నన్నయనుండి నేటివరకు వచ్చిన సాహిత్యంలో ఏదో ఒకరూపంలో సామాజిక అంశాల ప్రస్తావన ఉంది. ప్రాచీన కాలంలో రాజనిష్టంగా సాహిత్య వ్యాసంగాన్ని కవులు కొనసాగించినా సంఘస్పర్శను వీడలేదనడానికి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. కవి, రచయిత, సంఘజీవిగా ఉండడమే ప్రధానమైన కారణం. సామాజికవిషయాలను తమ రచనలలో ప్రాచీనకవులు ఏదో ఒకరూపంలో వెల్లడించి సామాజికస్పృహను ప్రకటించారు. రాజభక్తి, దైవానురక్తి, మతానుకూలత, నీతి, శృంగారం, ఆహార విహారాదులు, వేషభూషణలు, ఆహార్యం, నమ్మకాలు వంటి అంశాలలో ప్రాచీనసాహిత్యంలో ఆలోచనాత్మకమైన సామాజిక సందర్భాలను అత్యద్భుతంగా వెల్లడించారు. 19వ శతాబ్దం చివరలో ప్రారంభమై 20వ శతాబ్దంలో వికసించి విస్తరించిన ఆధునికసాహిత్యం సమాజంలో అంతర్భాగమై సమస్యల పరిష్కారమార్గంగా, చైతన్యం నింపే శక్తిగా మారి లుప్తమైన మానవవిలువలను సరిదిద్దేందుకు తోడ్పడింది. ఈ క్రమంలోనే సాహిత్యంలో కనిపించే సువిశాల సమాజాన్ని దృశ్యమానంగా ఆవిష్కరిస్తూ ఆచార్య ఎన్ ఈశ్వర్ రెడ్డి వివిధసందర్భాలలో రాసిన వ్యాసాలతో ‘సాహిత్యంలో సమాజం’ విమర్శనాత్మక వ్యాససంపుటి వెలువడింది.
తొలివ్యాసం ఆలూరి బైరాగి కవిత్వం- అస్తిత్వ వేదనలో ప్రపంచ మానవపోకడను తెగేసి చెప్పిన కవిగా బైరాగి విశిష్ట దృష్టికోణాన్ని వివరించారు. మనిషిని ఈర్ష్యాద్వేష మోహపోహ వాంఛాకాంక్షల కీలలు దహిస్తుంటే చూస్తూ కూర్చోలేకపోయిన తాత్వికుడు అని బైరాగిని అభివర్ణించారు. అనుభూతివాదిగా, అస్తిత్వవాదానికి బలం చేకూర్చిన ఆధునిక రచయితగా, కవిత్వాన్ని మాధ్యమంగా చేసుకొని మాట్లాడినకవిగా బైరాగిని ప్రత్యేకంగా చూపారు. బైరాగి రాసిన నూతిలోగొంతుకలు కావ్యంలో కవిగా ఆయన పరమావధి ఏమిటో స్పష్టంగా చెప్పారు. ‘అమెరికా తెలుగు కథానిక- వస్తువైవిధ్యం’ వ్యాసంలో 2006లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన ‘అమెరికా తెలుగు కథానిక’ తొమ్మిదో సంపుటి, కథల్లోని జీవితచిత్రణను విశ్లేషించారు.
‘భావుకత కలిగిన అభ్యుదయకవి- ఆవంత్స సోమసుందర్’ వ్యాసంలో దేశప్రజలను చైతన్యపరిచి వారిగుండెల్లో త్యాగశీలతను నింపడానికి కృషిచేసిన కవిగా, విద్యాగంధం, ప్రాచీన సాహిత్య అధ్యయనశీలత, పాశ్చాత్య సాహిత్యవివేచనా దృక్పథం, కమ్యూనిజం నేర్పిన గతితార్కిక భౌతికవాద దృష్టి కలిగిన సోమసుందర్‌ను చిరస్మరణీయమైన సాహితీవేత్తగా చూపారు. విస్తృతమైన వస్తువైవిధ్యం- దళిత దృక్కోణంలో స్ఫూర్తిప్రదాత అంబేద్కర్ కావ్యం వ్యాసంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను సవివరంగా పరామర్శించారు. జల్లి రాజగోపాలరావు అంబేద్కర్ పేరుతో రాసిన దీర్ఘకవిత పూర్తిగా దళితదృక్కోణంలో శిల్ప, విషయ ప్రాధాన్యతతో ఎలా సాగిందో వివరించారు.
ద్రావిడ అస్తిత్వం ప్రకటించిన కన్నీటిగొంతు వ్యాసంలో రావణుడి చెల్లెలు శూర్పణఖ వేదనలోంచి పొంగిన కన్నీళ్ళు కావ్యమై ప్రవహించాయని వివరించారు. ఆచార్య కొలకలూరి ఇనాక్ కన్నీటిగొంతును ద్రావిడ స్త్రీ గొంతునుంచి వినిపించిన తీరును లోతుగా విశ్లేషించారు. శేషేంద్రకవిత్వం- పరిణామం వ్యాసంలో భాషలుదాటి, రాజకీయ సరిహద్దులుదాటి, కొండలుదాటి, సముద్రాలుదాటి ఎక్కడెక్కడ మనిషి ఉన్నాడో అక్కడక్కడికంతా పరుగులెత్తే మనస్వితే కవిత అన్నట్టుగా కవిత్వం ఉండాలన్న శేషేంద్రశర్మ ఆకాంక్షను విస్తృతీకరించి చూపారు. వైవిధ్యరచన- గుంటూరు సాహిత్యచరిత్ర వ్యాసంలో తెలుగుసాహిత్యచరిత్రలో గుంటూరుసీమ సాహిత్యచరిత్ర విడదీయరాని భాగమని చెప్పారు. శ్రీనాథుడు, వేమన, జాషువా, తుమ్మల సీతారామమూర్తి, ఏటుకూరి వెంకటనర్సయ్య, త్రిపురనేని, తుమ్మల బలిజేపల్లి, కొండవీటి వెంకటకవి, కరుణశ్రీ, దుబ్బలదాసు, చిట్రిప్రొలు కృష్ణమూర్తితో పాటు అనేకమంది గుంటూరుసీమ సాహిత్యకారుల విశిష్ట సృజన వైశిష్టాన్ని వివరించారు.
