“ఆ రోజుల్లో నాగ్ పూర్ లో హిందూ మహాసభ వార్షిక సమావేశాలు జరిగితే పీవీ హాజరై వీర సావర్కర్ ను చూడటం, ఆయన భాషణ వినడం జరిగింది. ఇంకో సందర్భంలో అప్పటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చంద్ర బోస్ నాగ్ పూర్ మీదుగా ట్రైన్ లో వెళుతున్నారని విని పీవీ మిత్ర బృందంతో కలిసి ఆయనను ప్లాట్ ఫారం పై ప్రత్యేకంగా సందర్శించడమే కాకుండా పీవీ ఆయన ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు. ఆ రోజుల్లో నాగ్ పూర్ లో జరిగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్య కలాపాలను గూడా గమనించాడు..”
పూర్వ ప్రధాని శ్రీ పీ వీ గారి 105 జయంతి సందర్భంగా బాల్య విశేషాల గురించి మరొక్కసారి:
ఆ రోజుల్లో నాగపూర్ లో ప్రపంచ స్థాయి ఫ్రీ స్టైల్ కుస్తీ పోటీలు జరిగి ఆ పోటీలో అలనాటి మేటి ఉస్తాదులు హర్బన్ సింగ్, కింగ్ కాంగ్, జెబిస్కో, అర్జున్ సింగ్ మొదలగు వారు పాల్గొన్నారట! అవి అత్యంత జనాకర్షణ కలిగి ఎంతో అద్భుతంగా వుండేవట! ఇక పీవీ యువక రక్తం ఊరుకుంటుందా? ఊరికే ఆ కుస్తీ పోటీలను చూసి ఆనందిస్తే ఆయన పీవీ ఎందుకవుతాడు? ఆ కుస్తీల్లో ప్రయోగించే అనేక రకాల ‘లాక్స్ ‘ (పట్లు) నిశితంగా గమనించ డమే కాకుండా వాటి గురించి మిత్రులతో అనేక విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తుండే వాడు. ఇక పోతే ఆ సంవత్సరం పోటీల్లో గెలుపొందిన హర్బన్ సింగ్ పై మోజు పెంచుకున్న పీవీ ఆ ఉస్తాదు శక్తి యుక్తుల గురించి మిత్రులకు లెక్చర్లు గొట్టే వాడట!
ఇక పీవీ కి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం కదా! నాగ్ పూర్ లో కొన్ని మ్యూజిక్ సర్కిళ్ళు ప్రతి ఆదివారం సంగీత సభలు నిర్వహించేవారు. ఇక మన పీవీ అక్కడ క్రమం తప్పని ముఖ్య శ్రోత. ఆ రోజుల్లో కరీంనగర్ కు చెందిన పీవీ మిత్రుడు నారాయణ రావు అనే అతను హిందూస్థానీ సంగీత గాయకుడు. మంచి పేరున్న వాడు, ఆయన కచేరీలు కూడా సాగేవట, ఇక పీవీ హాజర్ కాకుండా వుంటాడా? వీటితో బాటు మామూలు తిరుగుళ్ళు ఎలాగూ వున్నాయి. ప్రతి వారం జరిగే సంత లకు హాజరు కావడం అక్కడ దొరికే అన్ని రకాల తినుబండారాల రుచి చూడటం, కారు చౌకగా దొరికే నాణ్యమైన సంత్రా పండ్ల నాస్వాదించడం మామూలే.
