– రమేష్ వ్యాఖ్యలపై ఎందుకు సమాధానం లేదు
– కెటిఆర్‌కు మంత్రి సీతక్క సవాల్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై29:బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. రాజ్యసభ ఎంపి సిఎం రమేష్ ఇంటికి వెళ్లిన విషయంపై కెటిఆర్ ఎందుకు స్పష్టత ఇవ్వడంలేదని అడిగారు. కెటిఆర్ అబద్దాలకోరు అనేది సిఎం రమేష్ మాటల్లో తెలుస్తుందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపితో బిఆర్‌ఎస్ కుమ్మక్కు కాలేదని కెటిఆర్ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కశాతం వోట్లు తేడా వొస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ వోట్లన్నీ బిజెపికి వెళ్లాయని.. కెటిఆర్ గుండెపై చేయి వేసుకొని ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని సీతక్క డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు తరువాత తన ఇంటికి కెటిఆర్ వొచ్చారని రాజ్యసభ ఎంపి సిఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కవితను విడుదల చేస్తే బిఆర్‌ఎస్‌ను బిజెపిలో విలీనం చేస్తానన్నారని సిఎం రమేష్ డియాతో చెప్పారు. తన వల్లే కెటిఆర్ గెలిచారని రమేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయని తనకు సంస్కారం అడ్డువస్తుందన్నారు. కవిత అరెస్ట్ తర్వాత నువ్వే నా ఇంటికి వచ్చావు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని అప్పుడే చెప్పావు. కవితను విడుదల చేస్తే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తానని నువ్వు చెప్పిన విషయం మరిచిపోయావా? అని ప్రశ్నించారు. అలాగే, ‘నా వల్లే నువ్వు ఎన్నికల్లో గెలిచావు. కేవలం 300 వోట్ల మెజారిటీతో గెలిచిన విషయం నీకు తెలుసు. నీ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నా సంస్కారం అడ్డువస్తోందని సీఎం రమేష్ అన్నారు. ఈ క్రమంలో కేటీఆర్‌కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. సీఎం రమేష్ ఇంటికి వెళ్లిన విషయంపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతారనేది ఎంపీ రమేష్ మాటల్లో చూశాం.. ఎన్ని అబద్ధాలు చెప్పినా.. కొద్దీ రోజుల్లో నిజం తెలుస్తుందని మంత్రి సీతక్క వెల్లడించారు.





