలో ఉన్న నీవు ఈ దేశ పాఠశాల విద్యావిధానం గురించి మాట్లాడుదామా..?
అఖురాత్‌: ఎస్‌.. తప్పకుండా. నేను జర్మనీ దేశంలోని బ్రాంచ్‌విగ్‌ అనే పట్టణం లో జన్మించాను.  మా పేరెంట్స్‌ వినత, సురేందర్‌ రెడ్డిలు ఇద్దరు సిమెన్స్‌ అనే అంతర్జాతీయ కంపనీ లో పని చేస్తారు. నేను కేజి నుంచి ఇక్కడే చదివాను.

వెంకట రెడ్డి:. ఏ వయసు నుంచి పాఠశాలలో ప్రవేశం ఉంటుంది.
అఖురాత్‌:  మూడు నెలల నుంచి మూడు  సంవత్సరాల పిల్లలకు ప్రత్యేక శిక్షణ పొందిన డె కేరె సెంటర్స్‌  ఉంటాయి. దీనికి ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది. కొన్ని సార్లు ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తారు లేదా శిక్షణ పొందిన  తల్లులలో ఒకరు కూడా నిర్వహించవచ్చు.  ఇంకా వివరంగా చెప్పాలంటే నర్సరీ/డె కేర్‌ సెంటర్లు: 0  – 5 సంవత్సరాల పిల్లలకు, ఇది తప్పని సరి కాదు కానీ అత్యధిక శాతం పిల్లలు ఈ సెంటర్లకు వెళుతుంటారు. మామూలుగా మూడు, నాలుగు సంవత్సరాలప్పుడు ఈ సెంటర్లలో చేరుతుంటారు. కొంత నేర్చుకోవడం, ఇతర పిల్లలతో కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంటారు. ఇవి  నాలుగు రకాల సెంటర్లు ఉంటాయి. డె కేర్‌ , కేజీ, ప్రాథమిక విద్యకు ఇంకా అందుకోలేని మానసిక స్థితి ఉంటే వారికోసం పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తాయి.

వెంకట రెడ్డి: మూడేళ్లు నిండిన పిల్లలకు ఎటువంటి విధానం ఉంది.
అఖురాత్‌:  మూడు సంవత్సరాలు నిండిన పిల్లలు తప్పనిసరిగా కిండర్‌ గార్టెన్‌ ( కేజీ )తరగతులకు వెళ్లాలి. ఇది 3 – 6 సంవత్సరాల వయసు పిల్లల కోసం. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడుస్తుంది. ఈ ప్రవేశాలకు ఆ వయసు పిల్లల తల్లిదండ్రులకు  ప్రభుత్వమే ఒక లేఖ పంపుతుంది. దానితో పాటు పరిసరాల్లో ఉన్న కేజీ  పాఠశాలల లిస్ట్‌ పంపుతుంది. కొన్ని సార్లు తమతో పనిచేసే ఉద్యోగుల వెసులుబాటు కోసం ఆయా కంపనీ లు కూడా నిర్వహిస్తాయి.. ఈ పాఠశాలలలో కంపెనీ ఉద్యోగుల పిల్లలకు 60 శాతం సీట్లు ఇతరులకు 40 శాతం సీట్లు కేటాయిస్తారు. ఇక్కడ ప్రభుత్వం పిల్లల పోషణకు  ప్రతి నెల 250 (22 వేల రూపాయలు ) యూరోలో ఆర్థికసాయం అదిస్తుంది.