ఆ రోజుల్లో నాగ్ పూర్ లో హిందూ మహాసభ వార్షిక సమావేశాలు జరిగితే పీవీ హాజరై వీర సావర్కర్ ను చూడటం, ఆయన భాషణ వినడం జరిగింది. ఇంకో సందర్భంలో అప్పటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చంద్ర బోస్ నాగ్ పూర్ మీదుగా ట్రైన్ లో వెళుతున్నారని విని పీవీ మిత్రబృందంతో కలిసి ఆయన్ను ప్లాట్ ఫారం పై ప్రత్యేకంగా సందర్శించడమే కాకుండా పీవీ ఆయన ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు. ఆ రోజుల్లో నాగ్ పూర్ లో జరిగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్య కలాపాలను గూడా గమనించాడు. నాగ్ పూర్ విశ్వ విద్యాలయం జిడ్డు కృష్ణమూర్తి గారి తాత్వికోపన్యాసాలు కొన్ని రోజుల పాటు నిర్వహిస్తే పీవీ తన ముఖ్య సహచరులతో అన్ని రోజులూ హాజర్. కృష్ణమూర్తి గారి భావాలు పూర్తిగా అర్థంకాకున్నా ఆయన భాషా వైదుష్యానికి అబ్బుర పడ్డాడు.
పీవీ. పీవీ నాగ్ పూర్ లో వున్నప్పుడే మధ్య ప్రదేశ్ లో “త్రిపురి” కాంగ్రెస్ మహా సభలు జరిగాయి. జబల్పూర్ దగ్గరి త్రిపురిలొ జరిగిన ఆ మహాసభలకు గాంధీజీ, సుభాష్ బాబు, పండిట్ నెహ్రూ మున్నగు ప్రముఖ నాయకులు వస్తున్నారని ప్రచారం జరిగి ఆ సభలకు దేశం నలుమూలల నుండి లక్షలమంది అరుదెంచారు. పీవీ కూడా ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. దాదాపు 300 కిలోమీటర్ల దూరం వున్న జబల్పూర్ దగ్గరి త్రిపురి కి తన సన్నిహిత మిత్రులతో చేరాడు. లక్షలాది జనాలను జూచి అచ్చెరువందాడు. ఇంకా ఆ సభల్లో నాయకుల మధ్య జరిగిన తీవ్ర భావ సంఘర్షణ, ఉద్రేకపూరిత చర్చలు, స్లోగన్లతో ప్రచారాలు, వాలంటీర్ల కవాతులు, ఆటల పోటీలు, కోలాటాలు చూచిన పీ వీ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ‘భారత దేశమే ఇక్కడ ప్రత్యక్షమయిందా!‘ అని మిత్రులతో తన మనస్సులోని భావాలను పంచుకున్నాడు. అక్కడ పంచిపెట్టిన అనేక కరపత్రాలను, రక రకాల ప్రచార ప్రకటన పేపర్లను ఉత్సాహంగా సేకరించాడు. ఐతే ఆ సమావేశానికి గాంధీజీ రాక పోవడం, సుభాష్ బాబు అస్వస్థతగా వుండటం కొంత నిరుత్సాహాన్ని కలుగజేసినా ఆ మహాసభలకు హాజరవడం ఒక మధురానుభూతిగా భావించాడు పీవీ.
సభలు ముగిసాక, త్రిపురి నుండి నాగ్ పూర్ తిరుగు ప్రయాణంలో జబల్పూర్ లో నాలుగు రోజుల మకాం వేశాడు పీవీ. సమీపంలోని “భేడాఘాట్”ను సందర్శించాడు. అక్కడి పాలరాతి కొండలూ, వాటి మధ్యగా ప్రవహించే నర్మదా నది సొంపులూ తిలకించి తన్మయం చెందాడు. జబల్పూర్ పట్టణం వెనుకబడినదనం, అక్కడి మురికి వాడలు గమనించాడు. పీవీ జబల్పూర్ లో వున్నప్పుడే అక్కడ మతకలహాలు జరిగి దాని చేదు అనుభవం కొంత పీవీ కి కూడా తగిలినట్లు తెలిసింది. నాగ్ పూర్ చేరగానే క్లాసులు ప్రారంభమయ్యాయి. చదువుల్లో ఎప్పుడూ పీవీ ప్రధముల్లో ప్రధముడు. మొత్తానికి ఇంటర్మీడియేట్ పూర్తయింది. తరువాత బి ఎస్ సి చదవడానికి పీవీ పూనా పయనం. ఐతే మరో విశేషమేమంటే నాగ్ పూర్ వదిలేనాటికి పీవీలో బాల్యచేష్ట లంతరించి పెద్దమనిషి పోకడలు మొదలయ్యాయి. ఆలోచనా ధోరణి కూడా కొత్త రూపు దిద్దుకోసాగింది.