గురజాడ స్వరం- మార్పుకు శ్రీకారం వ్యాసంలో నవ్యపథానికి వేగుచుక్కగా, వెలుగుదారులు పరచిన మార్గదర్శిగా గురజాడను చూపారు. శాంతి అహింసలను బోధించిన కాందిశీకుడు కావ్యం వ్యాసంలో మహాకవి జాషువాచేతిలో పద్యప్రక్రియ ఎంత ప్రతిభావంతంగా సాగిందో విశ్లేషించారు. జాషువా రచించిన కాందిశీకుడు కావ్యం ప్రపంచశాంతిని, అహింసను ప్రతిపాదించిన తీరును, కల్పితకథయినా సందర్భం ఎంత ప్రయోజనకరమైందో వివరించారు. మాడభూషి సంపత్కుమార్ కవిత్వం- జీవితం : సమన్వయం- సందేశం వ్యాసంలో కవుల కవిత్వం జీవితం- పరస్పర పూరకాలేనన్న విషయాన్ని సంపత్కుమార్ విమర్శద్వారా విశ్లేషించిన తీరును ఈ వ్యాసం వివరించింది. ‘మానవీయతను అధిరోహించిన ఆరోహణ’ వ్యాసంలో మానవీయత పొంగులెత్తిన సినారె కావ్యమే ఆరోహణ అని తెలిపారు. సినారె కవిత్వానికి మనిషే ప్రమాణమంటూ మనిషి నా పల్లవి కవితావాక్యాలను ఉదాహరించారు.
‘మినీకవితకు సరికొత్తరూపం- రవ్వలు’ వ్యాసంలో రచయిత విశ్వేశ్వరవర్మ భూపతిరాజు వేసిన కొత్తప్రక్రియకు పునాదిరవ్వలు అని తెలిపారు. పదునైనవాక్యాలతో మనసును పులకింపజేసే రవ్వలు ప్రక్రియ కవుల నూతన చైతన్యానికి నిదర్శనమన్నారు. నన్నయ్యసూక్తి- పునర్మూల్యాంకనం వ్యాసంలో నానార్థాలతో కూడిన సూక్తులకు నిధిలాంటి నన్నయ కవిత్వతత్వాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించి చూపారు. తెలుగుకావ్యాల్లో శిల్పకళా సౌందర్యం వ్యాసంలో పుట్టపర్తి నారాయణాచార్యుల పెనుగొండలక్ష్మి, జాషువా తాజ్ మహల్ కావ్యాలలోని శిల్ప విశిష్టతను వివరించారు. ప్రపంచీకరణ ఊబిలో మగ్గంబతుకు వ్యాసంలో ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, విధానలోపాలతో చేనేతవృత్తి చితికిపోతుందని, రైతన్నలు, నేతన్నలు చావులను వెతుక్కుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
ఆధునిక తెలుగుకవిత్వం- ప్రపంచీకరణ పర్యవసానాలు వ్యాసంలో ప్రపంచాన్ని ఆధునిక సాంకేతికత గ్లోబల్ గుడిసెగా మార్చేసినాక జరిగిన విధ్వంసంతో పాటు కార్పోరేట్ వ్యాపార విషసంస్కృతి మిగిల్చిన మానని గాయాలను వివరించారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ జీవితం- సాహిత్యం వ్యాసంలో రాయలసీమ రాళ్ళలోనే పుట్టిన సృజన వజ్రంగా రాళ్ళపల్లిని ప్రస్తుతించారు. కవిగా, విమర్శకునిగా, గ్రంథ పరిష్కర్తగా రాళ్ళపల్లి అందించిన బహుముఖ సేవలను ప్రస్తావించారు.
రాయలసీమ ఫ్యాక్షన్ కథలు- పరిశీలన వ్యాసంలో రాయలసీమలో కక్షలు ఏర్పడడానికి కారణమైన సామాజిక అంశాలను, పాలెగాళ్ళ నుండి సంక్రమించిన ఆధిపత్య భావజాల సంస్కృతి 20 వ శతాబ్దం వరకు కొనసాగిన తీరును, ఫ్యాక్షన్ కథలలోని వివిధకోణాలను, శ్రమదోపిడీ, పేదల వేదనల్ని స్పష్టంగా వెల్లడించి చూపారు. పరిష్కారం, చుక్క పొడిచింది, నవ వసంతం, ఊబి వంటి కథలను విశ్లేషించి చూపారు. ఈ గ్రంథంలోని వ్యాసాలు దాదాపుగా కవులకు, వారి కవిత్వానికి సంబంధించినవే కావడం గమనార్హం. అనాదినుండి నేటిదాకా సాహిత్యంలో కనిపించిన సమాజాన్ని ఇందులో ఉన్న పద్దెనమిది వ్యాసాలు పరిపూర్ణంగా పరామర్శించాయి.
డా. తిరునగరి శ్రీనివాస్