వెంకట రెడ్డి: చాలా మంచి సిస్టమ్‌ ఉంది 6 సంవత్సరాల లోపు పిల్లలకు. ఆ పైన ఎలా ఉంటుంది విధానం..
అఖురాత్‌: ప్రైమరీ స్కూల్‌ 6 నుంచి 9 సంవత్సరాల పిల్లలకు. ఒకటి నుంచి నాలుగు తరగతులు. ఈ వయసు పిల్లలు తప్పనిసరిగా స్కూల్‌ వెల్లవలసిందే.  ప్రైమరీలో చేర్చడానికి పూర్వ ప్రాథమిక విద్య నుంచి ప్రాథమిక పాఠశాలలకు విద్యార్థులు రావడానికి సుగమం చేస్తుంది. ఆరు సంవత్సరాలు నిండిన పిల్లల తల్లిదండ్రులకు ప్రవేశాల గురించి స్థానిక  విద్యా శాఖ లేఖ రాస్తుంది. ఆరు సంవత్సరాలు నిండిన పిల్లలకు మాత్రమే ప్రవేశాలు ఉంటాయి. అంటే 30 సెప్టెంబర్‌ వరకు 6వ జన్మ  దినం జరుపుకుని ఉండాలి. ( 6ం ). ఆరు సంవత్సరాలకు కొన్ని నెలలు తక్కువ ఉన్నట్లయితే మానసిక నిపుణులను సంప్రదించాలి. వారు మొదటి గ్రేడు కు వెళ్లే  స్థాయికి వెళ్లగలరా లేదా అని ధ్రువీకరించిన తర్వాతేప్రవేశం కల్పిస్తారు. నా విషయంలో అదే జరిగింది. నాకు 6 సంవత్సరాలు నిండడానికి మూడు నెలలు తక్కువగా ఉండే. నన్ను పరిశీలించి ధ్రువీకరించారు. పరీక్ష లాంటిది ఉండదు. కానీ ఆటల రూపంలో అడిగి తెలుసుకుంటారు విషయ పరిజ్ఞానం ఎంత ఉంది అని. ప్రాథమిక పాఠశాల ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు ప్రాథమిక స్థాయి అంటారు.

 వెంకట రెడ్డి: బోధన ఎలా ఉంటుంది. టెక్స్ట్‌ బుక్స్‌ గురించి చెప్పండి.
అఖురాత్‌: చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలకు స్కూల్‌ బస్‌ అనే కాన్సెప్ట్‌ లేదు. తమ పరిసరాలలో ఉన్న పాఠశాలలకే వెళ్లాలి. ప్రజా రవాణాలో వెళ్లాలి. నివాసాలకు దగ్గరలోనే  స్కూల్‌ ఏర్పాటు చేస్తారు. కొత్త కాలనీ వొస్తుందంటే అక్కడ  స్కూల్‌ గురించి, పిల్లల ఆట స్థలం పార్కుల గురుంచి మొదలు ఆలోచిస్తారు. స్థలం తప్పనిసరిగా కేటాయించాలని ఇక్కడ స్థానిక ప్రభుత్వం ప్రణాళిక వేస్తుంది.  అప్పుడే పర్మిషన్‌ ఇస్తారు. అందుకే స్కూల్స్‌ ఆవాసాల దగ్గరలోనే  ఉంటాయి. విద్యార్థులకు ప్రజా రవాణా ఉచితం. దాదాపు ఏ విద్యార్థి కూడా రెండు కిలోమీటర్ల పరిధి దాటి ప్రయాణం చేయరు. ఆ లోపలనే  ప్రాథమిక పాఠశాల ఉంటుంది. పుస్తకాలు ఇక్కడ ప్రతి సంవత్సరం కొనడం ఉండదు. స్కూల్‌ నుంచి కొంత రుసుముతో  రెంట్‌ కు తీసుకునే పద్దతి ఉంది.  తరగతి పూర్తి చేసిన తర్వాత స్కూల్‌ కు వాపస్‌ ఇస్తాం. వొచ్చే విద్యార్థులు ఆ పుస్తకాలను వాడుతారు. ఒక్క సారి ప్రింట్‌ చేసినవి నాలుగైదు బ్యాచ్‌లు వాడుతారు. మంచి పద్దతి ఇది. చాలా పేపర్‌ ను ఆదా చేస్తున్నాం. ఈ విధానం ద్వారా చెట్లను కాపాడుతున్నాం. విద్యతో పాటు ఈ స్థాయిలోనే మామ్మల్ని దగ్గరలో ఉన్న కార్ఖానాలకు ,రైతుల దగరకు, చారిత్రాత్మక కట్టడాలకు తీసుకుని వెళతారు. మాకు దాదాపు 8 నుంచి 9 సబ్జెక్ట్స్‌ ఉంటాయి. నాలుగో తరగతిలో సైకిల్‌ నడిపే శిక్షణ ఇస్తారు. స్విమ్మింగ్‌, స్పోర్ట్స్‌ తదితర అంశాలను పిల్లల అభిరుచిని బట్టి నేర్పిస్తారు.

