ప్రజా పాలనలో సౌర క్రాంతి

– గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ
– సాగుతోపాటు అదనపు ఆదాయమే ప్రభుత్వ లక్ష్యం
– తడిసిన ధాన్యాన్ని కొంటాం
– రైతు కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ ధ్యేయం
– హరీష్ రావు గారూ.. కట్టుకథలు మానండి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బోనకల్లు, ప్రజాతంత్ర, మే 28 : రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ హిత ఇంధన వనరులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గర్లపాడు గ్రామంలో గురువారం మీడియాతో మాట్లాడారు. అంతకుముందు చిన్నబీరవల్లి గ్రామంలో మోడల్ సోలార్ విలేజ్‌లో భాగంగా ఇంటింటి పైకప్పుపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తును ప్రారంభించారు. తరువాత గార్లపాడులో రైతు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసుకున్న సోలార్ పంపుసెట్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటగా బోనకల్, కొడంగల్ మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద సంపూర్ణ సోలరైజేషన్ మండలాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ పంప్ సెట్ల పనితీరును పరిశీలించారు. ఇవి కేవలం నీటిని అందించడమే కాక మిగులు విద్యుత్ ద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తాయని డిప్యూటీ సీఎం చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల కరెంటు ఖర్చు తగ్గడమే కాక నెలవారీగా రూ.500 వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు. రెడ్కో సంస్థ రూపొందించిన ప్రత్యేక సోలార్ షెడ్లను ఆయన అభినందించారు. ఇవి పొలాల్లో విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాక రైతులకు విశ్రాంతి గదులుగా, సామగ్రి దాచుకునే షెడ్లుగా ఉపయోగపడతాయన్నారు. రైతులకు సాగుతోపాటు విద్యుత్ ద్వారా ఆదాయం రావాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆ సంకల్పంతోనే ప చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. బోనకల్ మండలంలో రూఫ్ టాప్ సోలార్ పనులు 40% నుంచి 50% వరకు పూర్తయ్యాయన్నారు. అగ్రికల్చర్ పంప్‌సెట్ల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపారు. తెలంగాణను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా ఈ ప్రాజెక్టులు మైలురాళ్లుగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత

ఎర్రుపాలెం మండలంలోని వెంకటాపురం గ్రామంలో మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ ప్లాంట్ల నిర్వహణ, యాజమాన్య బాధ్యతలను మహిళలే చూసుకుంటూ స్వయం సమృద్ధి సాధించేలా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా మహిళా సంఘాలకు ఏడాదికి రూ.4.5 నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో రెండు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఇందిరా మహిళా శక్తి సంఘాలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

మోడల్ సోలార్ గ్రామాలు

రాష్ట్రంలో దాదాపు 81 గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా ప్రకటించగా అక్కడ పనులు వేగంగా చేపడుతున్నారు. రైతులు, గృహ వినియోగదారులు ఈ సోలార్ పథకాలను వినియోగించుకుని, పంటతోపాటు విద్యుత్ ద్వారా ఆదాయం పొందాలని ఆయన పిలుపునిచ్చారు.

విద్యుత్ రంగంలో సంస్కరణలు

నాణ్యమైన విద్యుత్తును అందించడం ద్వారా వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రజాప్రభుత్వం విద్యుత్ రంగంలో నిరంతరం పరిశోధనలు చేస్తూ అధునాతన సాంకేతికతను ప్రజలకు చేరువ చేస్తోందని భట్టి చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినప్పటికీ ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యల వల్ల ఎక్కడా అంతరాయం కలగలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 2023-24లో విద్యుత్ పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లు ఉండగా ప్రస్తుతం అది 18,542 మెగావాట్లకు చేరుకుందన్నారు. కేవలం రెండన్నర ఏళ్లలోనే సుమారు 3,542 మెగావాట్ల అదనపు డిమాండ్ పెరిగినా ప్రజలకు ఎక్కడా పవర్ కట్ లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను బలోపేతం చేయడం, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ ఉత్పత్తిని అంచనాలకు అనుగుణంగా పెంచడం జరిగిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్ల వల్ల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించగలుగుతున్నామని తెలిపారు.

