తెలంగాణను “స్కిల్స్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్”గా మార్చడమే లక్ష్యం
ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణను “స్కిల్స్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్” గా తీర్చి దిద్దేందుకు జిల్లాలవారీగా ప్రత్యేక నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లో “డార్క్ మేటర్ టెక్నాలజీస్” పేరిట కెనడాకు చెందిన “కన్స్టలేషన్ సాఫ్ట్ వేర్” ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. “పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే నైపుణ్యమున్న మానవ వనరులు అవసరం. కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకున్న తర్వాత తమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చదువుకునే సమయంలోనే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాం. చదువు పూర్తయ్యే నాటికి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చి దిద్దుతున్నాం. ఫలితంగా పరిశ్రమల డబ్బు, సమయం ఆదా అవుతుంది” అని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. “మన దగ్గర టాలెంట్ కు కొదువ లేదు.
తక్కువ పెట్టుబడితో అద్భుత ఆవిష్కరణలను చేసే సత్తా ఉంది. మరి ఎందుకు డీప్ సీక్ లాంటి అధునాతన ఆవిష్కరణలను చేయలేకపోతున్నాం. ఇప్పటికైనా హైదరాబాద్ లో ఉన్న పరిశ్రమలు ఈ అంశంపై దృష్టి సారించాలని కోరురు. “జీసీసీలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నాయి. ఈ ఏడాది వాటి విలువ 46 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లుగా ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. వొచ్చే ఏడాది 60 బిలియన్ డాలర్లు, 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జీసీసీలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణను ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంలో వీటిని భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ ను జీసీసీల హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 400 జీసీసీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని ప్రముఖ సంస్థలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి” అని పేర్కొన్నారు.
“బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కు చెందిన 5 జీసీసీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఈ రంగంలో 10 లక్షల మంది నిపుణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. బీఎఫ్ఎస్ఐ కన్సార్షియం సహకారంతో డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సెకండియర్ నుంచే సంబంధిత సబ్జెక్టులను బోధిస్తున్నాం. పట్టా చేతికొచ్చే నాటికి వారంతా నిపుణులుగా తయారవుతారు. ఫలితంగా చదువు పూర్తయ్యే నాటికే ఉపాధి అవకాశాలు లభిస్తాయి” అని అన్నారు. “ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో కంపెనీలను స్థాపించేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం.
త్వరలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ కు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ప్రారంభించబోతున్నాం. కెనడాకు చెందిన కన్స్టలేషన్ సాఫ్ట్ వేర్ లో వేయికి పైగా కంపెనీలున్నాయి. ఈ సంస్థ భారత్ లోనే తన మొదటి జీసీసీని హైదరాబాద్‌లో డార్క్ మేటర్ టెక్నాలజీ పేరిట ప్రారంభించడం సంతోషదాయకం. ఈ సెంటర్ తో 800 మందికి ఉపాధి లభిస్తుంది .భవిష్యత్తులో ఈ సంఖ్య 2వేలకు చేరుతుందని అన్నారు. కార్యక్రమంలో కన్ట్సలేషన్ సర్వీసెస్ (పెర్సస్ డివిజన్) ప్రెసిడెట్ స్కాట్ స్మిత్, డార్క్ మేటర్ టెక్నాలజీస్ సీఈవో, సీఆర్వో సీన్ డుగాన్, చీఫ్ రిస్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ మైకేల్ హాక్, డార్క్ మేటర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రవి వర్మ పాల్గొన్నారు.