వెంకట రెడ్డి: చాలా బాగుంది. ఇక హైస్కూల్‌ గురించి చెప్పండి.
అఖురాత్‌:  హైస్కూల్‌ విద్య కొంత కాంప్లికేటెడ్‌ గా ఉంటుంది.  5 నుంచి 13 వ తరగతి వరకు హైస్కూల్‌ అంటారు. హైస్కూల్‌ విద్యార్థులు నాలుగు రకాల  స్ట్రీమ్స్‌  ఉంటాయి. ఉన్నత విద్యను కొనసాగడానికి యునివర్సిటీ విద్య పట్ల ఆసక్తి ఉన్నవారు, ఇంకా కొంచెం తక్కువ ఆసక్తి ఉన్న వాళ్లు, పది వరకే చదివి మిగతా టెక్నికల్‌ కోర్సులకు వెళ్లేవారు. 9వ గ్రేడ్‌ మాత్రమే చదివి స్కిల్స్‌ నేర్చుకునే ఇష్టం ఉన్న వాళ్లు ఇలా నాలుగు రకాల తరగతులు ఉంటాయి. అలాగే చాలా వెసులుబాటుతో కూడుకున్న విధానం కూడా. విద్యార్థులు ఒక  స్ట్రీమ్‌ నుంచి మరో స్ట్రీమ్‌ మారే  అవకాశం కూడా ఉంటుంది. స్కిల్‌  కోర్సు చేసే వాళ్ళు విద్యలో బాగా రాణించి  ఉన్నత విద్యకు పోవడానికి వెసులుబాటు ఉంటు ంది. అనగా హైస్కూల్‌ లో చదవడానికి  నాలుగు రకాల అవకాశాలు ఉంటాయి.  అవి  5 నుంచి 9 వ తరగతి, 5 నుంచి 10 వ తరగతి, 5 నుంచి 13 వ తరగతి (కొంచెం తక్కువ సిలబస్‌ తో) అలాగే 5 నుంచి 13వ తరగతి (ఎక్కువ సిలబస్‌ తో) గా విభజించబడి ఉంటుంది. టెక్స్ట్‌ బుక్స్‌ రెంట్‌ కు ఇస్తారు. కొనడాలచుకునే వారు కొంటారు. చాలా వరకు రెంట్‌కే తీసుకుంటారు.

హైస్కూల్‌ లో 11 వ తరగతి నుంచి 13వ తరగతి వరకు ఒక రెండు సబ్జెక్ట్స్‌ ఎక్స్‌ పర్ట్‌  కోర్సుల కింద తీసుకోవచ్చు. లెక్కలు, సైన్సు, బయో సైన్స్‌, మ్యూజిక్‌, స్పోర్ట్స్‌ ఇలా స్పెషల్‌ కోర్సులు తీసుకోవచ్చు. ముందు ముందు చదవాలనుకునే వారికి ఇది పునాది అవుతుంది. ఇక్కడ పాఠశాలల ప్రత్యేకత చెప్పుకోవాలి. రెండు మూడు తరాలు ఒకే పాఠశాలలో చదువుకుంటారు. ఒకే పాఠశాలలో చదివి ఉద్యోగాలు చేసి తాతలు రిటైర్‌ అవుతుంటే మనుమలు మనుమారాళ్లు అదే  పాఠశాలలో చేరుతుంటారు. కాలానికి అనుగుణంగా పాఠశాలలను తీర్చిదిద్దడమే కాకుండా నాణ్యతా విషయం లో రాజీ పడకుండా తమ దేశ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే రాజకీయ సంకల్పం బాగుంటుంది. ఉదాహరణకు  నేను వెళుతున్న సెకండరీ  పాఠశాల 1907వ సంవత్సరంలో స్థాపించారు. దాదాపు 2000 మంది విద్యార్థులం ఈ పాఠశాలలో చదువుకుం టున్నాం. ఇందులో చదువుకున్న వారు మా తల్లిదండ్రులు పనిచేసే సిమెన్స్‌ కంపెనీ నుంచి రిటైర్‌  కూడా అయ్యారు. దీనిని బట్టి తెలుస్తుంది పాఠశాల విద్య మీద ఇక్కడి ప్రభు త్వాలు అత్యంత శ్రద్ద కనబరుస్తారు.

