– నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు మంత్రి వాకిటి శంకుస్థాపన
మక్తల్, ప్రజాతంత్ర, జూలై 28 : చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ముడుమాల్ గ్రామంలో ఉన్న చారిత్రక నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతోపాటు పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నిలువురాళ్ల పార్కును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, సందర్శకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ పనులు పూర్తయితే నిలువురాళ్ల పార్కుకు మరింత గుర్తింపు లభించడంతోపాటు పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్ మాట్లాడుతూ ముడుమాల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణం అని, యూనెస్కో శాశ్వత గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్లు నిలువు రాళ్ళ పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. యునెస్కో శాశ్వత గుర్తింపు కోసం కొన్ని సూచనలు ఇచ్చారని, వాటిని పాటించి గుర్తింపు పొందేలా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదివరకే మంత్రి వాకిటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని, ఇందుకు తగిన వసతులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని 400 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి దాదాపు 60 వేల మంది విద్యార్థులు మూడుమాల్ నిలువు రాళ్ళను సందర్శించేలా చర్యలు తీసుకోవాలని వేదకుమార్ అన్నారు. 20 మంది టూరిస్ట్ గైడ్లను ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రజలు భాగస్వాములై ఇక్కడి విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేలా అవగాహన పెంచుకోవాలన్నారు. శాస్త్ర విజ్ఞానం రాకముందే మూడు వేల సంవత్సరాల క్రితం నిలువురాళ్ల రూపంలో నక్షత్ర మండలాన్ని రూపొందించారని తెలిపారు. మనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో విశిష్టతను చాటేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