పూణే అనుభవాలు: పీవీ పూణా చేరి ఫర్గూసన్ కాలేజీలో బీ ఎస్ సీ కోర్సులో చేరాడు. పూణా కూడా నాగ్ పూర్ వలె మహారాష్ట్ర సంస్కృతికి కేంద్రం. అంతే కాకుండా బొంబాయి పాశ్చాత్య నాగరికత ప్రభావం నాగ్ పూర్ కంటే పూణా మీద అధికం. పూణా లోని దక్కన్ యెడ్యుకేషనల్ సొసైటీ, భండార్కర్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ మొదలగు ప్రతిష్ఠాత్మక సంస్థల పనితీరును, అక్కడ సాగే నిరంతర నిర్మాణాత్మక పనులను అధ్యయనం చేసాడు. ఇక సాహిత్య, సంగీత కళా రంగాల మీద మక్కువ గల పీవీ పూణా లోని ప్రముఖ రచయితలు, పాత్రికేయులు, కవులు, కళాకారులు, సంగీత విద్వాంసులు, చిత్ర నిర్మాతల పేర్లను సంపాదించి జాబితా తయారు చేసుకున్నాడు. ప్రముఖ కవుల, రచయితల, పాత్రికేయుల రచనలను చదవడమే కాకుండా వాటిపై పరిశీలనాత్మక, విమర్శనాత్మక అభిప్రాయాలు వెలిబుచ్చేవాడు. ఇక ప్రముఖ కళాకారుల మరాఠీ నాటకాలను, చిత్ర నిర్మాతల సినిమాలను చూసి మెచ్చుకోవడం, కొన్ని సందర్భాలలో వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు చేసేవాడు. ఇక హిందూస్థానీ సంగీతమంటే అతి మక్కువ గల పీవీ పూనాలో ఎన్నో సంతృప్తికర సంగీత కార్యక్రమాలు హాజరు కాగలిగాడు.
పీవీ పూణా చేరిన సమయం లోనే రెండవ ప్రపంచ యుద్ధం మొదలయింది. జాతీయ నాయకుల ప్రసంగాలలో యుద్ద్గ వ్యతిరేక వైఖరి ప్రస్ఫుట మయ్యేది. అదే సమయంలో సుభాష్ చంద్ర బోసు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ప్రజల మధ్య చర్చనీయాంశం ఐంది. అప్పుడే ‘పీపుల్స్ ఏజ్‘ అనే వార పత్రిక ప్రారంభమైంది. దాని కొన్ని సంచికలను చదివిన పీవీలో పత్రికా రచన, పత్రిక ప్రచురణ మీద మక్కువ పెంచుకొని వివిధ పత్రికలను విమర్శనాత్మక దృష్టితో చదవడం సాగించాడు. ప్రఖ్యాత ఆంగ్ల విమర్శకుల, నాటకకర్తల, ఇతర మేధావుల రచనలను చదివాడు. చార్లీ చాప్లిన్, వాల్ట్ డిస్నీ, పికాసో, ఐన్ స్టీన్, సీ వీ రామన్ లాంటి మహోన్నత మేధావుల గురించి అధ్యయనం చేసాడు. బాల్య చాపల్యం తొలగిపోతూ మేధస్సు నిర్ణయాత్మక ఆలోచనా ధోరణులను స్థిరీకరించే ఆ కౌమార వయస్సులో పూణా లో పీవీ చేసిన వివిధ అధ్యయనాలు ఆయన జ్ఞాన సంపత్తి పెరుగుదలకు బాటలు వేసాయి అని అనుకోవచ్చు.
(మిగతా రేపటి సంచికలో )