వెంకట రెడ్డి: చాలా వివరంగా చెప్పావు. పాఠశాలలో ఇంకా ఏమైనా ఆసక్తికర విషయాలు ఉంటే చెప్తావా.
అఖురాత్‌: తప్పకుండా 11వ తరగతిలో ల్యాప్టాప్‌ తప్ప నిసరి. 11వ తరగతి లో భవిషత్తు రోజుగా మూడు వారాలు దగ్గరలోని కంపెనీలకు తీసుకెళ్తారు. అక్కడ పని చేసే విధానం అన్నీ గమనించడానికి ఇది ఉపయోగప డుతుంది. కంపెనీల యాజమాన్యంతో  విద్యా శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇక్కడ పాఠశాలలు ప్రాథమిక స్థాయి నుండే బయటి ప్రపంచాన్ని పరిచయం చేస్తారు. కొన్ని పద్దతులు చాలా బాగుంటాయి.

1.   ప్రాథమిక స్థాయిలో మొదటి సారి ప్రవేశం పొందిన ఒకటో తరగతి విద్యార్థులకు పార్టనర్‌ కిడ్‌ అనే కాన్సెప్ట్‌ బాగుంటుంది. అంటే నాలుగవ తరగతి లో ఉన్న విద్యార్థికి మొదటి తరగతిలో చేరిన విద్యార్థి పార్టనర్‌ చేస్తారు. సీనియర్‌ విద్యార్థి (నాలుగవ) మొదటి తరగతిలో ప్రవేశం పొందిన  విద్యార్థికి అన్నీ రకాల సహాయ సహకారాలు అందిస్తారు. మొదటి తరగతి విద్యార్థి నాలుగో తరగతికి వచ్చినప్పుడు ఆ విద్యార్థి  కూడా ఆ పాత్ర పోషించాలి. దీనినే పార్టనర్‌ కిడ్‌ అంటారు.

2.  ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థులు విద్యా సంవత్సరం చివరలో  తాము వెళ్లబోతున్న హైస్కూల్‌ కు వెళ్లి  ఆ ఉపాధ్యాయులతో మాట్లాడడం వారు కూర్చోబోయే తరగతి గదులను ఆట స్థలాన్ని పరిశీలించడం చేస్తారు. ఇది మంచి సిస్టమ్‌. విద్యా సంవత్సరం మొదలు కాగానే స్కూల్‌ అలవాటు పడడానికి పట్టే సమయం తగ్గుతుంది. అప్పటికే ఆ పాఠశాల ఉపాధ్యాయులు పరిసరాలు తెలిసి ఉంటుంది. 3. క్లాస్‌ టూర్‌ .. కనీసం ఐదు రోజులు ఉంటుంది.  వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి అక్కడే రెండు మూడు రోజులు గడపాలి. రైతులు చేస్తున్న పనులన్నీ గమనించాలి. అలాగే ట్రెక్కింగ్‌  ఉంటుంది, శ్మశాన వాటికలు కూడా వెళ్తాం.

అక్కడి పద్దతులు ఏమిటి అన్నీ వివరాలు తెలుసుకునే వీలు ఉంటుంది. అలాగే ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌ కూడా వెళతాం. వెళ్లిన ప్రతి సారి మా రిపోర్ట్స్‌ రాయాలి. థియేటర్‌ (నాటక) ప్రదర్శనలకు  కూడా వెళ్తాము. ఇక్కడ చారిత్రాత్మక  అంశాల పలు నాటక ప్రదర్శనలు ఉంటాయి. మీరు వొచ్చిన రోజు నేను ఒక ప్రదర్శనకు వెళ్ళాను. ఈ నగరం లో నివసించిన ఒక న్యాయమూర్తి  గురించి  ఆ నాటకం. ఈ న్యాయమూర్తి హిట్లర్‌ కు  ఆయన మిలటరీలో పని చేసిన సైనికులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేశాడు.  చాలా బాగుంది నాటకం.

4.  తల్లిదండ్రుల సమావేశాలు తరచుగా జరుగుతుంటాయి. కమిటీ కూడా ఉంటుంది. ఒక్కే సారి సెలెక్ట్‌ అవుతారు ఒక్కోసారి ఎలెక్ట్‌ కూడా అవుతారు.
ధన్యవాదాలు అఖురాత్‌…  జర్మనీ విద్యా విధానం గురుంచి వివరించినందుకు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page