తడిసిన ధాన్యాన్ని కొంటాం

నాణ్యమైన విద్యుత్ సరఫరా వల్ల రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా పెరిగిందన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దార్శనికతకు నిదర్శనమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన ప్రకటించారు. కళ్లాల్లో రైతుల కన్నీళ్లు చూడకూడదనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర తోనే ప్రభుత్వం సేకరిస్తోందని తెలిపారు.

మొక్కజొన్న కొనుగోళ్లు

రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఆర్థిక శాఖ నుంచి రూ.5,000 కోట్లు ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అదనంగా రూ.17,000 కోట్ల ప్రయోజనం చేకూరిందని తెలిపారు.

బుద్ధి మార్చుకోని ప్రతిపక్షాలు

ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలు, కొన్ని పత్రికలు వాస్తవాలను గమనించాలని ఆయన సూచించారు. రైతులకు అండగా ఉండటంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. కేవలం వార్తల్లో ఉండటం కోసమే మాజీ మంత్రి హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారన్నారు. పదేళ్ల పాలన చూశాకే ప్రజలు వారిని ఇంటికి పంపారని తెలిపారు. రైతులకు ప్రజా ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి వీఆరఎస్ నేతలు ఓర్వలేక పోతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. తమ రాజ్యం పోయిందన్న ఈర్ష్యతో విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆరఎస్ పదేళ్ల కాలంలో ఎంత కొనుగోలు చేసిందో.. రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ అంతా కొనుగోలు చేసిందన్నారు. దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆరఎస్ పార్టీకి ఆయన సవాల్ విసిరారు.పదేళ్లు మంత్రిగా చేసిన గౌరవాన్ని కాపాడుకోండి అని హరీష్ రావుకు డిప్యూటీ సీఎం సలహా ఇచ్చారు.

ధాన్యం కొనుగోలులో కేంద్రం అలసత్వం

రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా కేంద్రం నుంచి సరైన స్పందన లేదని విమర్శించారు. కళ్లాల్లో పర్యటిస్తున్న బీజేపీ నాయకులు కేంద్రం ఎందుకు ధాన్యాన్ని సేకరించడం లేదో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం కొనుగోలు చేసిన ప్రతి గింజను కేంద్రం తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు. ఖరీఫ్ 2025-26లో కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని విధించగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందన్నారు. రబీ 2025-26కు సంబంధించి కేంద్రం 51.60 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని ఇవ్వగా ప్రజా ప్రభుత్వం ఇప్పటికే 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందన్నారు. ఈ సీజన్ చివరి నాటికి 75 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు. బిజెపి నాయకులు మాయ మాటలతో రైతులను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. కేంద్రం తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ రైతులు ఉత్తర భారతదేశ రైతుల తరహాలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని ఆయన హెచ్చరించారు.

రైతులకు ప్రోత్సాహం

కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఉచిత విద్యుత్‌తోపాటు ఈసారి ధాన్యానికి మద్దతు ధరపై అదనంగా బోనస్ ఇస్తోందన్నారు. గత పదేళ్లుగా నిలిచిపోయిన మొక్కజొన్న కొనుగోళ్లను ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని తెలిపారు. మద్దతు ధరతో కొనుగోలు చేయడం వల్ల మొక్కజొన్న రైతులు కూడా ఎకరాకు రూ. 25,000 వరకు లాభపడ్డారని అన్నారు. రాష్ట్ర వనరులన్నింటినీ పోగు చేసి రైతులు, నిరుద్యోగ యువత, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, ట్రాన్స్ కో సిఎండి కృష్ణ భాస్కర్, టీజీ ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, రెడ్కో వైస్ చైర్మన్ అండ్ ఎండీ అనిల, ‘సుడా’ చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *