- ఇక్కడి డాక్టర్లకు ప్రపంచవ్యాప్త గుర్తింపు
- అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త దవాఖాన నిర్మిస్తున్నాం..
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
వైద్య విద్యకు ఉస్మానియా మెడికల్ కాలేజీ ఓ బ్రాండ్ గా నిలిచిందని, ఇక్కడి డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గోషా మహల్‌లో ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, డాక్టర్లు, సిబ్బంది వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు. వందేండ్లుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఘన చరిత్ర ఉస్మానియా హాస్పిటల్ సొంతమని కొనియాడారు. అలాంటి ఓ గొప్ప సంస్థకు వేదికైన పురాతన భవనం శిథిలావస్థకు చేరింది. ఆ భవనంలో వైద్య సేవలు అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా కొత్త ఉస్మానియా హాస్పిటల్ కోసం డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షించారు. ఆ ఆకాంక్షలను నిజం చేస్తూ నూతన ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసుకున్నామని దామోదర రాజనర్సింహ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఉస్మానియా హాస్పిటల్‌ను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. రాబోయే వందేళ్లు ప్రజలు గుర్తుంచుకునే ఈ వేడుకలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది.చర్లపల్లికో, మరో ప్రాంతానికో హాస్పిటల్‌ను తీసుకెళ్లాలని కొంత మంది ప్రతిపాదించారు. కానీ 1919 నుంచి వందేండ్లకు పైగా ఇక్కడి ప్రజలకు ఉస్మానియాతో అనుబంధం ఉంది.
అందుకే ఈ ప్రాంతంలోనే హాస్పిటల్ పెట్టాలని సీఎం నిర్ణయించారు. ఈ ప్రాంత ప్రజలకు ఉస్మానియా హాస్పిటల్ తో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఉస్మానియాకు దగ్గరగా ఉన్న గోషామహల్ స్థలాన్ని హాస్పిటల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిక చేశారని తెలిపారు. ఇక్కడ పోలీస్ శాఖకు ఇంకా 11 ఎకరాలకు పైగా స్థలం ఉంటుంది. హాస్పిటల్ కోసం స్థలం ఇచ్చిన పోలీస్ శాఖకు, గోషామహల్ ప్రజలకు అభినందనలు తెలిపారు. 26 ఎకరాల 30 గుంటల విశాలమైన ప్రాంగణంలో, 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉస్మానియా కొత్త హాస్పిటల్‌ను నిర్మిస్తున్నాం. ప్రస్తుతం ఉస్మానియాలో 1168 బెడ్ల ఉన్నాయి. కొత్త ఉస్మానియాలో 2 వేల బెడ్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో 500 బెడ్ల కెపాసిటీతో ఐసీయూ వొస్తుంది. ప్రస్తుత ఉస్మానియాలో 22 డిపార్ట్‌మెంట్లు ఉండగా, కొత్త హాస్పిటల్‌లో అదనంగా మరో 8 డిపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేస్తున్నాం.
ఉస్మానియాకు వొచ్చిన పేషెంట్‌కు అన్నిరకాల వైద్య సేవలు అందిస్తాం. ఇక్కడికి వచ్చిన పేషెంట్‌ను ఇంకో దగ్గరికి పంపించే పరిస్థితి ఉండదు. సుమారు 41 ఆపరేషన్ థియేటర్లు నయా ఉస్మానియాలో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. హాస్పిటల్ ప్రాంగణంలోనే డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలు ఉంటాయి. విద్యార్థులకు మరియు ఫాకల్టీకి అధునాతన వసతులతో కూడిన హాస్టల్ సదుపాయం, 750 సీట్ల కెపాసిటీతో ఆడిటోరియం, క్రీడా ప్రాంగణాలు ఉంటాయి. పేషెంట్ల అటెండర్ల కోసం ధర్మశాల నిర్మిస్తున్నామని, హాస్పిటల్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా ల్యాండ్‌స్కేప్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్థానికులకు ఇబ్బంది కలగకుండా హాస్పిటల్‌కు నలువైపులా విశాలమైన రోడ్లు, సుమారు 3 వేల వాహనాలు ఒకేసారి పార్కింగ్ చేసుకునేలా అండర్‌గ్రౌండ్ పార్కింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
అలాగే, స్కైవాక్ నిర్మాణం చేపడుతున్నామని, గోషామహల్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదని భరోసా ఇచ్చారు. ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్‌స్టేషన్, పోలీస్ అవుట్ పోస్ట్ వంటివి కూడా హాస్పిటల్ ప్రాంగణంలో ఉంటాయి. సుమారు రూ.2700 కోట్లతో నిర్మించే, ఈ కొత్త ఆస్పత్రిని రెండేండ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ ప్రారంభమయ్యాక, స్థానికుల వ్యాపారాలు పెరుగుతాయని మంత్రి దామోదర వెల్లడించారు.